కార్తీకమాసంలో గరుడ పురాణంలో పేర్కొన్న ఈ నామాలు పఠిస్తే ఎంత పుణ్యమో!


వైదిక హిందూమతంలో 18 పురాణాలు,  4 వేదాలు ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక్కటి మనిషి జీవితానికి ఏదో ఒక సందేశాన్ని, మనిషి సందేహాలను తీరుస్తాయి.  గరుడ పురాణం 18 పురాణాలలో ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. చాలా ముఖ్యమైనది కావడం వల్ల గరుడ పురాణానికి మహాపురాణమనే ఖ్యాతి లభించింది. గరుడ పురాణానికి అధిపతి విష్ణువు. సాధారణంగా ప్రతి కుటుంబంలో ఎవరైనా మరణించిన సమయంలో గరుడ పురాణాన్ని పఠించే సంప్రదాయం కూడా  ఉంది. ఇలాంటి  సమయంలో ఇంట్లో గరుడ పురాణాన్ని పఠించడం ద్వారా మరణించిన వారి ఆత్మకు మోక్షం లభిస్తుందని నమ్ముతారు. మరీ ముఖ్యంగా శివకేశవులకు ఎంతో పెద్ద పీట వేసే కార్తీకమాసంలో గరుడ పురాణాన్ని పఠించినా, అందులో పేర్కొన్న నామాలను పఠించినా ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

గరుడ పురాణంలోని నీతిసార విభాగంలో విష్ణువు రోజువారీ జీవితానికి సంబంధించిన నియమాలు,  నిబంధనల గురించి కూడా వివరించాడు. ఈ నియమ నిబంధనలు  అనుసరించడం ద్వారా  మనిషి జీవితంలో  చింత లేకుండా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతాడని పురాణ పండితులు కూడా చెబుతున్నారు. అందుకే  గరుడ పురాణాం మనిషిని  జీవితంలో  సత్కార్యాలు చేయడానికి ప్రేరేపించి ముక్తిని అందించే గ్రంథంగా కూడా పేర్కొన్నారు.  గరుడ పురాణంలో  భగవంతునికి సంబంధించి కొన్ని పేర్లు చర్చించబడ్డాయి, వీటిని క్రమం తప్పకుండా గుర్తుచేసుకోవడం లేదా జపించడం ద్వారా జీవితంలో  చింతలు,  సమస్యల నుండి విముక్తి పొందవచ్చు. వీటి గురించి వివరంగా తెలుసుకుంటే..

విష్టులును శ్రీహరి అని కూడా అంటారు. 'హరి' నామాన్ని రోజూ జపించడం వల్ల ఎంతో గొప్ప ఫలితం లభిస్తుందని  గరుడ పురాణంలో పేర్కొన్నారు. హరి నామాన్ని ప్రతిరరోజూ జపించడం ద్వారా విష్ణువు అనుగ్రహం పొంది జీవితంలోని కష్టాలన్నీ  తొలగిపోతాయి. అలాగే "హరి" నామాన్ని జపించేవారు మరణానంతరం  శ్రీ హరి పాదాల చెంతకు చేరుకుంటారని కూడా గరుడ పురాణం పేర్కొంది.

గరుడ పురాణలో ఉన్న మరొక ముఖ్య విషయం ప్రతి వ్యక్తి కనీసం రోజుకు ఒక్కసారైనా శ్రీమహావిష్ణువు దశావతార నామాలను జపించాలి.

అంతే కాకుండా వ్యక్తి  క్రమం తప్పకుండా మహావిష్ణువును  పూజించాలని, దాంతోపాటు  శివ నామాన్ని కూడా జపించాలని చెప్పబడింది.

ప్రతిరోజూ మహావిష్టువు నామాలతో పాటు  శివ నామం లేదా శివుడికి సంబంధించిన మంత్రాలను జపించే వ్యక్తులు  అన్ని చింతల నుండి విముక్తి పొంది సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తారు.

ఇక పాప కర్మల నుండి విముక్తి పొందడానికి గరుడ పురాణం సూచించిన మంత్రం లేదా నామం.. నారాయణ మంత్రం. "ఓం నమో నారాయణాయ" అనే నామాన్ని లేదా మంత్రాన్ని ప్రతిరోజూ జపిస్తుంటే పాపకర్మల నుండి విముక్తి పొందుతారు.

                                           *నిశ్శబ్ద.


More Karthikamasa Vaibhavam