నాగుల చవితి ఎందుకు జరుపుకుంటారు.. పూజా సమయం ఎప్పుడు!

హిందూ సంప్రదాయాలలో చాలా పండుగలు ఉన్నాయి. పంచభూతాలను దైవంలా కొలిచే సంప్రదాయం హిందూమతంలో ఉంది. చెట్టు, పుట్ట, నీరు, ఆకాశం, నిప్పు, గాలి ఇలా అన్నింటిని దైవంలా భావిస్తారు. అందులో భాగంగానే చాలా పండుగలు జరుపుకుంటారు. అలాంటి ప్రకృతి సంబంధ పండుగలలో నాగుల చవితి కూడా ఒకటి. నాగుల పంచమిని శ్రావణ శుక్లపక్ష పంచమి రోజు జరుపుకుంటే.. నాగుల చవితిని కార్తీక శుద్ద చవితి రోజు జరుపుకుంటారు. సింపుల్ గా చెప్పాలంటే కార్తీక మాస పౌర్ణమి ముందు వచ్చే చవితి రోజు నాగుల చవితి జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది అధికమాసం వచ్చింది. దీని కారణంగా ప్రతి తిథి అటు ఇటుగా రెండురోజులలోనూ ఉంది. దీంతో ప్రతి పండుగ గురించి సందేహాలే ఏర్పడ్డాయి. కొందరు ముందు రోజే పండుగలు జరుపుకుంటే మరికొందరు తరువాత రోజు పండుగలు జరుపుకున్నారు.  ఈ కార్తీక మాసంలో నాగుల చవితి గురించి కూడా సందేహాలున్నాయి. నాగుల చవితి పండుగ ఎప్పుడు?పూజ ఎలా చేసుకోవాలి? ఈ పూజ ఎందుకు జరుపుకుంటారు? మొదలైన విషయాలు తెలుసుకుంటే..

నాగుల చవితి ఎప్పుడంటే..

నాగుల చవితి కార్తీక పౌర్ణమికి ముందు వచ్చే చవితి నాడు జరుపుకుంటారు. ఈసారి చవితి తిథి నవంబర్ 16వ తేదీ మధ్యాహ్నం 12.54కు మొదలైంది. ఈ తిథి నవంబర్ 17వ తేదీ  ఉదయం 11.32గంటల వరకు ఉంటుంది. సూర్యోదయకాలంలో తిథి ఉన్నప్పుడే పండుగ అవుతుంది. కాబట్టి నాగుల చవితి పండుగ  నవంబర్ 17వ తేదీ శుక్రవారం జరుపుకోవాలి.

ఎందుకు జరుపుకుంటారంటే..

నాగుల చవితి పండుగ జరుపుకోవడం వెనుక పలు కారణాలు ఉన్నాయి. పెళ్లై పిల్లలున్న ఆడవారు అయితే తమ పిల్లలు సంతోషంగా, ఆరోగ్యంగా  ఉండాలని నాగుల చవితి జరుపుకుంటారు. పెళ్లై పిల్లలు లేని ఆడవారు తమకు సంతానం ప్రసాదించమని వేడుకుంటూ నాగుల చవితి జరుపుకుంటారు. ఇక అసలు పెళ్లి కాని అమ్మాయిలు అయితే తమకు దోషాలన్నీ పోయి పెళ్ళి జరగాలని నాగుల చవితి జరుపుకుంటారు.

నాగుల చవితి పూజా విధానం..

నాగుల చవితి రోజున అన్ని పండుగల్లానే ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేయాలి. పూజను  చాలా నిష్టగా చేయాలని అనుకునేవారు ఎరుపురంగు దుస్తులు ధరించాలి. పూజగదిని, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఈ పూజకు ఎర్రని పువ్వులు చాలా శ్రేష్టం. పూజ కోసం  చలిమిడి చేయాలి.  నైవేద్యం  కోసం పండ్లు, వడపప్పు ఏర్పాటుచేసుకోవాలి. పూజ గదిలో దీపారాధన చేయాలి. ఆ తరువాత  నాగేంద్ర అష్ట్రోత్తరం, నాగేంద్ర స్తోత్రం, నాగస్తుతి, నాగ సహస్రనామాలు మొదలైనవి పఠించాలి. ఇదంతా చేసిన తరువాత ఇంటికి దగ్గరలో ఉన్నా లేదా దూరంలో ఉన్నా కాసింత శ్రమ తీసుకుని అయినా పుట్ట దగ్గకు వెళ్లాలి. పుట్టను పసుపు, కుంకుమలతో పూజించాలి. అగరొత్తులు వెలిగించాలి. చలిమిడి సమర్పించాలి. పండ్లు, వడపప్పు నైవేద్యం పెట్టాలి. ఆవు పాలు పుట్టలో పోయాలి. తరువాత అంక్షితలు తీసుకుని పుట్టచుట్టూ ప్రదక్షిణలు చేసి అక్షింతలు పుట్టమీద చల్లాలి. కొబ్బరికాయ కొట్టి కొబ్బరినీటిని పుట్టమీద చల్లాలి. చివరిగా హారతి ఇచ్చి పూజ ముగించాలి.

పూజ ముగిసిన తరువాత ఇంటికి వచ్చి ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. ఆ నాగేంద్రుని కృపకు పాత్రులు కావాలంటే నాగుల చవితి రోజున 'ఓం నాగేంద్రస్వామినే నమః' అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఓపిక ఉన్నవారు రోజు మొత్తం ఈ మంత్ర జపం చేయవచ్చు. మంచి ఫలితాలు ఉంటాయి. మంత్రాలలో ఉండే వైబ్రేషన్ ఆరోగ్యాలన్ని చేకూరుస్తుంది.

నమ్మకాలు..

నాగుల చవితి వెనుక దైవపరమైన  కొన్ని నమ్మకాలు ఉన్నాయి. పుట్ట మన్నును తీసి చెవికి రాసుకుంటే చెవికి సంబంధించిన సమస్యలు, కంటికి  సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని చెబుతారు.

పిల్లలు పుట్టక ఇబ్బందులు పడుతున్నవారు నాగుల చవితి రోజు పుట్టకు పాలు పోసి ఆ పుట్ట మన్ను తీసి పొట్టమీద రాసుకుంటే గర్భాశయంలో ఉండే దోషాలు అన్నీ పోయి గర్భం దాల్చుతారని నమ్ముతారు.

నాగుల చవితి రోజు కేవలం పుట్టను, నాగేంద్రుడిని మాత్రమే కాకుండా నాగేంద్రుడిని మెడలో ధరించే ఆ పరమేశ్వరుడిని కూడా పూజిస్తే ధన, ధాన్యాలకు లోటు ఉండదని, ఆ కుటుంబం సంతోషంగా ఉంటుందని నమ్ముతారు.

                                                      *నిశ్శబ్ద.


 


More Others