గూఢచారుల విషయంలో రాముడి ప్రవర్తన!

శుకుడిని పట్టుకున్న తరువాత రాముడు విభీషణుడిని పిలిచి "విభీషణా!! నువ్వు శుకుడిని తీసుకెళ్లి మన వానర సైన్యం అంతా చూపించు. ఆ తరువాత అతడిని వదిలెయ్యండి వెళ్ళిపోతాడు" అని చెప్పాడు.

రాముడి ఆజ్ఞ మీద విభీషణుడు శుకుడికి వానరసైన్యం అంతా చూపించాడు. 

శుకుడు వానర సైన్యం అంతా చూశాక తిరిగి రావణుడి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు రావణుడు రెక్కలు తెగిపోయిన శుకుడిని చూసి "రెక్కలు విరిగిపోయాయే" అని వెక్కిరించి హేళనగా నవ్వాడు.

అప్పుడు శుకుడు రావణుడితో "నీలాంటి దుర్మార్గుడు కాదు రాముడు. అక్కడి వానరులు నన్ను పట్టుకుని గూఢచారిని వదలకుడదు అని మొదట రెక్కలు విరిచేశారు, ఆ తరువాత వాళ్ళు నన్ను చంపుతుంటే రాముడు నా ప్రాణాలు కాపాడాడు.

 "సుగ్రీవుడికి రావణాసుడు చెప్పమన్న మాట చెప్పి పోదామని వచ్చాను" అని నేను చెప్పాను. అప్పుడు రాముడు ఎంతో ప్రశాంతంగా నవ్వుతూ "వానరసైన్యం మొత్తాన్ని చూసావా??" అని అడిగాడు.

నేను "లేదు చూడలేదని" సమాధానం చెప్పాను. 

అప్పుడు ఆయన విభీషణుడిని పిలిచి నాకు వానరసైన్యం చూపించి ఆ తరువగా వదిలేయమన్నాడు. అలా రాముడు నన్ను ప్రాణాలతో విడిచిపెడితే వాళ్ళ సైన్యాన్ని చూసి వచ్చాను. ఆ సైన్యం సామాన్యమైన సైన్యం కాదు. అందులో అరవీర భయంకరులైన వానరులు ఉన్నారు. వారు సముద్రాన్ని దాటి వచ్చేశారు. వాళ్ళందరూ నిన్ను మట్టుపెట్టకముందే నా మాట విని సీతమ్మని విడిచిపెట్టవయ్యా, వానరులందరినీ గరుడ వ్యూహంగా నిలుచోబెట్టారు. శిరస్థానం దగ్గర రాముడు, లక్ష్మణుడు నిలబడ్డారు. హృదయ స్థానములో అంగదుడు నిలబడ్డాడు. కుడి వైపున ఋషభుడు, ఎడమ వైపున గంధమాదనుడు. వెనుక భాగములో సుగ్రీవుడు నిలబడ్డారు. అలా కొన్ని కోట్ల కోట్ల వానరాలని నిలబెట్టారు" అన్నాడు.

రావణుడు కోపంగా ఆ శుకుడిని అక్కడినుండి పంపేసాడు. కొంచెం సేపటి తరువాత  రావణుడు శుభ, సారణులు అనే మరో ఇద్దరు గూఢచారులని పిలిచి వానర సైన్యాన్ని చూసి, ఎంత సైన్యం ఉందో లెక్కపెట్టి రమ్మన్నాడు. ఆ ఇద్దరు గూఢచారులు ప్రచ్ఛన్న రూపాలలో ఆకాశంలో ఉండి వానర సైన్యం ఎంత ఉందో అని చూస్తుండగా విభీషణుడు వాళ్ళని పసిగట్టి రాముడి దగ్గరికి తీసుకెళ్ళి "వీళ్ళు దుర్మార్గులు, అందుకని వీళ్ళని బంధించి తీసుకొచ్చాను" అన్నాడు. ఇంతకముందు శుకుడితో ఎలా మాట్లాడాడో అలానే ఆ ఇద్దరు గూఢచారులతో రాముడు మాట్లాడి, విభీషణుడితో వాళ్ళని పంపించి సైన్యాన్ని చూడమన్నాడు.

ఆ శుభ సారణులు వానర సైన్యాన్ని చూసి, రావణుడికి ఆ సైన్యం గురించి వివరించారు. అప్పుడు రావణుడు "వాళ్ళందరూ 100 యోజనాల సముద్రాన్ని దాటి వచ్చేశారు అంటున్నారు కదా, వాళ్ళని ఒకసారి నాకు చూపించండి" అన్నాడు.

                                        ◆నిశ్శబ్ద.


More Purana Patralu - Mythological Stories