తల్లి తల నరికిన పరశురాముడు

నైమిశారణ్యం - 10

-రచన : యం.వి.ఎస్.


 

ఋచీథకుని కుమారుడైన జమదగ్ని, ప్రసేనజిత్తు కుమార్తె అయిన రేణుకను వివాహం చేసుకున్నాడు. వీరికి రమణ్వతుడు, సుసేషణుడు, వసువు, విశ్వావసువు, పరశురాముడు జన్మించారు. జమదగ్ని గొప్ప తప్ణస్సంపన్నుడు మాత్రమేగాదు, గొప్ప ధనుర్విద్యావేత్త కూడా. జమదగ్ని బాణాలు సంధించి వదులుతూంటే, వాటిని ఏరి తెచ్చి భర్తకు ఇచ్చేది రేణుక. ఇది వారి నిత్యక్రీడ. ఒకసారి జమదగ్ని విడిచిన బాణం తీసుకురావడానికి వెళ్ళిన రేణుక ఆలస్యంగా భర్త దగ్గరకు వచ్చింది. కాలయాపనకు కారణం అడిగాడు జమదగ్ని. ‘‘ సూర్యతాపానికి కాళ్ళు కాలిపోతూంటే భరించలేక ఓ చెట్టు నీడన ఆగాను, అందుకే ఆలప్యం అయింది’’ అని బదులు చెప్పింది రేణుక. జమదగ్నికి సూర్యునిపై కోపం వచ్చి, సూర్యుని సంహరించాలనే సంకల్పంతో బాణప్రయోగం చేయబోయాడు. సూర్యుడు ఓ బ్రాహ్మణరూపంలో వచ్చి ‘‘ సూర్యునిపై బాణ ప్రయోగం చేయడం పాపం, తాపం ఆయన తత్త్వం, ఈ ప్రయత్నం వదులుకో ’’ అని చెప్పాడు.జమదగ్ని వినలేదు. అప్పుడు సూర్యుడు నిజరూపంలో ప్రత్యక్షమై, జమదగ్నిని దీవించి, అతని భార్యకు కాళ్ళు కాలకుండా చెప్పులు, తల మాడకుండా గొడుగు బహూకరించాడు. ఈవిధంగా చెప్పులు, గొడుగు ఈ లోకంలో అందరికి అందుబాటులోకి వచ్చాయి.

ఒకసారి రేణుక నీళ్ళు తీసుకురావడానికి నదికి వెళ్ళింది. ఆ సమయంలో చిత్రరధుడనే గంధర్వుడు తన భార్యాసమూహంతో జలక్రీడలు ఆడుతున్నాడు. వారి క్రీడావినోదాలను చూస్తూండిపోయిన రేణుక, కాలయాపన జరిగిందని తెలుసుకుని, భయనడుతూ ఆశ్రమానికి వచ్చింది. ఆలస్యానికి కారణం గ్రహించిన జమదగ్ని, తన కుమారులను పిలిచి ‘‘ మీ తల్లి మానసిక వ్యభిచారం చేసింది, అందుకు శిక్ష శరచ్ఛేదమే, మీ తల్లి తల నరకండి’’ అని ఆఙ్ఞాపించాడు.మాతృవధ చేయడానికి నలుగురు పెద్దకుమారులు అంగీకరించలేదు. జమదగ్ని వారిని దారుణంగా శపించాడు. 
పరశురాముడు మాత్రం తండ్రి ఆఙ్ఞకు కట్టుబడి తల్లి తల నరికాడు. పరశురాముని పితృభక్తికి సంతసించిన జమదగ్ని, పరశురాముని వరం కోరుకోమన్నాడు. తన తల్లిని బ్రతికించమని తండ్రిని కోరాడు పరశురాముడు. జమదగ్ని రేణుకను బ్రతికించాడు. మాతృహత్య పాతకనివృత్తికై పరశురాముడు తన ప్రపితామహుడైన భృగువు ఆదేశం మేరకు హిమాలయాలకు వెళ్ళి తపస్సు ప్రారంభించాడు. పరమశివుడు ప్రత్మక్షమై అజేయమైన పరశువును(గొడ్డలిని) బహూకరించి, దేవతలకు సాయంగా యుద్ధానికి వెళ్ళమని చెప్పాడు.

పరశురాముడు దేవదానవ యుద్ధంలో పాల్గని దేవతల విజయానికి కారణమయ్యాడు. అందుకు సంతసించిన పరమశివుడు పరశురామునకు సకల దివ్యాస్త్రాలు ప్రసాదించాడు. ఆ తర్వాత పరశురాముడు తీర్థయాత్రలకు బయలుదేరాడు. ఆ రోజులలో హైహయవంశీయుడైన కార్తవీర్యార్జునుడు ససైన్యంగా వేటకువచ్చి, మృగయావినోదం అయిన తర్వాత జమదగ్ని ఆశ్రమానికి వచ్చాడు. వచ్చిన మహారాజుకు తన దగ్గరున్న కామధేనువు సాయంతో ఘనంగా అతిథిసత్కారం చేసాడు జమదగ్ని. కామధేనువు మహిమకు అచ్చెరువొందిన కార్తవీర్యార్జునుడు ఆ ధేనువును తనకు ఇమ్మని కోరాడు. జమదగ్ని నిరాకరించాడు. కోపగించిన కార్తవీర్యార్జునుడు తన సైన్యాన్ని ఆదేశించాడు. 
సైన్యం  కామధేనువును బలాత్కారంగా తీసుకుబోతూంటే, జమదగ్ని అడ్డుపడ్డాడు. సైనికులు జమదగ్నిని చంపగా, కామధేనువును తీసికుని తన రాజ్యానికి వెళ్ళిపోయాడు కార్తవీర్యార్జునుడు. భర్త శవం మీదబడి రేణుక హృదయవిదారకంగా విలపిస్తూంటే, ఆశ్రమానికి తిరిగి వస్తున్న పరశురామునకు ఆ రోదనలు వినిపించాయి. పరుగు పరుగున ఆశ్రమానికి వచ్చాడు. గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్న తల్లిని, శవంలా పడివున్న తండ్రిని చూసాడు. అలా ఆమె ఇరువదొక్కమర్లు గుండెలు బాదుకుటూ విలపించింది.

తండ్రి మరణానికి ప్రతీకారంగా క్షత్రియజాతినే సర్వనాశనం చేస్తానని పరశురాముడు ప్రతిఙ్ఞ చేసాడు. అదే ఆవేశంతో మాహిష్మతీనగరానికి వెళ్ళి తన గొడ్డలితో కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులు నరికి సంహరించాడు. అలా ఇరువదొక్కమార్లు క్షత్రియజాతిపై దండెత్తి, వారిని సంహరించాడు. నూతన వధూవరులను మాత్రం తన గొడ్డలికి బలిచేయకుండా క్షమించి వదిలాడు. క్షత్రియరక్తంతో పరశురాముడు తన తండ్రికి కురుక్షేత్రంలో రుధిర తర్పణాలిసూంటే, ఐదు మడుగులు ఏర్పడ్డాయి. వాటినే ‘శమంతకపంచకం’ అంటారు.  క్షత్రియ సంహారంతో సమస్త భూమండలం పరశురాముని సొంతమయింది. అలా తనకు సంక్రమించిన భూమిసర్వస్వాన్ని కశ్యపప్రజాపతికి ధారబోసి తపస్సుకై మహేంద్రగిరికి వెళ్ళిపోయాడు. 
అలా వెళ్లిన పరశురాముడు, తిరిగి శివధనుర్భంగానంతరం శ్రీరామునితో యుద్ధానికిదిగి, ఓడిపోయి, తిరిగి మహేంద్రగిరికి వెళ్లిపోయాడు.  ఆ తర్వాత ద్వాపరయుగ కాలంలో భీష్మపితామహునకు అస్త్రవిద్యాప్రదానం చేసినదీ, అంబ కారణంగా భీష్మునితో యుద్ధం చేసి ఓడిపోయినది కూడా పరశురాముడే. అంతేకాదు, కర్ణునకు ధనుర్విద్యాచార్యుడు కూడా పరశురాముడే. పరశురాముడు విష్ణాంశసంభూతుడు. చిరంజీవి. ప్రాత్ణస్మరణీయుడు. రాబోయే సూర్యసావర్ణి మన్వంతరంలోని సప్తరుషులలో పరశురాముడు ఒకడు.
                                        

-స్వస్తి-


More Purana Patralu - Mythological Stories