గాయత్రి మంత్ర ప్రాధాన్యత ఏమిటి?

Importance of Gayatri Mantra

 

“ఓం భూర్భువస్సువః

తత్సత్వితుర్వరేణ్యం

భర్గో దేవస్య ధీమహి

ధియోయోనః ప్రచోదయాత్”

 

ఇదీ గాయత్రీ మంత్రం. మన పూజల్లో గాయత్రీ మంత్రానికి చాలా ప్రాధాన్యత ఉంది. తల్లిని మించిన దైవం లేదు, గాయత్రిని మించిన మంత్రం లేదు. ఆది శంకరాచార్యులవారు “గాయాన్ త్రాయతే ఇతి గాయత్రీ” అన్నారు. అంటే ప్రాణాలను రక్షించేది గాయత్రి అని అర్ధం.

చాలామంది గాయత్రీ మంత్రాన్ని పదేపదే స్మరిస్తుంటారు. ఉచ్చరించ లేనివారు సీడీ పెట్టుకుని వింటారు. కానీ దీనికి అర్ధం ఎందరికి తెలుసు? పెద్దలు చెప్పినట్లు ‘చేతిలో జపమాల, నోట్లో రామనామం కదలాడినా మనసు కనుక చంచలమైతే ఫలితం లేనట్లే’, గాయత్రీ మంత్రానికి అర్ధం, పరమార్ధం తెలీనప్పుడు లక్షసార్లు విన్నా, స్మరించినా ప్రయోజనమే లేదు. అందుకే ముందుగా ఈ పరమ పవిత్రమైన గాయత్రీ మంత్రానికి అర్ధం ఏమిటో తెలుసుకుందాం.

గాయత్రీ మంత్రంలో ప్రతి అక్షరానికీ అర్ధం ఉంది. స్థూలంగా - “లోకంలో సమస్తాన్నీ సృష్టించే, సర్వ విశిష్ట గుణాలతో, ఎవరు మన బుద్ధులను ప్రేరేపిస్తున్నారో, అటువంటి పరబ్రహ్మ స్వరూపుని, శ్రేష్టుని, జ్ఞాన ప్రకాశములు కలవానిని, పూర్తి రూపం ఉన్నవానిని ధ్యానిస్తాను” అని గాయత్రీ మంత్రానికి అర్ధం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే – “ప్రణవ స్వరూపుడు, అన్నిటికీ ఆధారమైనవాడు, అంతటా నిండి ఉన్నవాడు, సర్వేంద్రియాలను ప్రకాశింపచేసేవాడు, సృష్టి, స్థితి, లయకారుడు, సమస్త దుఃఖాలను పోగొట్టి సర్వ సుఖాలను ఇచ్చే స్వయం ప్రకాశకుడైన పరమాత్మునికి నా నమస్కారాలు” అని అర్ధం.

క్లుప్తంగా ఒక్క మాటలో చెప్పుకుంటే, “అన్ని లోకాల నుండి అన్నిటినీ నడిపించే మహాశక్తీ! మా బుద్ధులను ప్రక్షాళన చేసి, మంచి కర్మలను ఆచరించేలా ప్రేరేపించు” అని గాయత్రీ మంత్ర అర్ధం. ఈ మంత్రంలో ఉద్దేశించిన శక్తిని కొందరు నారాయణుడిగా తలిస్తే, ఇంకొందరు ఆది పరాశక్తిగా ధ్యానిస్తారు. మరికొందరు నిరాకార, నిర్గుణ బ్రహ్మగా భావిస్తారు.

రోజుకు వేయిసార్లు చొప్పున నెల రోజుల పాటు గాయత్రీ మంత్రాన్ని జపించినట్లయితే సర్వ పాపాలూ హరిస్తాయని ఉద్ఘాటించాడు మనువు.

ఇప్పుడు గాయత్రీ మంత్రాన్ని ఎలా ఆచరించాలో తెలుసుకుందాం.

గాయత్రీ మంత్ర జపం చేయాలనుకునేవారు -

1. మూడుసార్లు ప్రాణాయామం ఆచరించి, ఆపైన గాయత్రీ జపం చేయాలి.

2. జపం చేసే సమయాన్ని బట్టి భిన్న నామ రూపాలతో ప్రార్ధించాలి.

3. ఉదయం గాయత్రిగా, మధ్యాహ్నం సావిత్రిగా, సాయంత్రం సరస్వతిగా స్మరించాలి.

4. ప్రాతఃకాల వేళ తూర్పు దిశగా నిలబడి సూర్యోదయం అయ్యేవరకు ప్రార్ధించాలి.

5. సాయంకాలం పడమటి దిశగా కూర్చుని, నక్షత్రాలు కనిపించేవరకూ ప్రార్ధించాలి.

6. గాయత్రీ మంత్రాన్ని పైకి వినిపించేట్లు కాకుండా మనసులోనే జపించాలని గుర్తుంచుకోవాలి.

7. గాయత్రీ మంత్రం ఇహ లోకంలో పాపాలను తొలగించి సంపూర్ణంగా రక్షించడమే కాకుండా, పునర్జన్మ లేకుండా చేసి మోక్షాన్ని ప్రసాదిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ఏవిధంగా చూసినా గాయత్రీ మంత్రాన్ని మించింది లేదు. కనుక ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపించాలి.

 

chanting of gayatri mantra, meaning of gayatri mantra, gayatri mantra meaning in telugu, benefits of gayatri mantra, power of gayatri mantra, gayatri mantra importance in telugu


More Enduku-Emiti