కాశీ కబుర్లు -14 అన్నపూర్ణాదేవి ఆలయం

 

 

మొదటిసారి మేము ఈ ఆలయానికి వెళ్ళటం చిత్రంగా జరిగింది.  వెళ్ళిన రెండో రోజు ఉదయం 9 గం.లకు బయల్దేరి ముందు అన్నపూర్ణ ఆలయం చూసి అక్కడనుండి విశ్వనాధుని ఆలయానికి వెళ్దామని బయల్దేరాము.  అక్కడ అన్నీ సందు గొందులు కదండీ.  కొత్తవాళ్ళకి తొందరగా గుర్తు పెట్టుకోవటం కష్టం.   ఎవరినడిగినా విశ్వనాధుడి గుళ్ళోనే వుందికదా అన్నారు. (గుడిలో ఉపాలయం వుంది).    సరే .. అడుగుతూ, అడుగుతూ వెళ్తే ఆ సందుదాకా వెళ్ళాముగానీ ఆ ఆలయాన్ని కనిపెట్టలేక పోయాము.  ఒకసారి వెళ్ళినప్పుడు అన్నపూర్ణా నిత్యాన్నదాన సత్రం అని చూశాము.  అప్పటికి మా భోజనం సమయం కాలేదుగనుక మేము అక్కడివారితో భోజన సత్రం కాదు .. ఆలయం కావాలి అని చెబితే పక్కనుంచి వెళ్ళమన్నారు.  మళ్ళీ మొదలు.  ఈ లోపల చీరెల షాపుల వాళ్ళ గోల వాళ్ళ షాపుల్లో బట్టలు కొనమని.

 

ఈ చికాకులోకూడా బుఱ్ఱ కొంచెం పని చేసింది.  ఒక షాపతను అలాగే అడ్డం పడుతుంటే, అన్నపూర్ణమ్మ దర్శనం అయ్యాక బట్టలు కొంటామన్నాను.  వాళ్ళ షాపు అమ్మవారి గుడి దగ్గరే వున్నదని చెప్పి వెంటపెట్టుకుని తీసుకు వెళ్ళాడు.  ఇంతా చేస్తే మళ్ళీ ఆ నిత్యాన్నదాన సత్రం దగ్గరకే తీసుకు వెళ్ళాడు.  భోజనం కాదు, అమ్మవారిని చూడాలి అని చెబితే అటునుంచే వెళ్ళాలి లోపలకి అన్నాడు.  రెండూ పక్క పక్కనే అని చెప్పాడు.  ఇంతలో అక్కడ ఒక బేచ్ భోజనాలయ్యాయి, రెండవ బేచ్ ని  పిలుస్తూ మమ్మల్నీ పిలిచారు .. మరి గుమ్మంలోనే వున్నాం కదా.  అన్నపూర్ణమ్మ తల్లి పిలిచి అన్నం పెడుతుంటే కాదనగూడదనే సెంటిమెంట్ తో లోపలకెళ్ళాం.  కింద కూర్చోగలిగిన వాళ్ళు అటెళ్ళండి, లేనివాళ్ళు ఇటురండి .. అని పిలిచారు.  

 

లోపలకి  వెళ్ళాం.  అక్కడ మా ఆఫీసువాళ్ళు కనబడి పలకరించేలోపల సత్రం వాళ్ళు వాళ్ళపని వాళ్ళు చేసేశారు.  అదేనండీ మమ్మల్నందర్నీ కూర్చోబెట్టి వడ్డించేశారు.  కింద కూర్చోలేని వాళ్ళకి పొడుగాటి బెంచీలు.  మా సత్రంలో ప్రతిసారీ భోజనాల సమయంలో చెప్పే విరాళాల విషయం అక్కడ చెప్పలేదు.  భోజనం ఎంత బాగున్నదంటే, భోంచెయ్యగానే మా అంతట మేము డొనేషన్ ఎక్కడ ఇవ్వాలి అని అడిగి వెళ్లి ఇచ్చి వచ్చాం.  మళ్ళీ ఇంకోసారి అక్కడికి భోజనానికి వెళ్దామనుకున్నాం కానీ కుదరలేదు.    ఇంతకీ దాన్లోనే ఇంకో పక్క అన్నపూర్ణ ఆలయం అని తర్వాత తెలిసింది.  చూశారా, కాశీ చేరగానే అన్నపూర్ణమ్మ ఎలా ఆదరించి భోజనం పెట్టించిందో.  ఇక్కడ భోజన కార్యక్రమం ఉదయం 9 గంటలనుంచీ సాయంకాలం 4 గంటలదాకా.  తర్వాత వుండదు.

 

 

కానీ మా సత్రం వాళ్ళకి కోపం వచ్చింది మామీద.  వాళ్ళకి చెప్పకుండా బయట తిని వచ్చినందుకు.  కాశీలో మీ పేర్లతో అన్నం వృధా అయింది.  ఆ పాపం మీదేనన్నారు.  అక్కడికీ జరిగిందంతా చెప్పాము.  పొద్దున్న 9-30 కల్లా వెళ్ళి భోంచెయ్యంకదా అన్నా వినిపించుకోకుండా  మళ్ళీ మళ్ళీ అనేసరికి కోపం వచ్చి గట్టిగా అన్నాను.  కావాలని చేసింది కాదు, పైగా మీకు చెప్పాలని మాకు తెలియదు.  ఇప్పుడే చెప్పారు.  తెలియక చేసినదానికి ఆ దేవుడు ఏ శిక్ష వేస్తే అది మేమే అనుభవిస్తాం, ఇంక ఈ విషయం గురించి మాట్లాడద్దు అని.  అప్పుడు వూరుకున్నారు.  కాశీలో మన సహనానికి పరీక్ష చాలా చోట్ల వుంటుంది.  దీంతో ఒక విషయం అర్ధమయివుంటుంది మీకు.  మీరు దిగిన సత్రంలో భోజన, ఫలహార సదుపాయం వుంటే మీరు అక్కడ తినేది లేనిది వారికి  ఏ రోజుకారోజు ముందు చెప్పి మీ పేర్లు రాయించుకోవాలి.

 

ఇంతకీ అన్నపూర్ణాదేవి ఆలయం విశ్వనాధుని ఆలయానికి దగ్గర్లోనే వుంటుంది.  ఈ తల్లిని దీపావళినాడు బంగారు చీరెతో అలంకరిస్తారు.  ఈ బంగారు అన్నపూర్ణని చూడటానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారు.

 

అన్నపూర్ణ అమ్మవారి చేతిలో బంగారపు అన్నపు గిన్నె, గరిటె వుంటాయి.  షాపుల్లో ఇలాంటివి ఇత్తడి విగ్రహాలు అమ్ముతారు.  కాశీ వెళ్ళినవాళ్ళు  ఇలాంటి విగ్రహాలను కొని  ఇళ్ళలో  పూజామందిరాలలో పెట్టుకొని పూజిస్తారు …

 

ఒక రోజు అన్నపూర్ణ ఆలయంలో కుంకుమ పూజ చేసుకున్నాను.  జనం బాగా వున్నారు.   పూజ బాగానే చేయించారు. కానీ పూజారిగారి బాధ్యతలు ఎక్కువవటంతో   మంత్రాలు చెప్పటం మధ్యలో అనేక అవరోధాలు.  అయినా  భక్తి వుండాల్సింది మనకిగానీ  పూజారికి కాదు అని సర్ది చెప్పుకున్నాము.  

 

అన్నపూర్ణా దేవి ఆలయం మరీ పెద్దది కాకపోయినా లోపల ఇంకా ఉపాలయాలు వున్నాయి. 

 

అన్నపూర్ణాదేవి గురించి ఒక కధ ప్రచారంలో వున్నది.   

 

 

ఒకసారి శివుడు  పార్వతితో మాటలలో ప్రపంచమంతా మాయ, అన్నం కూడా మాయే అన్నాడు. పార్వతీదేవికి అది నచ్చలేదు.  భక్తులు తనను ఆకలి తీర్చే అమ్మగా, తాము కోరినవాటిని ప్రసాదించే దేవిగా భావిస్తారు. అందుకే శివుడి మాటలు నచ్చక కాశీ విడిచి పెట్టి వెళ్ళింది.  దానితో అక్కడ దుర్భరమైన క్షామమేర్పడి ప్రజలు అన్న పానాదుల కోసం అలమటించటం జరిగింది.  ఎక్కడా ఎవ్వరికీ తిండి దొరకలేదు.

 

ప్రజల కస్టాలు చూసి చలించి పోయిన తల్లి మళ్ళీ కాశీకి చేరి భక్తులను కరుణించింది.  పార్వతి రాక తెలుసుకొన్న శివుడు వెంటనే ఆమె దగ్గరకు వచ్చి తన భిక్షా పాత్రను చూపించటమే కాదు, తను అంతా మాయ అనటం కూడా సరైనది కాదన్నాడు.  భర్త సత్యాన్ని గ్రహించినందుకు సంతోషించిన సతీదేవి    తానే స్వయంగా ఆయనకు భోజనం పెట్టింది. అప్పటి నుంచి పార్వతీ దేవిని అన్నపూర్ణగా, నిరతాన్న ప్రదాత గా కొలుస్తున్నారు.

 

శ్రీ శంకరాచార్యులవారు వ్రాసిన అన్నపూర్ణాష్టకాన్ని కాశీలో భోజనం ముందు చదువుకుంటారు. ముఖ్యంగా అన్నపూర్ణా దేవి మందిరం లో వేద విద్యార్ధులు రెండు పూటలా అన్నపూర్ణాష్టకం పఠించిన తర్వాతే  భోజనం చేస్తారు.

 

 

 

 

.. పి.యస్.యమ్. లక్ష్మి

(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)


More Kashi Yatra