వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవాలయం
చరిత్ర
ఇక్కడ వెలసిన దేవుడు వేములవాడ రాజన్న గా తెలుగు నాట ఎంతో ప్రసిద్ది. ఈ ఆలయానికి పౌరాణికమైన ప్రాశస్తమే గాక చారిత్రిక ప్రాముఖ్యత కూడ వున్నది. "ఛారిత్రికత:" వేముల వాడ పూర్వ నామం లేంబుల వాటిక. కాలక్రమంలో లేంబుల వాడ గా ఆ తర్వాత వేముల వాడగా రూపాంతరం చెందినది. ఈ ఆలయాన్ని చోళ రాజులలో ప్రముఖుడైన రాజ రాజ నరేంద్రుడు నిర్మించినట్లు చరిత్రకాదారులున్నాయి. క్రీ.శ. 750 నుండి 175 సంవత్సరాలపాటు చాళుఖ్యులు, ఇస్వాకులు పాలించి నట్లు ఇక్కడ లబించిన చారిత్రిక ఆదారాలను బట్టి తెలుస్తున్నది .ఆ రోజుల్లో ఈ ప్రాంతం శైవ, వైష్ణవ, జైన మతాలకు కేంద్రంగా వుండేదని తెలుస్తున్నది. తదుపరి కాలంలో ఈ ప్రాతం కాకతీయుల ఆదీనంలో, డిల్లీ సుల్తానుల ఆధీనంలో వున్నట్లు చరిత్రను బట్టి తెలుస్తున్నది. రాజన్న ఆలయం..... స్థానికంగా రాజ రాజేశ్వరుని వేములవాడ రాజన్న అని ప్రేమతో పిలుచుకుంటారు భక్తులు.
ప్రధాన ఆలయంలో రాజరాజేశ్వరునికి కుడి వైపున రాజరేస్వరి అమ్మవారు, ఎడమ వైపున లక్ష్మి సమేత గణపతి ఉన్నారు. ఆలయ ముఖ ద్వారం పై గజలక్ష్మి, సింహ ద్వారానికి ఎదురుగా అనంత పద్మనాభ స్వామి ఆలయం వున్నది. ఆలయం చుట్టూ బాల రాజేశ్వర, విఠలేశ్వర, ఉమామహేశ్వర, త్రిపుర సుందరీ దేవి ఆలయాలున్నాయి. దగ్గర్లోనె నగరేశ్వర, వేణుగోపాలస్వామి, మొదలగు ఆలయాలున్నాయి. అలేగే జగన్మాత స్వరూపిణి అయిన బద్ది పోచమ్మ వారి ఆలయం కూడ వున్నది. ఆలయ ప్రాంగణంలో మహమ్మదీయుల ధర్గా కూడ వుండడం విశేషం. దేవాలయం ప్రక్కనే వున్న ధర్మకుండం (పుష్కరిణి) చాల పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు. ధక్షయజ్ఞ సమయంలో వీరభద్రుని చేతిలో చేతులు కోల్పోయిన సూర్యుభగవానుడు, ఈ పుష్కరిణిలో స్నానం చేయగా చేతులు వచ్చాయని పురాణ గాధ. .
స్థల విశిష్టత:
దేవేరి శ్రీ పార్వతీ రాజరాజేశ్వరీదేవి సమేతుడై శ్రీ రాజరాజేశ్వరుడు లింగరూపంలో వెలసి నిత్యం పూజలందుకుంటున్నాడు. శ్రీ కాశీనగరి, చిదంబరపురి, శ్రీశైల, కేదారాది శివక్షేత్రాల వలె వేములవాడ క్షేత్రం మహిమాన్వితమై భక్తకోటిని తరింపజేస్తున్నది. లేంబాల వాటికగా, భాస్కర క్షేత్రంగా, హరిహర క్షేత్రంగా నామాంతరాలు కలిగివున్న ఈ క్షేత్ర ప్రశస్తి భవిష్యత్తోత్తర పురాణంలోని రాజేశ్వర ఖండంలో పేర్కొనబడింది. కృతయుగంలో దేవేంద్రుడు లోకకంటకుడైన వృత్తాసురుడు అనే రాక్షసుని సంహరించి తదనంతరం సంక్రమించిన బ్రహ్మహత్యా పాతకం తొలగించేందుకు పలుక్షేత్రాదులు తిరుగుతూ వేములవాడ క్షేత్రానికి విచ్చేసి ధర్మకుండ పుష్కరిణిలో స్నానమాచరించి స్వామివారిని అర్చించి పునీతుడైనట్టు రాజేశ్వర ఖండంలో వివరించబడింది.
త్రేతాయుగంలో దక్షుడు గంధమాదన పర్వతంపై యజ్ఞం చేయగా, శివ యజ్ఞ భాగలేమితోయున్న మంత్రపూతమైన హవిష్యమును సూర్యుడు తీసుకొని తన నిజబాహువులు కోల్పోయాడట. శతవత్సరముల అనంతరం సూర్యుడు విప్రుల సూచనలపై ఈ క్షేత్రంలో స్వామివారిని ఆరాధించి తిరిగి బాహువులు పొందినట్లు, అందుకే ఈ క్షేత్రానికి భాస్కర క్షేత్రమని పేరు వచ్చినట్లు పురాణాంతర్గత కథనం. దండకారణ్య ప్రాంత సంచారణ సమయంలో శ్రీ సీతారామ లక్ష్మణులు, అరణ్యవాసంలో పంచపాండవులు ఈ క్షేత్రాన్ని సందర్శించి పూజలు చేసినట్లు, స్వామివారి కృపకు పాత్రులైనట్లు స్థలపురాణ విదితం. కాశీ, చిదంబరం, శ్రీశైలం, కేదారేశ్వరం లను పావనం చేసిన తరువాత శివుడు వేములవాడ వేంచేసాడని పురాణ కథనం
ఆలయ ప్రత్యేకత:
ఏ ఆలయంలోలేని ప్రత్యేక సాంప్రదాయం ఈ ఆలయంలో వున్నది. పిల్లలు పుట్టని దంపతులు పిల్లలు కలగాలని స్వామి వారికి మొక్కుకొని, పిల్లలు కలిగాక ఆ బాలునితో, ఒక కోడె దూడను తెచ్చి, ఆలయం చుట్టు తిప్పి ముందున్న స్థంబానికి కట్టి వెళతారు. దీన్నే కోడే మొక్కు అంటారు. కోడే దూడను తెచ్చుకోలేని దూర ప్రాంతం వారి సౌకర్యార్థం ప్రస్తుతం ఇక్కడ ఆ సమయానికి కోడే దూడలను అద్దెలకు ఇస్తారు. మహా శివ రాత్రి వంటి పర్వ దినాలల్లో కోడే మొక్కు చెల్లించుకొనే వారి సంఖ్య వేలలో వుండడాన్ని బట్టి చూస్తే ఈ ఆఅలయ ప్రాశస్త్యం ఎంత గొప్పదో తెలుస్తుంది. అదే విధంగా స్వామివారికి బెల్లం సమర్పించడం కూడ ఇక్కడున్న మరో ఆచారం. మరెక్కడాలేని మరో ఆచారం కూడ ఇక్కడ మరొకటి వున్నది. అదేమంటే రోగాల బారిన పడిన లేక ఇతర కష్టాల బారిన పడిన స్త్రీలు రాజరాజేశ్వరునికి మొక్కుకొని అవి తీరాక ఆది బిక్షువు అడుగు జాడల్లోనే జీవితాంతం బిక్షాటనె వృత్తిగా చేసుకొని, పార్వతిగా మహా శివునికే అంకితమై పోతారు. అలాంటి వారు ఈ ప్రాంతంలో వేల సంఖ్యలో వుంటారు.
శివరాత్రి రోజున మూడు లక్షలకు పైగా భక్తులు రాజరాజేశ్వర స్వామిని సేవించుకుంటారు. ఆ రోజున ప్రత్యేక పూజలు జరుపుతారు. వంద మంది అర్చకులతో మహాలింగార్చన జరుపుతారు. అర్ధరాత్రి వేళ శివునికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు. రాత్రివేళ దీపాలంకరణలతో దేవాలయం దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. విద్యార్ధులకు ఉచిత వసతి, భోజన ఏర్పాట్లు చేస్తారు.
వేములవాడ కరీంనగర్‌కు 36 కిమీల దూరంలో కరీంనగర్ - కామారెడ్డి దారిలో ఉంటుంది. హైదరాబాద్ నుంచీ, కరీంనగర్ నుంచీ ఎక్స్ ప్రెస్ బస్సులు చాలా నడుస్తుంటాయి. దేవస్థానం కల్పిస్తున్న వసతి సౌకర్యం ఉన్నది.