కాటుక కళ్లతో లోకానికే అందం!

 


మానవ సమాజం అడుగులు వేస్తున్న కొద్దీ కొన్ని ఆచారాలు ఏర్పడుతూ ఉంటాయి. వాటిలో కొన్ని కాలంతో పాటు కలిసిపోతే, మరికొన్ని కాలపు పరీక్షలను తట్టుకుని వేల సంవత్సరాలుగా నిలిచి ఉంటాయి. ఒక్కసారి ఆగి అవి ఇన్నాళ్లుగా ఎందుకు ఆదరణను పొందుతున్నాయో పరిశీలిస్తే, వాటి వెనుక ఉన్న ఆలోచన ఎంత గొప్పదో అర్థమవుతుంది. అలాంటి ఒక ఆచరణే కాటుకని ధరించడం

 

కాటుకని ధరించే ఆచారం ఈనాటిది కాదు! అది కేవలం భారతీయులకు మాత్రమే పరిమితమైనదీ కాదు! దాదాపు ఐదువేల సంవత్సరాలకు పూర్వమే ఈజిప్టు వాసులు కాటుకని ధరించేవారన్న ఆనవాళ్లు ఉన్నాయి. ఇప్పటికీ ఆనాటి చిత్రాలను గమనించినప్పుడు వారు కాటుకని ధరించి ఉండటాన్ని గమనించవచ్చు.

 

కాటుకని ధరించడానికి ముఖ్యమైన కారణం అందం! ప్రకృతిలో మనిషికి మాత్రమే నల్లటి కనుగుడ్డు చుట్టూతా తెల్లటి కంటిభాగం ఉంటుంది. దీనినే స్క్లెరా అంటారు. ఈ తెల్లటి భాగం వల్లే కనుగుడ్డు ఎటు కదులుతోందో? మనిషి కళ్లు పలుకుతున్న భవాలు ఏమిటో? తెలుస్తాయి. ఈ స్క్లెరా చుట్టూ కాటుకని పూయడం వల్ల కళ్ల పలికే భావాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. అందుకనే భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్యాలు చేసేవారు, తప్పకుండా కాటుకను ధరించి తీరతారు.
తెల్లటి భాగం చుట్టూ నల్లటి కాటుకని అద్దడం వల్ల ఒక కాంట్రాస్ట్‌ ఏర్పడి కంటి అందం ఇనుమడిస్తుంది. కాటుక కళ్లు అన్నమాట ఊరికనే రాలేదు కదా! అయితే కాటుకతో ఇలాంటి అంచుని తీర్చిదిద్దడం వల్ల మరో ఉపయోగం కూడా ఉంది. ఏ వస్తువునైతే చూస్తున్నామో, ఆ దృశ్యం మీద చూపు స్పష్టంగా నిలుస్తుంది. తుపాకీ గురిలాగా... కనురెప్పలకీ, కాటుకకీ మధ్య కనిపించే దృశ్యం మీదే కంటి చూపు నిశితంగా నిలుస్తుంది.

 

కాటుక తయారీలో గంధం, ఆముదాలదే ముఖ్య పాత్ర. ఈ రెండింటికీ కూడా కంటికి చలువ చేసే గుణం ఉంది. వంటింటి పొగ నుంచి కంప్యూటర్‌ తీక్షణత వరకూ స్త్రీలు ఎక్కడ పనిచేసినా ఈ కాటుక వారికి రక్షగా నిలుస్తుంది. కళ్లను అలవనీయకుండా అడ్డుపడుతుంది. చాలామంది మగవారు సైతం కళ్లు మంటగా ఉన్నప్పుడు ఒక చుక్క ఆముదాన్ని కళ్లలో వేసుకుంటూ ఉంటారు.

 

కంటికి అందాన్నిచ్చే మరో ముఖ్య భాగం కనురెప్పలు. కనురెప్పలు విశాలంగా ఉంటే అందం ఇనుమడింపచేస్తుంది. అలాంటి కనురెప్పలకి నిరంతరం ఆముదంతో కూడిన కాటుక తగులుతూ ఉంటే, వాటికి ఉండే వెంట్రుకలు పొడవుగా అందంగా పెరుగుతాయి.

 

ఆడా, మగా అన్న బేధం లేకుండా పిల్లలకు తప్పకుండా కాటుకని పెట్టడం ఇప్పటికీ ఆచారంగా వస్తున్నదే! రోజూ కాటుకని అద్దితే పిల్లలకు దిష్టి తగలదనీ, వారి కంటి నరాలు త్వరగా బలాన్ని పుంజుకుంటాయనీ, మెల్లకన్నులాంటి దృష్టిదోషాలు దరిచేరవనీ పెద్దల నమ్మకం.

 

ఇస్లాంలో కూడా సుర్మాకు (కాటుక) ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. వారు మన కాటుకలాగా కాకుండా ఒక ప్రత్యేకమైన రాయితో సుర్మాను తయారుచేసుకుంటారు. ఇది తీక్షణమైన సూర్యకిరణాల నుంచి కంటిని కాపాడుతుందనీ, దృష్టిదోషాలు రాకుండా నివారిస్తుందనీ వారి నమ్మకం. సాక్షాత్తూ మహమ్మద్‌ ప్రవక్తే సుర్మాను ధరించేవారని చెబుతారు. అందుకనే పవిత్రమైన రంజాన్‌ మాసంలో తప్పకుండా సుర్మాను ధరిస్తారు.

 

ప్రాంతాన్ని బట్టీ, నమ్మకాలను బట్టి కాటుకను వేర్వేరు రకాలుగా తయారుచేస్తూ ఉంటారు. కొంతమంది కేవలం గంధం, ఆముదాల మసితో కాటుకను రూపొందిస్తే... మరికొందరు కరక్కాయ, పచ్చకర్పూరం, నువ్వులనూనె వంటివి కూడా ఉపయోగిస్తారు. మరికొందరు ఔషధులను కూడా కాటుక తయారీలో చేరుస్తారు. సంప్రదాయబద్ధంగా తయారుచేసే ఇలాంటి కాటుకలన్నీ కంటి ఆరోగ్యాన్ని పెంపొందించేవే! కాకపోతే బయట బజార్లో కాటుకను కొనేటప్పుడే కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. ఏ కాటుకని పడితే ఆ కాటుకను వాడిపారేస్తే వాటిలో ఉండే సీసం వంటి రసాయనాల వల్ల అసలుకే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా పిల్లలకు కాటుకని పెట్టాలనుకున్నప్పుడు కాటుక తయారీలోనూ, కొనుగోలులోనూ మరింత జాగ్రత్త అవసరం! ఈ కాస్త జాగ్రత్తను తీసుకుంటే చాలు కాటుక కళ్లు ఈ లోకాన్ని మరింత కాంతిమంతం చేస్తాయి.

 

- నిర్జర.


More Enduku-Emiti