కాశీ కబుర్లు – 25
ప్రయాగలో దర్శనీయ స్ధలాలు – 5
స్వరాజ్ భవన్, ప్రయాగ (అలహాబాద్)
ఈ భవనం చర్చ్ లేన్ ప్రాంతంలో వున్నది. భారత దేశ ప్రప్రధమ ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ తండ్రి 1899 లో ఈ భవనం కొని వుండసాగారు. అప్పుడు ఈ భవనం పేరు ఆనంద భవన్ అని పెట్టుకున్నారు. తర్వాత పక్కనే వున్న ఖాళీ స్ధలంలో వేరొక భవనం నిర్మించుకుని 1927 లో ఆ భవనంలోకి మారారు. కొత్త భవనం పేరు కూడా ఆనంద భవన్ అనే పెట్టారు. పాత భవనాన్ని నేషనల్ కాంగ్రెస్ కి ఇచ్చారు. అప్పుడు దాని పేరు స్వరాజ్ భవన్ గా మార్చారు. 1931 లో పండిట్ మోతీలాల్ నెహ్రూ మరణించిన తర్వాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ భారత దేశ ప్రజల పురోభివృధ్ధి గురించి ఒక ట్రస్టు ఏర్పాటు చేసి ఈ స్వరాజ్ భవన్ ని ఆ ట్రస్టుకి అప్పగించారు. ఈ భవనంలో కొంత భాగంలో కమలా నెహ్రూ హాస్పిటల్ వుంటే, మరి కొంత భాగాన్ని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ వుపయోగించుకుంటోంది.
భారత దేశ స్వాతంత్ర్య పోరాటానికి సాక్షీభూతంగా నిలిచిన ఈ సువిశాల భవనంలోనే పండిట్ జవహర్ లాల్ నెహ్రూ బాల్యం గడిచింది. అనేక ముఖ్య రాజకీయ సంఘటనలకి వేదిక అయిన ఈ భవనంలోనే దివంగత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ జన్మించింది.
ఇందులో వున్న మ్యూజియం సందర్శన సమయాలు ఉదయం 9-30 నుంచీ సాయంత్రం 5-30 దాకా. ప్రతి సోమవారం సెలవు దినం.
ఆనంద భవన్
భారతదేశ స్వాతంత్ర్య సమరంలోని అనేక ముఖ్య సంఘటనలకు ఆనంద భవన్ కూడా సాక్షీ భూతంగా నిలిచింది. ఈ భవనంలోనే అప్పటి జాతీయ నాయకులు, కాంగ్రెస్ ఆధ్వర్యంలో అనేక సమావేశాలు జరిగాయి.
మహాత్మా గాంధీ అలహాబాద్ వచ్చినప్పుడల్లా ఈ భవనంలోనే వుండేవారు. ఆయనకి సంబంధించిన అనేక వస్తువులను ఇక్కడ భద్రపరిచారు.
దివంగత ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ వివాహం ఈ భవనంలోనే జరిగింది. 1970 లో శ్రీమతి ఇందిరా గాంధీ ఈ భవనాన్ని దేశ ప్రజలకి అంకితం చేయటంతో ఇక్కడ మ్యూజియం ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియం సందర్శన వేళలు ఉదయం 9-30 నుంచీ సాయంత్రం 5-00 గంటలదాకా. సోమవారం, ఇంకా ప్రభుత్వ సెలవదినాలలో మూసి వుంటుంది.
ప్రయాగలో ఇతర సందర్శనీయ ప్రదేశాలు
సమయం వున్నవారు సందర్శించదగ్గ ఇతర ప్రదేశాలు.....నాగ వాసుకీ దేవాలయం, మన్ కామేశ్వర్ మహా దేవ్ మందిరం (ఈ మందిరం నుంచి యమునా నది అందాలు చూడవచ్చుట..ఇక్కడ శివునికిచ్చే హారతి, వెనువెంటనే జరిగే ప్రార్ధనలు చాలా బాగుంటాయిట), వేణీ మాధవ మందిరాలున్నాయి. వీటిని మేము చూడలేదు కనుక ఇంతకన్నా చెప్పలేను.
దీనితో ప్రయాగ విశేషాలు అయినాయి. వచ్చే వారం ప్రయాగనుంచి వారణాసికి వెళ్ళే త్రోవలో వున్న సీతా మడి గురించి.
-పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)