యుద్ధానికి సిద్ధమై వెళ్లిన రావణుడు!

ధూమ్రాక్షుడు, వజ్రదంష్ట్రుడు ఇద్దరూ యుద్ధంలో మరణించారని తెలియగానే  రావణుడు అకంపనుడు అనే రాక్షసుడిని పంపాడు. ఆ అకంపనుడు యుద్ధానికి వస్తుండగా ఆయన ఎడమ కన్ను అదిరింది, కారణం లేకుండా అతని  కంఠం బొంగురుపోయింది, పక్షులు, మృగాలు అతని చుట్టూ తిరుగుతూ దీనంగా ఏడుస్తున్నాయి. ఎత్తుపల్లాలు లేని మార్గంలో వెళుతున్న గుర్రాలు తొట్రుపడి మోకాళ్ళ మీద కిందపడి పైకి లేచాయి.  అకంపనుడు కూడా పశ్చిమ ద్వారం నుండే బయటకి వెళ్ళాడు. ఆయన కొంతసేపు భయంకరమైన యుద్ధం చేసి వానరాలని కొట్టాడు. తరువాత హనుమంతుడు ఆయన మీదకి ఒక పర్వతాన్ని విసరగా దానిని ముక్కలు చేశాడు. తరువాత హనుమంతుడు వేసిన ఒక పెద్ద చెట్టుని 14 బాణములతో కొట్టి బద్దలుచేశాడు. ఆ తరువాత హనుమంతుడు ఇంకొక పెద్ద చెట్టుని పట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తూ దారిలో ఉన్న రాక్షసులని కొట్టుకుంటూ, ఏనుగుల్ని ఎడమ చేతితో విసిరేస్తూ మహా రౌద్రరూపంతో ఆ చెట్టును పట్టుకెళ్ళి అకంపనుడిని కొట్టాడు. ఆ దెబ్బకి వాడు పచ్చడై చనిపోయాడు.

అకంపనుడు కూడా చనిపోయాడని తెలియగానే  రావణుడు తన సర్వసైన్యాధికారి అయిన ప్రహస్తుడిని పిలిచి "ప్రహస్త। యుద్ధం చాలా తీవ్రంగా ఉంది. ఇప్పుడు నేను వెళ్ళాలి, కుంభకర్ణుడు వెళ్ళాలి, నికుంబుడు వెళ్ళాలి లేకపోతే తత్తుల్యమైన పరాక్రమము ఉన్న నువ్వు వెళ్ళాలి. వెళ్ళిన వాడు తిరిగి రావడం లేదు, ఇప్పుడు కాని నువ్వు వెళితే యుద్ధం చేద్దాము. మనం యుద్ధం చెయ్యలేము అని నువ్వు అంటే యుద్ధం ఆపేద్దాము" అన్నాడు.

అప్పుడు ప్రహస్తుడు "మీరు ఈ మాట ఇంతకముందు ఒకసారి సభలో అడిగారు. అప్పుడు కొంతమంది సీతమ్మని ఇచ్చేయ్యండి" అన్నారు. మీరు అప్పుడే ఇవ్వలేదు. ఇప్పుడు యుద్ధం ఆపడమేమిటండి. యజ్ఞములో వేసిన దర్భలా వెళ్ళి పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు నన్ను వెళ్ళమనా మీ ఉద్దేశం" అన్నాడు.

అప్పుడు రావణుడు "ప్రహస్త!! నీ కంఠం గట్టిది, నువ్వు యుద్ధానికి వెళ్ళి గట్టిగా అరువు. వానరులకి యుద్ధం చెయ్యడం రాదు, వారు చపలబుద్ధులు. నువ్వు గట్టిగా అరిస్తే అన్ని వానరాలు పారిపోతాయి. అప్పుడు యుద్ధ భూమిలో ఒక్క రామలక్ష్మణులు తప్ప ఎవరూ ఉండరు, అప్పుడు నువ్వు వాళ్ళని సునాయాసంగా కొట్టేయ్యచ్చు" అన్నాడు. 

అప్పుడా ప్రహస్తుడు రావణుడికి ప్రదక్షిణ చేసి, రథానికి ప్రదక్షిణ చేసి కొన్ని లక్షల సైన్యంతో యుద్ధానికి వెళ్ళాడు. ఈయనకి కూడా చాలా అపశకునాలు కనపడ్డాయి. ఈయన కూడా మిగతా వాళ్ళలానే వాటిని లెక్కచెయ్యకుండా తూర్పు ద్వారంగుండా ముందుకెళ్ళాడు.

అప్పుడు ప్రహస్తుడికి నీలుడికి యుద్ధం జరిగింది. ప్రహస్తుడు చాలా గొప్ప యుద్ధం చేసి ఎందరో వానరాలని చంపాడు. ప్రహస్తుడు నీలుడి మీద బాణాలని ప్రయోగిస్తే, ఆబోతు మీద వర్షం పడితే అది ఎంత సంతోషంగా ఉంటుందో, నీలుడు కూడా ఆ బాణాలు పడుతుంటే అంత సంతోషంగా ఉన్నాడు. నీలుడు ఒక చెట్టుని పెకలించి ప్రహస్తుడి రథాన్ని కొట్టాడు, అప్పుడా రథం పడిపోయింది. తరువాత ఆయన ఒక పెద్ద సాల వృక్షంతో ప్రహస్తుడి గుర్రాలని కొట్టాడు. ఆ తరువాత ఒక శిలని తీసుకొని వచ్చి ప్రహస్తుడి మీద పడేశాడు. దాంతో ఆ ప్రహస్తుడు కూడా మరణించాడు.

ప్రహస్తుడు మరణించాడన్న వార్త విన్న రావణుడు ఉద్విగ్నతని పొంది, తన సైన్యం అంతటినీ పిలిచి "ఇప్పుడు నేనే యుద్ధానికి వెళుతున్నాను. నేను బయటకి వెళ్ళాక వానరాలు లోపలికి రావచ్చు. అందుకని మీరందరూ జాగ్రత్త వహించి కోట శిఖరముల మీద నిలబడండి" అని చెప్పి రథం ఎక్కి, సైన్యాన్ని తీసుకొని యుద్ధానికి వెళ్ళాడు.

                                      నిశ్శబ్ద.


More Purana Patralu - Mythological Stories