వ్యాపారస్థుల దేవుడు- అగ్రసేన్ మహారాజు
మన దేశంలో అగర్వాల్ అన్న పేరు వినని వారు ఉండరూ. ఆ అగర్వాల్ కులంలోని బన్సల్, మిట్టల్, గోయల్, సింఘాల్ వంటి గోత్రాలతో ఉన్న పేర్లు కూడా మనకు తారసపడుతూనే ఉంటాయి. వీరు హైందవులే అయినా, నిత్యం పూజించేది లక్ష్మీదేవినే అయినా... తమ వంశానికి మూలపురుషుడైన ఓ మహానుభావుని తరచూ స్మరిస్తూ ఉంటారు. ఆయనని దైవంగా భావిస్తుంటారు. ఆయనే అగ్రసేన్ మహారాజు!
కృష్ణుని సమకాలికుడు
అగ్రసేన్ మహారాజు గురించి అటు చరిత్రలోనూ, ఇటు ఇతిహాసాలలోనూ చాలా తక్కువ ప్రస్తావన ఉంటుంది. కానీ ఆయన వంశజులు మాత్రం అగ్రసేన్ మహారాజు మహాభారతం నాటివాడనీ, శ్రీకృష్ణుని సమకాలికుడనీ అంటుంటారు. వారి నమ్మకం ప్రకారం అగ్రసేనుడు సూర్యవంశానికి చెందిన రాకుమారుడు. ప్రతాప్‌నగర్ అనే రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. ఇటు రాజ్యాన్నీ, అటు రాజ్యంలోని ప్రజలనూ పాలించడంలో ఆయనకు ఆయనే సాటి. అలాంటి అగ్రసేనుడి జీవితంలో ఓ స్వయంవరం అనుకోని మార్పుని తీసుకువచ్చింది.
ఇంద్రునితో వైరం
ప్రతాపనగరాన్ని ఏలుతున్న అగ్రసేనుడు ఒకసారి నాగలోకానికి చెందిన మాధవి అనే రాకుమార్తె స్వయంవరానికి హాజరయ్యాడు. ఆ స్వయంవరంలో ముల్లోకాలకూ చెందిన రాజకుమారులను కాదని మాధవి, అగ్రసేనుని వరించింది. మాధవి అందచందాలకు ముగ్ధుడై ఆమెను దక్కించుకోవాలనుకున్న ఇంద్రుని మనసులో ఈ వివాహం ఈర్ష్యకు కారణం అయ్యింది.
ఎలాగైనా అగ్రసేనుడి మీద కక్ష సాధించాలనుకున్న ఇంద్రుడు, ప్రతాపనగరంలో తీవ్రమైన కరువు వచ్చేట్లు చేశాడు. కరువుతో అల్లల్లాడిపోతున్న తన జనాల్ని రక్షించుకునేందుకు అగ్రసేనుడు, నేరుగా ఆ ఇంద్రుని మీదకే దండయాత్రను సాగించాడు. ధర్మం కోసం పోరాడుతున్న అగ్రసేనుడు కనుక ఇంద్రుని మీదకు దండెత్తితే ఇంద్రుని పరాజయం ఖాయమని దేవతలందరికీ అర్థమైపోయింది. దాంతో నారదుడే స్వయంగా రంగంలోకి దిగి ఇరువురి మధ్యా సయోధ్యను కుదిర్చాడు.
కొత్త రాజ్యానికి స్థాపన
ఒకసారి అగ్రసేనుడు శివుని అనుగ్రహాన్ని కోరి వారణాసిలో ఘోరతపస్సుని సాగించాడు. అగ్రసేనుని తపశ్చర్యకు మెచ్చుకుని పరమేశ్వరుడు ప్రత్యక్షమై, మహాలక్ష్మిని కూడా ప్రసన్నం చేసుకోమని సలహాను అందించాడట. అంతట అగ్రసేనుడు మహాలక్ష్మికై తపస్సు సాగించగా... లక్ష్మీదేవి ప్రత్యక్షం అయ్యింది. ప్రజల సౌభాగ్యం కోసం వైశ్యవృత్తిని చేపట్టమనీ, వారి కోసం ఒక కొత్త రాజ్యాన్ని స్థాపించమనీ సూచించిందట. ఆమె చెప్పినట్లుగానే అగ్రసేనుడు నూతనంగా రాజ్యాన్ని స్థాపించేందుకు అనువైన ప్రదేశం కోసం వెతకడం మొదలుపెట్టాడు.
అలా తన వెతుకులాటను సాగిస్తుండగా ఒకచోట పులిపిల్లలూ, తోడేలు పిల్లలూ కలిసి ఆడుకోవడం కనిపించిందట. తన రాజ్యస్థాపనకు అదే శుభసూచకంగా భావించి, అక్కడ ‘అగ్రేయ’ అనే రాజ్యాన్ని స్థాపించాడు అగ్రసేనుడు. అదే కాలక్రమంలో ‘అగ్రోహ’ పేరుతో స్థిరపడింది. హర్యానాలోని హిసార్ జిల్లాలో ఇప్పటికీ ఈ పట్టణం ఆనవాళ్లు కనిపిస్తుంటాయి. ఇక్కడ త్వవకాలను జరిపిన పురాతత్వ శాఖకు క్రీస్తు పూర్వం నాటి అవశేషాలెన్నో కనిపించాయి.
అగ్నికి ఆహుతి
అగ్రసేన్ మహారాజు జీవించినంతకాలమూ అగ్రేయ రాజ్యం సుభిక్షంగానే ఉంది. ఆ రాజ్యంలో స్థిరపడదామనుకుని వచ్చే కొత్తవారికి ప్రతి ఇంటి నుంచి ఒక ఇటుక (ఇల్లు కట్టుకునేందుకు), ఒక నాణెము (వ్యాపారాన్ని మొదలుపెట్టేందుకు) ఇచ్చే సంప్రదాయం ఉండేదట. అయితే అగ్రసేనుని తరువాత ఆ రాజ్యం నిదానంగా క్షీణించడం మొదలుపెట్టింది. చివరికి ఓ ఘోర అగ్నిప్రమాదంలో రాజ్యం యావత్తూ కాలిపోయింది.
అగ్రసేనునికి 18 మంది కుమారులు. వీరి గురువుల పేరుమీదుగా ఆయన 18 గోత్రాలను నెలకొల్పారు. ఎప్పుడైతే అగ్రేయ రాజ్యం బూడిదపాలైందో, అప్పుడు అగ్రసేనుని సంతతి అంతా, దేశంలోని వివిధ ప్రాంతాలకు వలసబాట పట్టారట. ముఖ్యంగా ఉత్తరభారతదేశంలో కనిపించే అగర్వాల్, అగ్రహారీ అనే కులాలవారు తాము అగ్రసేన్ మహారాజు సంతతి అని పేర్కొంటూ ఉంటారు. అగ్రసేనుడు స్థాపించిన 18 గోత్రాలూ అగర్వాల్ కులస్తులలో కనిపిస్తాయి.
- నిర్జర.