భాద్రపద అమావాస్య రోజు ఇలా చేస్తే మరణించిన పెద్దలు సంతోషిస్తారట..!
హిందూ క్యాలెండర్ లో ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. సాధారణంగా ప్రతి మాసంలో వచ్చే పండుగలు, వ్రతాలు, శుభకార్యాలు, గ్రహణాలు వంటి వాటి గురించి చాలా చర్చలు జరుపుతూ ఉంటారు. కానీ చాలామందికి పితృ పక్షాల గురించి తెలియదు. పెద్దలు ఉన్న కుటుంబాలలోనూ, మరణించిన పెద్దలకు శాస్త్రోక్తంగా కర్మలు నిర్వహించే వారికి మాత్రమే పితృ పక్షాల గురించి అవగాహన ఉంటుంది. ముఖ్యంగా పితృ పక్షాలలో తర్పణాలు, శ్రాద్ద కర్మలు నిర్వహిస్తుంటారు. పిండప్రదానం చేస్తుంటారు. ఇలాంటి వారు భాద్రపద అమావాస్య రోజు ఒక నిర్ణీత సమయంలో నైవేద్యాలు పెట్టడం ద్వారా మరణించిన పెద్దలు సంతోషిస్తారు.
ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో పితృ పక్షాలు వస్తాయి. ఈ ఏడాది పితృ పక్షాలు అక్టోబర్ 2వ తేదీ వరకు ఉంటాయి. అక్టోబర్ 2వ తేదీ భాద్రపద అమావాస్య. ఈ రోజున మరణించిన పెద్దలకు తర్పణం, పిండప్రదానం, నైవేద్యం ఏ సమయంలో చేయాలంటే..
పితృ అమావాస్య..
వైదిక క్యాలెండర్ ప్రకారం పితృ అమావాస్య అక్టోబర్ 1 వ తేదీ రాత్రి 9:39 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇది అక్టోబర్ 3వ తేదీ ఉదయం 12:19 గంటల వరకు ఉంటుంది. ఉదయ తిథి ప్రకారం అమావాస్య అక్టోబర్ 2వ తేదీగా పరిగణిస్తారు. అక్టోబర్ 2 వ తేదీ సంపూర్ణ అమావాస్య ఉంది. తర్పణ పూజ సాధారణంగా మధ్యాహ్న సమయంలో నిర్వహిస్తారని చెబుతున్నారు. ఈ సమయంలో మరణించిన పెద్దలకు చేసే నైవేద్యాన్ని పెద్దలు స్వీకరిస్తారట. అక్టోబర్ 2వ తేదీ మధ్యాహ్నం 1:21 నిమిషాల నుండి 3:43 గంటల మద్య తర్పణం వదిలితే మంచిది అంటున్నారు.
పితృ అమావాస్య రోజు మరణించిన పెద్దలందరికీ శ్రాద్దం నిర్వహించడం చాలా శ్రేయస్కరం. మరీ ముఖ్యంగా మరణించిన పెద్దలు ఏ తేదీన మరణించారు, వారు ఏ తిథిలో మరణించారు, ఏ సమయంలో మరణించారు అనేది తెలియనప్పుడు వారికి శ్రాద్దాన్ని పితృ అమావాస్య రోజే చేస్తుంటారు. ఈ రోజు చేయడమే మంచిది కూడా.
తర్పణం వదిలే పద్దతిని పెద్దలు, పండితులు, శ్రాద్ద నిర్వాహణ బాగా తెలిసినవారు, శ్రాద్ద కర్మలు చేయించే బ్రాహ్మణుల సూచన సలహాతో ఆయా నియమాలు పాటిస్తూ చేయడం మంచిది. తెలిసీ తెలియని పద్దతిలో ఎప్పుడూ ఈ కర్మలు నిర్వహించరాదు. పితృ దేవతలు సంతృప్తి చెందాలంటే శ్రాద్ద నిర్వహణను భక్తితో నిర్వహించాలి. పెద్దలకు ఇష్టమైన ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించాలి.
*రూపశ్రీ.