కృష్ణుడు పూజించిన హరసిద్ధి మాత
అడగందే అమ్మయినా పెట్టదని సామెత. కానీ ఆ జగజ్జనని తన బిడ్డలకు ఏం కావాలో గ్రహించి, అడగకుండానే వారి కోరికలను నెరవేరుస్తుంది. అందుకే ఆ తల్లిని భక్తులు తమకు తోచిన రూపాలలో కొలుచుకుంటూ ఉంటారు. అలా ఉత్తరాదివారు అమ్మవారిని కొలుచుకునే ఓ రూపమే ‘హరసిద్ధి మాత’.
అమ్మవారిని హరసిద్ధి మాతగా కొలవడం ఎప్పటి నుంచి ఆరంభమైందో చెప్పడం కష్టం. కానీ మహాభారతానికి చెందిన ఓ కథ మాత్రం ఇందుకు కారణంగా వినిపిస్తూ ఉంటుంది. శ్రీకృష్ణుడు, జరాసంధుడనే రాజుని సంహరించిన విషయం తెలిసిందే కదా! ఇలా జరాసంధుని సైన్యం మీదకు యుద్ధానికి వెళ్లే ముందు ఆయన జగజ్జననిని విజయం కోసం ప్రార్థించారట. తరువాత జరిగిన యుద్ధంలో జరాసంధుడు పరాజయం పాలయ్యాడు. ఈ విజయంతో యాదవులంతా కూడా విపరీతమైన హర్షాన్ని పొందారట. అప్పటి నుంచి అమ్మవారిని హర్షత్ మాతగా పిలుచుకోసాగారట. ఇందుకు తార్కాణంగా ఇప్పటికీ ఉత్తరాదిన యాదవులు ఈ తల్లిని తమ కులదేవతగా భావిస్తుంటారు. అంతేకాదు! స్వయంగా ఆ కృష్ణుడే ద్వారకకు సమీపంలోని కోయలా దుంగార్ అనే చోట హరసిద్ధి మాత ఆలయాన్ని నిర్మించారట.
కోయలా దుంగార్ కొండ మీద ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు దూరదూరాల నుంచీ భక్తులు వచ్చేవారట. అయితే అమ్మవారి చూపుల తీక్షణతకు ఆ సమీపంలో ప్రయాణించే ఓడలన్నీ దగ్థమైపోయేవి. దాంతో అమ్మవారిని కొండ మీద నుంచి తీసుకువచ్చి కింద ప్రతిష్టించాలని ‘జగ్దు షా’ అనే వ్యాపారవేత్త నిశ్చయించుకున్నాడు. జగ్దు షా ప్రార్థనలని మన్నించిన అమ్మవారు కూడా, తాను కింద నిర్మించే ఆలయంలో ఉండేందుకు అభయాన్ని ఒసగారు. అలా 13వ శతాబ్దంలో జగ్దు షా నిర్మించిన ఆలయం ఇప్పటికీ ప్రముఖ పుణ్యక్షేత్రంగా నిలుస్తోంది.
హరసిద్ధి మాతను హరసిద్ధి, హర్షత్ మాత, వాహనవతి, సింధోయ్ మాత వంటి భిన్నమైన పేర్లతో కొలుచుకుంటారు. జీవితంలో సుఖసంతోషాలను అందించే తల్లిగా, సముద్రంలోకి వెళ్లే మత్స్యకారుల క్షేమాన్ని చూసుకునే రక్షగా ఆమెను నమ్ముకుంటారు. అందుకే ఉత్తరాదిలో ఎక్కడ చూసినా ఆమె ఆలయాలు కనిపిస్తాయి. వాటిలో ఉజ్జయినిలో విక్రమాదిత్య రాజు నిర్మించిన ఆలయం ప్రముఖమైనది.
ఇక రాజస్థాన్‌లోని అభనేరి అనే ఊరిలో ఉన్న హర్షత్ మాత ఆలయానిది మరో కథ. ఇక్కడ వెలసిన అమ్మవారు ఊరి మొత్తానికీ తేజస్సుని అందిస్తుందని నమ్ముతారు. అందుకనే ఆ ఊరి పేరు ‘అభా నగరి’గా స్థిరపడిందంటారు. అదే క్రమేపీ అభనేరిగా మారింది. ఎప్పుడో ఎనిమిదో శతాబ్దంలో ఇక్కడి అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు.ఆ ఆలయానికి ముందర ‘చాంద్ బావోరీ’ అనే లోతైన మెట్ల బావినీ నిర్మించారు. వంద అడుగుల లోతున ఉండే ఈ బావిని చేరుకోవాలంటే 3,500 మెట్లు కిందకి దిగాల్సిందే! ఈ బావిలోకి దిగి కాళ్లుచేతులూ కడుక్కుని ఆలయంలోకి వెళ్తారు. వందల సంవత్సరాలు గడిచినా చాంద్ బావోరీ పెద్దగా మారలేదు. కానీ ఆలయం మాత్రం వలసపాలకుల దాడిలో దెబ్బతినిపోయింది. ఆలయాలు దెబ్బతింటే మాత్రమేం! తల్లి రూపు మాత్రం భక్తుల మనసులో ఎల్లప్పుడూ నిలిచే ఉంటుంది. అలా భక్తుల మనసులో వెలసిన హరసిద్ధి మాత వారి జీవితాలని సంతోషమయం చేస్తుంది.
- నిర్జర.