మైత్రేయి భర్తను కోరిన కోరిక ఇదే..


పురాణాలలో చూస్తే ఆ పరమాత్మ స్వరూపాన్ని అర్థం చేసుకుని భౌతిక సుఖాలను వదిలిపెట్టినవారిలో మగవారు ఎక్కువగా కనిపిస్తుంటారు. కానీ ఇలాంటి కోవలో కొండస్రు ఆడవారు కూడా ఉన్నారు. పురాణాల్లో ఆడవారు ఆ దేవుడి విషయంలో తమ శక్తి సామర్థ్యాలు నిరూపించుకోవడం విషయంలోనూ తమ ధర్మాలు నెరవేర్చడంలోనూ సమర్థవంతంగా ఉన్నవారు ఎందరో.. కానీ మగవారిగా ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్లినవారిలో మైత్రేయి చెప్పుకోదగినది.


ఆధ్యాత్మిక జిజ్ఞాసువుగా వేదాల్లో మైత్రేయి పాత్ర అద్వితీయం. అంతిమ సత్యాన్ని కనుగొనడం కోసం ఐహిక భోగాలనన్నింటినీ త్యజించిన పరమ పావని ఆమె.


శిష్య వత్సలుడైన గురువు యాజ్ఞవల్క్య మహర్షికి ఇద్దరు భార్యలు. ఆ ఇద్దరిలో మైత్రేయి ఒకరు. గృహస్థాశ్రమ జీవితంలో తగినంత అనుభవం గడించిన తరువాత, పరమాత్మను చేరుకోవడం కోసం అడవులకు వెళ్లి జీవితం గడపడం ఆ రోజుల్లోని సంప్రదాయం. యాజ్ఞవల్క్య మహర్షి సైతం తన ప్రాపంచిక వస్తు సామగ్రినంతటినీ ఇద్దరు భార్యలకూ పంచి ఇచ్చి, ఈ ప్రాపంచిక జీవితం నుంచి పక్కకు తప్పుకోవాలని భావించాడు. ఆయన భార్యల్లో ఒకరైన కాత్యాయని తనకు భర్త నుంచి వారసత్వంగా సంక్రమించిన భౌతిక సుఖ సంపదలతో సంతృప్తిపడింది.


అయితే, రెండో భార్య అయిన మైత్రేయి మాత్రం అలా తృప్తి పడాలని అనుకోలేదు.  ఆమె తన భర్త యాజ్ఞవల్క్యుడి వద్దకు వెళ్ళి, "స్వామీ! సమస్త సంపదలకూ నెలవైన ఈ ప్రపంచం మొత్తం నాదైతే, అప్పుడు నేను అమృతతుల్యరాలిని అవుతానా?” అని ప్రశ్నించింది.


"అదేమీ లేదు. దాని వల్ల నీ జీవితం కూడా మిగిలిన ధనికులందరి లాంటి జీవితంగా మారుతుందే తప్ప, అమృతత్వం సిద్ధించదు. భోగభాగ్యాల ద్వారా అమరత్వం సిద్ధించదు” అని యాజ్ఞవల్క్యుడు సమాధానమిచ్చాడు.


అప్పుడు మైత్రేయి తన భర్తతో, "స్వామీ! నాకు అమృతత్వాన్ని ప్రసాదించనటువంటి ఆ ఐహిక సంపదల్ని నేనేం చేసుకుంటాను! కాబట్టి, అమృతత్వం గురించి మీకు తెలిసినదంతా దయచేసి నాకు చెప్పండి” అని ప్రార్థించింది.


ఈ విధంగా మైత్రేయి తనకు విషయ సుఖాల పట్ల ఆసక్తి లేదని తన భర్తకు స్పష్టం చేసింది.


భార్య చెప్పిన మాటలు, ఆమె అభిప్రాయాలూ విని యాజ్ఞవల్క్య మహర్షి పరమానంద భరితుడయ్యాడు. అప్పుడిక ఆయనే స్వయంగా భార్యకు గురువు అవతారమెత్తాడు. అమృతత్వాన్ని సంపాదించడానికి అవసరమైన బ్రహ్మజ్ఞానాన్ని ఆమెకు వివరంగా బోధించాడు. మైత్రేయికి యాజ్ఞవల్క్యుడు చెప్పిన ఆ బోధ బృహదారణ్యక ఉపనిషత్తులో భాగంగా కనిపిస్తుంది. తపస్సు కోసమని వెళ్ళబోతున్న భర్త నుంచి శాశ్వత ఆనందాన్నిచ్చే ఆధ్యాత్మిక విషయాలను నేర్చుకున్న మైత్రేయి మన మహిళా లోకంలో ఆదర్శమూర్తిగా నిలిచింది.


ఆడవారు అయినా మగవారు అయినా జీవితంలో ఆధ్యాత్మికత దిశగా నడిస్తే.. ఆధ్యాత్మికత గురించి వివరంగా తెలుసుకుంటే దాని ద్వారా వారు జీవితంలో సాధించుకునే పరమానందం మాటల్లో చెప్పలేనిది. అలాంటి ఆనందం ఎన్ని సంపదలు ఉన్నా దొరకదు. 


                                     ◆నిశ్శబ్ద.
 


More Purana Patralu - Mythological Stories