భూమి మీదకు గంగా నది ఎలా వచ్చింది..
.webp)
జీవితంలో ఒక్కసారైనా కాశీ దర్శనం, గంగానది స్నానం చేయాలని అంటుంటారు. సనాతన ధర్మం గంగానదిని చాలా పవిత్రమైన నదిగా పరిగణిస్తుంది. గంగానది స్నానం పాపాలను తొలగిస్తుందని నమ్మకం. అయితే గంగానది భూమి మీదకు ఎలా వచ్చింది? మొదట గంగానది స్థానం ఎక్కడ ఉండేది? దీని వెనుక ఉన్న పురాణ కథ ఏంటి? వీటి గురించి పూర్తీగా తెలుసుకుంటే..
గంగానది భూమి మీదకు ఎలా వచ్చిందనే విషయం గురించి స్పషంగా వాల్మీకి రామాయణం బాలకాండ లోనూ, భగవత పురాణం మహాభారతంలో లోనూ, ఇతర పురాణాలలోనూ చెప్పబడింది.
సగరుని యజ్ఞం..
ఇక్ష్వాకు వంశంలోని రాజు సగరుడు. సగరుడు అశ్వమేధ యజ్ఞం చేశాడు. యజ్ఞంలో వదిలిన అశ్వాన్ని దేవేంద్రుడు దొంగిలించి కపిల ముని ఆశ్రమంలో వదిలేశాడు. రాజు సగరునికి 60,000 మంది కుమారులు. ఆ 60వేల మంది కుమారులు ఆ గుర్రం కోసం వెతికి కపిలుని ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ గుర్రం కనబడటంతో కపిల మునిని అవమానపరిచారు. కపిలముని కోపం చెందడంతో ఆ కోపాగ్ని కారణంగా వాళ్లు భస్మం అయ్యారు.
విమోచనార్థం..
సగరుని 60,000 మంది కుమారుల ఆత్మలు శాంతి పొందాలంటే గంగానది స్వర్గం నుంచి భూమికి వచ్చి వారి అస్థికలపై ప్రవహించాలి. కానీ గంగాదేవి భూమిపైకి వచ్చే వేళ, ఆమె ప్రవాహ శక్తి భూమిని ముంచి వేస్తుంది. ఇది చాలా సంకటమైన పరిస్థితి. దీని కోసం భగీరథుడు తపస్సు చేశాడు.
భగీరథుని తపస్సు..
సగరుని వంశానికి చెందిన భగీరథుడు కఠినమైన తపస్సు చేశాడు. గంగానది భూమి మీద ప్రవహించి తమ పితృదేవతల ఆత్మకు శాంతి కలిగించాలని ఆయన కోరుకున్నాడు. చివరకు గంగాదేవి ఆయన్ను అనుగ్రహించి భూమిపైకి రావడానికి సిద్ధపడింది.
శివుడే కీలకం..
గంగానది ప్రవాహం చాలా ఉదృతమైనది. గంగానది భూమిని తాకితే భూమి దాన్ని భరించలేకపోతుంది. గంగానది భూమి మీదకు రావడానికి ఒప్పుకున్నా దాన్ని భూమి భరించలేక కలిగే ఉపద్రవాన్ని ఆపడానికి గొప్ప శక్తి అవసరం. అందుకే భగీరథుడు మరల శివుడిని ప్రార్థించాడు. భగీరథుడి కోరిక మేరకు శివుడు తన జటాజూటంలో గంగను ఆపి, ఆపై నెమ్మదిగా భూమి మీదకు విడుదల చేశాడు.
భగీరథప్రయత్నం ఫలితం..
గంగ భూమిపై ప్రవహించి, భగీరథుడు చూపిన దారిలో ప్రయాణిస్తూ చివరగా భస్మమైన సగరుని కుమారులపై ప్రవహించి వారికి మోక్షం కలిగించింది. అందుకే ఈ కారణంగానే మరణించిన వారి అస్తికలను కూడా గంగానదిలో కలిపే సంప్రదాయం ఉంది.
*రూపశ్రీ


