సఖ్యత లేకపోతే

 


కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది. ధర్మరాజు హస్తినాపుర సింహాసనాన్ని అధిష్టించాడు. కానీ విజయం సాధించినా కూడా ధర్మరాజులో ఏదో అసంతృప్తి! తన సోదరుల రక్తాన్ని చిందించి విజయాన్ని సాధించాల్సి వచ్చింది కదా అన్న పశ్చాత్తాపం. ధర్మారాజులో ఉన్న ఆ అసంతృప్తిని చల్లార్చేందుకు... పాలనాపరంగానూ, లౌకిక వ్యవహారాలలోనూ తమ అనుభవాలను అతనికి అందించేందుకు అంపశయ్య మీద ఉన్న భీష్ముడు అతనికి అనేక ఉపదేశాలు చేశాడు. వాటిలో ఒకటిగా ప్రచారంలో ఉన్న కథ ఇది.

 

ఓసారి రెండు పావురాలు అడవి మీదుగా ప్రయాణిస్తున్నాయి. అంతలో వాటికి నేల మీద పోసి ఉన్న ధాన్యపు గింజలు కనిపించాయి. అన్ని గింజలను ఒక్కసారిగా చూడగానే వాటిలో ఒక పావురం చటుక్కున దిగి ఆ ధాన్యాన్ని తినడం మొదలుపెట్టింది. దాని వెంటే రెండో పావురమూ నేల మీదకి దిగి ఆబగా ధాన్యాన్ని తినసాగింది. అలా తింటూ తింటూ అవి ఒక వలలో చిక్కుకుపోయాయి. తమలాంటి పక్షలు కోసమే ఎవరో వేటగాడు అక్కడ ధాన్యాన్ని చల్లాడని తెలుసుకున్న ఆ రెండు పావురాలూ దుఃఖంలో ముగినిపోయాయి. ‘‘నీ వల్లే ఇలా జరిగింది. ఇంత అడవిలో గింజలను చూడగానే ముందూ వెనుకా ఆలోచించకుండా వాలిపోవడమేనా! నీ అత్యాశ వల్ల ఇప్పుడు ఇద్దరమూ ప్రమాదంలో పడ్డాం చూడు!’’ అంది మొదటి పావురం. ‘‘నిన్ను నాతోపాటే రమ్మని ఎవరు చెప్పారు. అంత జాగ్రత్త తెలిసినదానివైతే కాస్త ఓపిక పట్టి ఉండవచ్చు కదా!’’ అని ఎదరుపలికింది రెండో పావురం. ఇలా కాసేపు ఆ రెండు పావురాలూ ఘర్షణపడ్డాయి.

 

ఇంతలో అడుగుల చప్పుడు వినిపించింది. వేటగాడు ఆ వల దగ్గరకు వచ్చేస్తున్నాడు. ‘‘జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఈ వల చూస్తే చిన్నదిగా ఉంది. పైగా కాస్త వదులుగా కూడా కనిపిస్తోంది. మనిద్దరం ఒక్కసారిగా ఈ వలతో పాటుగా ఎగిరిపోయేందుకు ప్రయత్నిద్దాం’’ అంది మొదటి పావురం.

 

మొదటి పావురం చేసిన సూచన బాగానే ఉన్నట్లు తోచింది రెండో పావురానికి. వెంటనే ఆ రెండూ కలిసి ఒక్క ఉదుటున వలతో సహా ఎగిరేందుకు ప్రయత్నించాయి. అలా ఒకటి రెండు సార్లు గట్టిగా ప్రయత్నించేసరికి వల కాస్తా ఊడిపోవడంతో, పావురాలు రెండూ ఆకాశంలోకి ఎగిరిపోయాయి.

 

వలతో సహా ఎగిరిపోతున్న పావురాలను చూసిన వేటగాడు నేల మీద నుంచే వాటిని అనుసరిస్తూ పరిగెత్తసాగాడు. అలా పరుగులెడుతున్న వేటగాడికి ఒక ముని ఎదురుపడ్డాడు. వేటగాడి పరుగునీ, ఆకాశంలో వలతో సహా ఎగురుతున్న పక్షులనీ చూసి మునికి జరిగిన విషయం అర్థమైంది. ‘‘అల్లంత ఎత్తున ఆ పావురాలు ఆకాశంలో ఎగిరిపోతుంటే, వాటి మీద ఇంకా ఆశతో పరుగులు పెడుతున్నావేంటి! అవి నీకు చిక్కే అవకాశం లేదుకదా!’’ అని అడిగాడు ముని.

 

‘‘స్వామీ! నేను వాటిలో అవి గొడవపడటాన్ని గమనించాను. అలా నిరంతరం గొడవపడేవారు ఎంతోసేపు కలిసి ఉండలేరు. ఏ దిక్కున వెళ్లాలి? వలని ఎలా వదిలించుకోవాలి? వంటి చిన్నచిన్న విషయాల మీద ఆ రెండు పక్షులూ మళ్లీ కొట్టుకుంటాయి. ఆ కొట్లాటలో అవి ఎక్కువసేపు వలని మోయలేవు. చూస్తూ ఉండండి. మరి కాసేపటిలో అవి నేల కూలడం తథ్యం!’’ అంటూ తన పరుగుని కొనసాగించాడు.

 

వేటగాడి మాటలు విన్న ముని ఆకాశం వంక పరీక్షగా చూశాడు. పక్షులు రెండూ బిగ్గరగా అరుచుకుంటూ కనిపించాయి. మరికాసేపటిలో వేటగాడు చెప్పిన మాట నిజమైంది. తమలో తాము గొడవపడుతున్న పక్షలు నేల మీదకి జారిపోవడం కూడా గమనించుకోనేలేదు! ఒకే జాతికి చెందినవారు తమలో తాము కొట్లాడుకుంటే, అది వారి వినాశనానికే దారి తీస్తుందని ఈ కథ ద్వారా తెలుస్తోంది.

 

- నిర్జర.

 


More Purana Patralu - Mythological Stories