శంబర పోలమాంబ సిరిమానోత్సవం గురించి
మీకు తెలుసా?
ఉత్తరాంధ్ర ప్రజల ఆర్యాధ్యదేవత శ్రీశంబర పోలమాంబ సిరిమానోత్సవం మంగళవారం విజయనగరం జిల్లా మక్కువ మండలం శంబరలో జరగనుంది. గ్రామ దేవత పోలమాంబ అమ్మవారి జాతర నేటి(మంగళవారం) నుండి 3రోజులు పాటు ఘనంగా జరుగనున్నది. ప్రతియేట జనవరి చివరివారంలో జరిపే ఈ పండుగకు ఈ ఏడాది కూడా అధికార్లు అన్ని రకాల చర్యలు చేపట్టారు. ప్రతి యేట సంక్రాంతి పండుగ రోజుకు ముందు వచ్చే మంగళవారం గ్రామదేవత పోలమాంబను గ్రామంలోనికి తెస్తారు. పోలమాంబ శంబర గ్రామంలో పుట్టిపెరిగినందున గ్రామస్తులంతా పోలమాంబను ఆడపిల్లగా భావిస్తారు. సంక్రాంతి పండుగకు ప్రతి ఆడపిల్ల పుట్టింటికి వెళ్లే ఆనవాయితి ఉంది గనుక పోలమాంబ అమ్మవారిని సంక్రాంతి రోజుకు ముందు వచ్చే మంగళవారం గ్రామంలోనికి తెస్తారు. సంక్రాంతి పండుగ తరువాత వచ్చే మంగళవారం అమ్మవారికి పూజలు నిర్వహించి ఆతరువాత వచ్చే మంగళవారం అమ్మవారి సిరిమానోత్సవం జరిపించటం అనాధిగా వస్తున్న ఆనవాయితి. ఈ లెక్కన ఈ నెల 27నాటి రాత్రి తోలేళ్ళు 28నాటి మధ్యాహ్నం సిరిమానోత్సవం, 29నాటి అనుపోత్సవం పండుగను ఘనంగా నిర్వహించనున్నారు.ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, చత్తీష్‌గఢ్, మహారాష్టల్ర నుంచి కూడా భక్తులు ఈ సిరిమానోత్సవంలో పాల్గొంటారు. పోలమాంబ జాతరకు సంబంధించి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి.
దశాబ్దాల క్రిందట ఈప్రాంతాన్ని ప్రస్తుత విశాఖ జిల్లా తని ప్రాంత జమీందార్లు పాలించేవారు. గ్రామస్తల ఆవసరం నిమిత్తం అప్పట్లో జమిందార్లు త్రాగునీటి చెరువును త్రవ్వించేందుకు నిర్ణయించారు. చెరువు త్రవ్వకానికి ప్రతి ఇంటి నుండి ఒక ఏరు(రెండెద్దులు కట్టిన నాగలి) రావాలని ఆజ్ఞాపించారు. శంబర పోలమాంబ తండ్రికి ఎద్దుల్లేవు. రాజాజ్ఞ దిక్కరించిన నేరానికి శిక్షపడుతుందని దిగాలుగా ఉన్న తండ్రిని చూసి పోలమాంబ తన మహిమను గ్రామస్తులకు తెలపాలని నిర్ణయించుకుంది. తన మహిమతో తెల్లారేసరికి రెండెద్దులు ఇంటి ముందు ఉండేలా చేసింది. రెండెద్దులతో ఏరు పూసి చెరువు త్రవ్వకంలో పాల్గోనేందుకు తండ్రిని పంపించి ఏరులన్ని నేలను దున్నుతుండగా పోలమాంబ సృష్టించిన ఎద్దులు రెండు ఆందరూ చూస్తుండగా పులులు గామారాయి. పులులను చూసి భయపడి అందరూ పారిపోగా రెండు పులులు మొత్తం నేలను దున్ని అందరు చూస్తుండగా ఎదురుగా ఉన్న కోండపైకి ఎక్కిరాళ్లుగా మారాయి. ఆరాళ్ళను పులి రాళ్ళని పిలుస్తు ఇప్పటికి శంబర గ్రామస్ధులు పూజిస్తుంటారు. పోలమాంబకు యుక్త వయస్సు రావటంతో ఆమెకు వివాహం చెయ్యాలని తండ్రి మేనత్తలు నిర్ణయించారు. తాను వివాహం చేసుకోనని గ్రామ దేవతగా అవతరించనున్నానని పోలమాంబ చెప్పిందట వివాహం జరిగిన తరువాతే పేరంటాలుగా గ్రామ దేవతగా అవతరించాలని మేనత్త నచ్చ జెప్పటంతో పోలమాంబ వివాహం చేసుకొనేందుకు అంగీకరించింది. స్వతహాగా అందగత్తె అయిన పోలమాంబ రూపాన్ని తలిదండ్రులు మేనత్తలు మినహా గ్రామస్ధులెవ్వరూ చూడలేరు. వివాహ సమయంలో నైనా ఆమెను చూడవచ్చని గ్రామస్తులు భావించారు. గ్రామస్తుల భావనలకు భిన్నంగా వివాహం చేసుకుంటానని పోలమాంబ ఆంక్ష విధించింది. తనను పెళ్ళి చేసుకోబోయే వ్యక్తి ముట్టుకున్న పూల మాలను మేనత్త చేతుల మీదుగా తెప్పించుకోని మెడలో వేసుకోని వివాహం జరిగిందని పించింది. వివాహం అనంతరం పల్లకిలో అత్తారింటికి బయలు దేరింది. ఆ సమయంలో నైనా ఆమెను చూడాలని గ్రామస్ధులు ఉబలాటపడ్డారు. గ్రామస్తుల కంటపడకుండా మెరుపు తీగ మాదిరిగా ఇంట్లో నుండి పల్లకిలోనికి వెళ్ళింది. భర్త గుర్రంపై ముందు వెళ్తుండగా వెనుక పల్లకిలో మేనత్తతో పోలమాంబ వెళ్తుంది. శంబర గ్రామ పోలిమేరలకు పల్లకి చేరుకోగానే పల్లకిని దించమని బోయలను ఆదేశించింది. పల్లకిని నేల పైకి దించిన వెంటనే ఆమె సమీపాన గల చెట్టు వెనక్కు వెళ్ళింది. ఎంత సేపటికి ఆమె వెనక్కు రాకపోయే సరికి చెట్టుచాటుకు మేనత్త వెళ్ళి చూడగా అప్పటికే పోలమాంబ పీకలలోతు వరకు భూమిలోపలికి వెళ్ళింది. ఈ దృశ్యాన్ని చూసి దిగ్భ్రాంతి చెందిన మేనత్తతాను కూడా నీతో (పోలమాంబతో) వచ్చేస్తాననటంతో సమీపాన భూమిపై అక్షింతలు జల్లమని చెప్పగా మేనత్త అక్షింతలు జల్లగా భూమిలోపల ప్రవేశానికి అవకాశం రావటంతో మేనత్త కూడా తల బాగం కనిపించేలా భూమిలోనికి దిగింది. ఈ సంగతి తెలియక ముందు గుర్రం మీద వెల్తున్న భర్త వెనక్కి వచ్చిబోయలను అడగ్గా చెట్టుచాటుకు వెళ్ళి చాలా సేపయ్యిందని ఇంకారాలేదని చెప్పడంతో భర్త చెట్టుచాటుకు వెళ్ళి చూడగా తల భాగం కనిపించే రీతిలో పోలమాంబ, మేనత్తలు ఉండటాన్ని చూసి భర్త, బోయలు భయభ్రాంతులకు గురయ్యారు. తాను గ్రామదేవతగా వెలయనున్నానని ఆకారణంగా వేరే మహిళను వివాహం చేసుకోమని భర్తకు చెప్పింది. ఆనాటి నుండి పోలమాంబను గ్రామస్తులు గ్రామ దేవతగా ఆరాధిస్తు ప్రతియేట జాతరను నిర్వహిస్తారు. ఇప్పటికి తుని జమీందారి వంశీయులు జాతర రోజున పసుపు కుంకాలు, చీరను పంపిస్తుంటారు.
సోమవారం రాత్రి తోలేళ్ళు మంగళవారం మద్యాహ్నం సిరిమానోత్సవం, బుధవారం అనుపోత్సవం జరుగుతుంది.
