పంచభూత లింగ క్షేత్రాలు
లింగోద్భవ పుణ్యకాలంలో శివస్మరణ, ముక్తిదాయకమంటారు. నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశాలన్నిటా వ్యాపించి ఉన్న పంచభూతాత్మ స్వరూపుడు, సాకారుడు, నిరాధరుడు అయిన లయకారుడు ఆ మహాశివుడు. ఈ పంచభూతాత్ముని పంచభూతలింగాలు నెలకొన్న పుణ్యక్షేత్రాలు కాంచీపురం, జంబుకేశ్వరం, అరుణాచలం, శ్రీకాళహస్తి, చిదంబరం.
* పంచ భూతాలలో భూమికి ప్రతీకగా ఆ మహాదేవుడు పృథ్వీ లింగ రూపాన ఏకాంబరేశ్వరుడిగా పూజలందుకునే పుణ్యక్షేత్రం కాంచీపురం. ఇది తమిళనాడులో ఉంది. పార్వతీదేవి ఇక్కడ శివుని గురించి ఘోర తపస్సు చేసిందనీ, ఇసుకతో శివలింగం తయారు చేసి అందులో ఐక్యం అయ్యిందనీ స్థలపురాణం చెబుతోంది. మట్టితో తయారయింది కాబట్టి ఈ లింగాన్ని నీటితో అభిషేకించరు. మల్లెపూలతో అర్చిస్తారు. ఇక్కడి అమ్మవారు కామాక్షీదేవి. ఈ ఆలయంలో వెయ్యి ఎనిమిది శివలింగాలుంటాయి. ఈ ఆలయ ప్రాంగణంలో మూడువేల ఐదువందల ఏళ్ళనాటిదని చెప్పే మామిడి చెట్టు ఒకటుంటుంది. దానికున్న నాలుగు శాఖలూ నాలుగు రకాల పళ్లను కాస్తాయంటారు. ఆ శాఖలూ నాలుగు వేదాలకు ప్రతిరూపాలని భక్తుల నమ్మకం.
* ఇక హరుడు జల తత్వాన వెలసిన క్షేత్రం జంబుకేశ్వరం. ఇక్కడి లింగం కిందిభాగం నుంచి సర్వకాల సర్వావస్థల్లోనూ నీరు ఊరుతుంటుంది. ఇక్కడి గర్భగుడి ముఖద్వారం ఎత్తు నాలుగే అడుగులు. ఈ క్షేత్రంలో అమ్మవారు అఖిలాండేశ్వరీ దేవి. ఇక్కడ శివుడు అమ్మవారికి జ్ఞానోపదేశం చేశాడంటారు. వారిరువురి మధ్య గురుశిష్య సంబంధం ఉంది కాబట్టి ఇక్కడ శివపార్వతుల కల్యాణం జరగదు.
* ఇక అగ్నికి ప్రతీకగా తేజోరూపాన హరుడు వెలసిన క్షేత్రం అరుణాచలం. బ్రహ్మ, విష్ణువులు 'ఎవరుగొప్ప' అని వాదించుకుంటుండగా ఆ సంవాదాన్ని నివారించేందుకు శివుడు తేజోలింగ రూపంగా వెలసింది ఇక్కడేనట. అలా వెలసినందుకే ఈ అరుణాచలం చుట్టూ ప్రదిక్షణలు చేస్తే సాక్షాత్తూ ఆ స్వామి ప్రదక్షిణ చేసినట్టే అంటారు.
అరుణాచలం ఆలయం ప్రాంగణంలోని మూడోప్రాకారంలో పంచభూత లింగాల్లో మిగితావైన ఏకాంబరేశ్వర, జంబుకేశ్వర, శ్రీకాళహస్తీశ్వర, చిదంబర లింగాల ఆలయాల నమూనాలను దర్శించవచ్చు. అందుకే అన్ని చోట్లకూ వెళ్ళలేకపోతే ఒక్క అరుణాచలాన్ని దర్శిస్తే పంచభూత ఆలయాలని ఒకచోట దర్శించవచ్చు. అరుణాచలం గురించి ఆలోచిస్తే చాలు మోక్షం లభిస్తుందట.
* ఇక పంచభూత లింగాలలో నాలుగోది వాయులింగం. మిగిలిన నాలుగు తమిళనాడులో వుంటే ఇదొక్కటే మన రాష్టంలో ఉంది. అదే శ్రీకాళహస్తి. దక్షిణకైలాసంగా పేరొందిన ఈ క్షేత్రంలో శివలింగం గుండ్రంగా, నున్నగా ఉండదు. నలుపలకలుగా తెల్లగా ఉంటుంది. ఈ లింగానికి ఎదురుగా ఉన్న దీపాలు గాలికి రెపరెపలాడుతుంటాయట.
రాహు, కేతు, సర్ప, దోష నివారణ పూజలకు ఈ క్షేత్రం ప్రసిద్ధి. మరో విశేషం ఏంటంటే శ్రీకాళహస్తీశ్వరుణ్ని ఇంతవరకూ మానవమాత్రు లెవరూ ముట్టలేదట. అభిషేకాలన్ని ఉత్సవమూర్తికే జరుగుతాయి.
* ఇక ఆఖరి పంచభూత లింగక్షేత్రం చిదంబరం. చిదంబరం రహస్యం అంటారే ఏంటో తెలుసా? ఆకాశ రూపాన్ని భోళాశంకరుడు కొలువై ఉన్న క్షేత్రం చిదంబరం. ఆకాశమంటే అనంత శూన్యం కదా. అందుకే ఇక్కడి గర్భగుడిలో లింగరూపం కనిపించదు. ఆ ప్రదేశం ఖాళీగా ఉంటుంది. రోజూ అర్చకులు పూజచేసి కొద్దిసేపు ఆ తెరను తీస్తారు. కానీ అక్కడ ఏమీ ఉండదు. అదే చిదంబర రహస్యం. ఇక్కడ గర్భగుడిలో స్వామి మూడు రూపాలలో ఉంటాడట. సంపూర్ణ మానవరూపంతో ఉండే నటరాజస్వామి. స్పటిక రూపంలో ఉంటే చంద్రమౌళీశ్వర స్వామి. ఇక మూడోది నిరాకారం. ఇక్కడ స్వామి తన దేవేరితో కలసి నిత్యం ఆనందతాండవం చేస్తాడని చెబుతారు.
ఆ ముక్కంటి కొలువైన పంచభూత లింగ పుణ్యక్షేత్రాల విశేషాలు ఇవి. మనసుతో ప్రయాణించి దర్శించి, నమస్కరిద్దాం. ఆ దేవదేవిని అనుగ్రహం అందరికి లభించాలని కోరుకుందాం.
- రమ ఇరగవరపు