శనైశ్చర అమావాస్య ఎప్పుడు...ఈ రోజు ఏం చేయాలంటే..!
శని దేవుడు న్యాయాధికారిగా పిలవబడతాడు. మనిషి చేసిన కర్మ ఫలాన్ని అనుభవించేలా చేస్తాడు. ఎవరైనా ఎక్కువ బాధపడుతున్నప్పుడు శని ప్రభావం అంటుండడం వింటూనే ఉంటాం. అయితే శనిదేవుడు ఎప్పుడూ మంచే చేస్తాడు. కొండంత బాధతో పోవాల్సిన విషయాన్ని గోరంత బాధతో పోయేలా చేస్తాడు. అందుకే శని దేవుడిని తృప్తి పరచాలి. శనిదేవుడిని పూజించడానికి శనివారం, శని త్రయోదశి మొదలైన తిథులు మంచివని చెబుతారు. అవి మాత్రమే కాదు.. శనైశ్చర అమావాస్య కూడా శని దేవుడిని పూజించడానికి చాలా మంచి రోజు. ఈ రోజు శని దేవుడిని పూజిస్తే.. శని దోషం, పితృదోషం ఇతర గ్రహ దోషాల ప్రభావాలు అన్నీ తగ్గుతాయి. 2025 సంవత్సరంలో శనైశ్చర అమావాస్య మార్చి 29వ తేదీన రానుంది. ఇదే రోజు అమావాస్య కూడా ఉంటుంది, అంతేకాదు.. 2025 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం కూడా ఈ రోజే ఉండటం విశేషం. కాబట్టి శనిదేవుడి పూజకు చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. ఈ రోజు శని దేవుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడట. చాలామంది జీవితాలలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయట. జీవిత సమస్యల నుండి బయట పడటానికి ఈ రోజు ఏం చేయాలంటే..
శనైశ్చర అమావాస్య రోజు ఉదయం 4 గంటల నుండి 5.30 లోపు స్నానం చేయాలి. ఆ తరువాత ఉదయం 7 గంటల నుండి 9 గంటల లోపు పూజ చేసుకోవాలి.
శనైశ్చర అమావాస్య ఎందుకు శ్రేష్టం అంటే..
సాధారణంగా పితృదేవతలకు అమావాస్య రోజు తర్పణం వదులుతూ ఉంటారు. ఈ శనైశ్చర అమావాస్య రోజు మూడు విషయాలు కలిసి వచ్చినందువల్ల ఈ రోజు పితృదేవతలకు వదిలే తర్పణం, పిండ దానం చాలా శుభప్రదం. పితృదేవతలు అసంతృప్తిగా ఉంటే అవన్నీ ఈ రోజు చేసే తర్పణం, పిండప్రదానం వల్ల తొలగిపోతాయి.
శనైశ్చర అమావాస్య రోజు రావిచెట్టును పూజించడం, రావిచెట్టు దగ్గర దీపం వెలిగించడం చాలా మంచిది. దీని వల్ల శనిదేవుడి ఆశీర్వాదం లభిస్తుంది. శనైశ్చర అమావాస్య రోజు శనిదేవుడికి ఆవాల నూనెతో తైలాభిషేకం చేస్తే మంచిది. అంతేకాదు.. అవాల నూనె, నువ్వుల నూనె లేదా నల్ల నువ్వులు, మినపప్పు దానం చేయడం వల్ల కూడా జీవితంలో ఏవైనా పనులు చేసేటప్పుడు కలిగే అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి.
ఈ పనులు తప్పక చేయాలి..
సూర్యోదయానికి ముందే స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి.
రావి చెట్టును పూజించి, ఆవాల నూనె దీపం వెలిగించాలి.
శని దేవునికి ఆవాల నూనె, నల్ల నువ్వులు, మినపప్పు సమర్పించండి.
ఆవాల నూనె, నల్ల నువ్వులు, మినపప్పు ఎవరికైనా నిరుపేద బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి.
"ఓం శం శనైశ్చర్యాయ నమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేయాలి.
పేదలకు ఆహారం పెట్టడం, అవసరమైన వారికి సహాయం చేయడం పుణ్య ప్రదమైన పనులు.
*రూపశ్రీ.
