కాశీ కబుర్లు – 24

ప్రయాగలో దర్శనీయ స్ధలాలు – 4

     

                                                                                                         

మాధవేశ్వరీ దేవి మందిరం

అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన  శ్రీ మాధవేశ్వరీ దేవి మందిరం ప్రయాగలోనే వుంది.  ఇక్కడి వారు ఈ మాతని అలోపీ దేవిగా వ్యవహరిస్తారు. ఆహ్వానం లేకుండా దక్ష యజ్ఞానికి వెళ్ళిన పార్వతీదేవి అవమానం భరించలేక ఆత్మాహుతి చేసుకోవటం, ఆవిడని ఎత్తుకుని శంకరుడు ఉగ్రతాండవం చేయటం, ఆయనని శాంతింపచేయటానికి విష్ణుమూర్తి పార్వతీ దేవి శరీరాన్ని తన విష్ణు చక్రంతో ముక్కలు చెయ్యటం, అవి 18 ముక్కలుగా దేశంలో వివిధ ప్రదేశాల్లో పడి శక్తి పీఠాలుగా ఖ్యాతి చెందటం మీకు తెలుసుకదా. 

ఇక్కడ అమ్మవారి ముంజేయి పడ్డది.  ఇక్కడ అమ్మవారి విగ్రహం ఏమీ వుండదు.  ఒక నలుచదరం పీఠంలాగా వుంటుంది.  దానిపైన ఒక గుడ్డ హుండీ వేలాడదీసినట్లుంటుంది.  దానికింద ఒక ఉయ్యాల.  భక్తులు తాము తీసుకెళ్ళిన కానుకలను ఆ ఉయ్యాలలో వుంచి మొక్కుకోవాలి.

అమ్మవారి విగ్రహం లేకపోవటంతో మన దేవాలయాలు సందర్శించిన తృప్తి వుండకపోయినా, అష్టాదశ శక్తి పీఠాలలో ఒక పీఠాన్ని దర్శించామన్న ఆనందంతో అక్కడనుండి బయల్దేరాము.


భరద్వాజ ఆశ్రమం

అతి పురాతనమైన ఈ ఆశ్రమం ప్రస్తుత చిరునామా కలొనల్ గంజ్ లో ఆనంద భవన్ సమీపంలో.  త్రేతా యుగంలో వనవాసానికి బయల్దేరిన శ్రీరామచంద్రుడు, సీతాదేవి, లక్ష్మణుడితో సహా గంగానదిని దాటి ఈ ఆశ్రమానికి వచ్చాడు.  ఇక్కడ మూడు రాత్రులు వుండి, భరద్వాజ మహర్షి దగ్గర అనేక విషయాలు తెలుసుకుని, ఆయన ఆశీర్వచనంతో యమునా నదిని దాటి చిత్రకూట్ కి పయనమయ్యాడు.    ఆ కాలంలో గంగానది ఈ ఆశ్రమానికి సమీపంలో ప్రవహిస్తూ వుండేది.  తర్వాత కాలంలో అక్బరు నిర్మిచిన బక్షి, బేని అనే ఆనకట్టల వలన గంగా ప్రవాహ గతి మారింది అంటారు. 

 

ఆ కాలంలో చాలా దూర ప్రదేశాలనుంచి విద్యార్ధులు విద్యనభ్యసించటానికి ఇక్కడికి వచ్చేవారు.  సందర్శకుల దర్శనార్ధం ఈ ఆశ్రమంలో శివ, కాళీమాత విగ్రహాలతోబాటు భరద్వాజ మహర్షి విగ్రహం కూడా వున్నది. 

 

ప్రస్తుతం ఆశ్రమానికి అతి సమీపంలో నివాస గృహాలు వచ్చాయి.  ఆశ్రమానికి ఆనుకుని పార్కు అభివృధ్ధి చేస్తున్నారుట.  సమయాభావంవల్ల పార్కు చూడలేదు.

 

 

 

 

 

 

 

 

-పి.యస్.యమ్. లక్ష్మి

(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)

 

 

 

 

 

 

 

 

 


More Kashi Yatra