కాశీ కబుర్లు-13 కాశీ విశాలాక్షి
విశ్వనాధుని దర్శనం అయింది కదా. ఇక విశాలాక్షిని దర్శించుకుందాము. ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలో సరిగా గుర్తులు చెప్పలేము. అన్నీ చిన్న చిన్న సందులు. అయితే అడిగితే ఎవరైనా చెబుతారు. నోరు ఉపయోగిస్తూ వెళ్ళాలి.
కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి అంటూ పాటలూ వచ్చాయి. ఈ ముగ్గురినీ అక్షి త్రయం అంటారు. వీరిలో కంచి కామాక్షి, కాశీ విశాలాక్షి అష్టాదశ శక్తి పీఠాలలో వున్నాయి. ఆహ్వానం లేకుండా తండ్రి చేసే యజ్ఞానికి పార్వతీదేవి వెళ్ళటం, అక్కడ శివుడు అవమానించబడటం చూసి ఆత్మాహుతి చేసుకోవటం, అది చూసి భరించలేని శివుడు పార్వతి శరీరాన్ని భుజాన వేసుకుని విలయ తాండవం చేస్తుంటే, శివుడి ఉద్రేకాన్ని తగ్గించటానికి మహా విష్ణువు తన చక్రంతో పార్వతీ దేవి శరీరాన్ని ఖండాలుగా చేయటం, ఆ శరీర భాగాలు పడ్డ ప్రదేశాలు శక్తి పీఠాలుగా మహత్వాన్ని సంతరించుకోవటం, వాటిలో అష్టాదశ శక్తి పీఠాలని ముఖ్యమైనవాటిగా పరిగణించటం, ... ఈ కధ మీకు తెలుసుకదా. అందుకే విస్తరించటం లేదు. అమ్మవారి చెవి కుండలం ఇక్కడ పడిందంటారు.
అమ్మవారి ఆలయం చేరుకున్నాము. ఆలయం బయటనుంచి చిన్నగానే వున్నది. మొదటిసారి మేము విశ్వనాధుని ఆలయంలో అభిషేకం చేయించిన బ్రాహ్మణుడితో వెళ్ళాము. అందుకని ఇబ్బంది లేకుండా వెళ్ళాము. మేము వెళ్ళినప్పుడు పెద్దగా రష్ లేదు. విశ్వనాధుని ఆలయంలో అభిషేకం మాకు సంతృప్తికరంగా లేదని అనుకున్నాము. అది గమనించిన ఆయన విశాలాక్షి ఆలయంలో వున్న శ్రీ చక్రానికి శ్రీసూక్తంతో యధావిధిగా కుంకుమ పూజ చేయించారు. విశ్వనాధుని ఆలయంలో జన సమ్మర్దం వల్ల కూడా అభిషేకాలు తృప్తినివ్వవు.
జన సమ్మర్దం లేక పోవటంతో విశాలాక్షి ఆలయంలో నేనూ ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. చాలా సంతోషం అనిపించింది. అంతకన్నా సంతోషకరమైన విషయం సరిగ్గా పూజ పూర్తయ్యే సమయానికి ఎవరో ఒకావిడ నా ప్రక్కనే నుంచుని మా అమ్మ ఎప్పుడూ పాడే పాట, రాజ రాజేశ్వరి, దేవి కన్యాకుమారి, రక్షించు జగదీశ్వరీ అనే పాట చాలా చక్కగా పాడింది. దానితో మనసంతా తృప్తితో నిండిపోయింది. మా పిన్ని అయితే కళ్ళ నీళ్ళు పెట్టుకుంది మీ అమ్మే వచ్చి పాడినట్లనిపించిందే అని. (మా అమ్మ మా చిన్నతనంలోనే పోయారు).
ఈ శక్తిపీఠంలో విశాలాక్షి గర్భాలయంలో రెండు రూపాలతో దర్శనమిస్తుంది. ఒకరూపం స్వయంభువు. మరొక రూపం అర్చామూర్తి. మనం ఆలయంలోకి ప్రవేశించగానే ముందుగా అర్చామూర్తిని, తర్వాత స్వయంభువును దర్శించుకోవాలి. మాకా సంగతి తెలియదు. కనిపించటం కూడా అర్చామూర్తే కనిపిస్తుంది. మేము ఆవిడే అసలు అమ్మవారు అనుకున్నాము.. మాతో వచ్చిన పూజారిగారు చెప్పారు .. అసలు అమ్మవారు వెనక వుంటారు, పక్కనించి చూడమని..
అమ్మవారి ఆలయం కదా...ఒకరికొకరు బొట్లు పెట్టుకోవటం, వీలుంటే పళ్లు ఇవ్వటం వగైరా కార్యక్రమాలు జరిగాయి. విశాలాక్షి ఆలయంనుంచి సంతృప్తిగా బయల్దేరాము.
.. పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)