కార్తీక మాసంలో దీపదానం చేయడం వల్ల కలిగే పుణ్యం ఎంతంటే!

కార్తీకమాసంలో దీపాలు దానం చేస్తే ఎంతో  విశేష పుణ్యం లభిస్తుంది. దీపదానం గురించి  పద్మపురాణంలో అద్భుతమైన కథ కూడా ఉంది. ఆ కథేంటో తెలుసుకుంటే.. 

 కృతయుగాంతపు రోజులలో మాయాపురం అనే ఊరు ఉండేది. ఆ ఊరులో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు సూర్యోపాసకుడు. అతని కూతురు పేరు గుణవతి. తండ్రి ఆమెను చంద్రుడు అనే తన శిష్యుడికి ఇచ్చి పెళ్ళి చేశాడు. దేవశర్మకు మగపిల్లలు లేరు.  అందువల్ల అల్లుణ్ణి ఇల్లరికం తెచ్చుకున్నాడు.

ఒకరోజు అల్లుడు, మామ ఇద్దరూ కలసి అడవికి కట్టెలు తెచ్చుకోవడానికి వెళ్ళారు. అడవిలో ఒక రాక్షసుడు వాల్లిద్ధరినీ చంపాడు. సూర్యో పాసకుడు కావడం వల్ల దేవశర్మకూ, అతనితో పాటు అతని అల్లుడికీ  ఇద్దరికీ స్వర్గలోకప్రాప్తి కలిగింది.

తండ్రి, భర్తల మరణ వార్త తెలుసుకొని గుణవతి చాలా విచారించింది. వారికి చేయవలసిన శ్రాద్ధాది కర్మలు అన్నీ యథావిధిగా చేసింది. నైష్టిక జీవనం గడుపుతూ వచ్చింది. క్రమం తప్పకుండా ఆమె ప్రతి సంవత్సరం కార్తీక వ్రతం చేస్తూ ఉండేది. ముఖ్యంగా ఆ వ్రతంలో భాగమైన దీపదానోత్సవాన్ని ఆమె అతిభక్తితో చేస్తూ ఉండేది.

అలా కార్తీక వ్రతాన్ని ఎంతో భక్తితో ఆచరించే ఆమె ఒక కార్తీకమాసంలో గంగానదిలో స్నానం చేస్తూ అలాగే మరణించింది. కార్తీక వ్రతాచరణ పుణ్యం వల్ల ఆమె ఆత్మను దేవతల విమానంలో   దివ్యలోకానికి తీసుకెళ్లారు. .

వైకుంఠానికి దివ్య విమానంలో వచ్చిన గుణవతిని చూడడంతోటే విష్ణుమూర్తికీ, లక్ష్మీదేవికీ చాలా ఆనందం కలిగింది. ఆ సందర్భంలోనే  బ్రహ్మ వారిని ప్రార్ధించాడు. ఆ ప్రార్ధన ఫలితంగా విష్ణుమూర్తి కృష్ణుడిగా, లక్ష్మీదేవి రుక్మిణీదేవిగా, దేవశర్మ సత్రాజిత్తుగా, దేవశర్మ అల్లుడు చంద్రుడు అక్రూరుడుగా, వైకుంఠంలోని కల్పవృక్షము తులసి మొక్కగా, గుణవతి సత్యభామగా భూలోకాన అవతరించారు.

మొదట మానవ రూపంలో  ఉన్నప్పుడు కార్తీక వ్రతం ఆచరించిన ఫలితంగా ఈ జన్మలో అనంతమైన ఐశ్వర్యం, భర్త రూపంలో విష్ణుమూర్తిని ధ్యానిస్తూ కార్తీకదీపం దానం చేస్తూ రావడం వల్ల విష్ణువు అవతారాల్లో ఒకటైన కృష్ణుణ్ణి భర్తగా గుణవతి పొందిందని పద్మపురాణంలో ఉంది. అందుకే ఈ మాసంలో ప్రతి ఒక్కరూ దీపారాధన, దీప దానం చెయ్యాలని చెబుతారు.

                                 *నిశ్శబ్ద.


More Karthikamasa Vaibhavam