మొవ్వ వేణుగోపాలస్వామి ఆలయం!
కృష్ణాజిల్లా కూచిపూడి అనగానే తెలుగువారికి ప్రత్యేకమైన నృత్యం గుర్తుకువస్తుంది. ఆ కూచిపూడికి సమీపంలో ఉన్న మొవ్వ పేరు వినగానే వేణుగోపాలుడు మదిలో నిలుస్తాడు. మొవ్వలో ఉన్న వేణుగోపాలుని ఆలయం ఈనాటిది కాదు! ఆ స్వామి మహత్యమూ సామాన్యమైనది కాదు!
ఒకప్పుడు మౌద్గల్యుడు అనే గొప్ప రుషి ఉండేవారు. ఆయన మొవ్వకి సమీపంలో ఉన్న కృష్ణానదీ తీరంలో ఘోర తపస్సు చేసుకోసాగారు. ఒక రోజు ఆ మహర్షికి నదీతీరంలో వేణుగోపాలస్వామి విగ్రహం దొరికింది. ఆ విగ్రహాన్ని స్వామివారి అనుగ్రహంగా భావించారు మౌద్గల మహర్షి. దానిని స్వామి ప్రతిరూపంగా తలచి నిత్యం పూజించేవారు. క్రమేపీ మౌద్గల్య మహర్షి కొలిచిన ఆ విగ్రహం చుట్టూ ఒక ఆలయం రూపొందింది.
వేణుగోపాల స్వామి విగ్రహం చాలా ప్రత్యేకమైనదని చెబుతారు. స్వామి వెనుక వున్న మకరతోరణం పై దశావతారాలు ఉన్నాయి. స్వామి ప్రక్కన రుక్మిణీ సత్యభామలు కూడా దర్శనమిస్తారు. చేతిలో వేణువుకు గాలి వూదే రంధ్రాలు కూడా స్పష్టంగా కనబడతాయి. ఈ విగ్రహం ఇసుక నుంచి ఉద్భవించింది కావడంతో కాలక్రమంలో కొంచెం దెబ్బతిన్నది. ఆ కారణంగా 2000 సంవత్సరంలో స్వామివారి విగ్రహాన్ని పోలిన మరో విగ్రహాన్ని రూపొందించి ప్రతిష్టంచారు. అయినా ఇప్పటికీ పాత విగ్రహాన్ని మనం ఆలయం వెనుక ఉన్న గదిలో చూడవచ్చు.
ఆలయ ప్రాంగణంలో ఆంజనేయస్వామివారి ఉపాలయం కూడా ఉంది. స్వామివారి కుడిచేతిలో ఖడ్గం, ఎడమచేతిలో సంజీవని ఉంటాయి. ఒకపక్క కోరుకున్న వరాలను అందిస్తూనే, మరోపక్క దుష్టులను శిక్షిస్తాడనేందుకు సూచనగా స్వామివారి చేతులలో ఖడ్గమూ, సంజీవనీ రెండూ కనిపిస్తాయి.
మువ్వ పేరు వినగానే వేణుగోపాలస్వామి ఆలయమే కాదు, ఆ స్వామి మహత్తుతో అద్భుతమైన పదాలు రాసిన క్షేత్రయ్య కూడా గుర్తకువస్తాడు. క్షేత్రయ్య పెద్ద పండితుడేమీ కాదు. ఆ మాటకు వస్తే అతను అక్షరాలు కూడా రాని ఒక గోవుల కాపరి. కానీ నిత్యం మొవ్వ గోపాలుని సేవించుకునేవాడు. వరదయ్య భక్తికి మెచ్చిన ఆ వేణుగోపాలుడు, అతని నాలుక మీద బీజాక్షరాలు రాశారని చెబుతారు. దాంతో వరదయ్య స్వామివారి మీద గీతాలు రచించేంతటి జ్ఞానిగా మారాడు. తనని తాను గోపికగా భావిస్తూ రసభక్తితో పదాలు సృష్టించాడు. ఆ పదాలు పాడుతూ అనేక క్షేత్రాలు తిరిగేవాడు. అలా ఆయనకు క్షేత్రయ్య అన్న పేరు స్థిరపడిపోయింది.
మొవ్వ వేణుగోపాలుడిని దర్శిస్తే ఎవరి జీవితమైనా తరించిపోతుంది అని చెప్పేందుకు క్షత్రయ్య జీవితమే ఒక ఉదాహరణ. మరెందుకాలస్యం! ఒకసారి వీలు చూసుకుని మొవ్వకి వెళ్లరండి. విజయవాడ నుంచి మొవ్వ కేవలం 50 కిలోమీటర్లే!!!