యముడికి శాపం పెట్టిన ఛాయ... కారణం ఇదే…
సూర్యుడు విశ్వకర్మ పుత్రికను సంజ్ఞను పెండ్లాడి ఆమెతో సంతోషంగా ఉండగా కొంతకాలానికి మనువు, యముడు అని ఇద్దరు కొడుకులు, యమున అనే కూతురు కలిగారు. తరువాత సంజ్ఞ సూర్యుని ప్రచండ కిరణాలకు ఓర్వలేక తన ఛాయతో ఒక యువతిని సృష్టించి పతి శుశ్రూషను జాగరూకతగా చేస్తూ ఉండు, నా పిల్లలను ఆప్యాయంగా పోషిస్తూ ఉండని చెప్పి అడవికి పోయి ఆమె గుర్రముగా మారి తపస్సు చేస్తూ ఉన్నది.
ఛాయ సంజ్ఞలాగే పతిని సేవిస్తూ ఉండగా సూర్యుడు సంజ్ఞగా భావించి అనుకూలంగా అప్యాయంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అలా ఉండగా కొంతకాలానికి ఛాయకు మనువు, శనైశ్చరుడు అని ఇద్దరు కుమారులు, తపసి అనే కూతురూ పుట్టారు. క్రమంగా పెరుగుతూండగా ఛాయ తన పిల్లలను చూసేటట్లు సంజ్ఞ పిల్లలను చూడకపోగా ఒకనాడు యముడు కోపావిష్టుడై పినతల్లిని చూసి ఇలా అన్నాడు.
"తల్లివై ఉన్న నువ్వు పిల్లలనందరను సరిగా చూడక మామీద పక్షపాతముతో ఉంటున్నావు ఏమిటి బుద్ధి? ఎలా కలిగింది నీకు?" అని అనగా ఛాయ కోపించి అనరాని, వినరాని మాటలు అన్నాడు. యముడు ఆ మాటలు భరించలేక ఛాయను తన్నాడు. ఆ అవమానం భరించలేక ఛాయ నీ పాదాలు భారములగుగాక అని శపించింది. ఆ మర్నాడు సూర్యుడు వికృతములై ఉన్న యముని పాదాలు చూసి ఏమి కారణం? నీ పాదాలిలా ఉన్నాయి అని అడగగా యముడు చెప్పాడు.
"నాయనా! నువ్వు కర్మసాక్షివని అందరూ అంటూ ఉండగా వింటున్నాను. మన ఇంట ఏమి జరిగిందో చెప్పాలని అడిగావు కనుక చెప్తున్నాను విను. అమ్మలాగే ఉన్న ఈమె అన్నదమ్ములమైన మమ్మల్ని సమదృష్టితో చూడకుండా వేరుగా చూస్తోంది. అదే నేను అడిగాను. దానికె కోపించి నన్ను తిట్టింది. నేను భరించలేక తన్నాను. ఈమె మా అమ్మలాగా ఉన్నది చూడడానికి. కాని ప్రవర్తనలో మా అమ్మలాగే లేదు. ఎవరో మాయలాడి. తెలిసో తెలియకో కొడుకులేమైనా అంటే కన్నతల్లి సముదాయిస్తుందిగా! ఇలా శపిస్తుందా? ఇది తల్లి గుణమేనా? నేను తన్నానన్నది. నాకు ఈమె మీద తల్లి భావం కలగలేదు. నా మనస్సాక్షిగా చెప్తున్నాను. ఈమె నాతల్లి కాదు నేనీమె కొడుకునుకాదు నా మాట విను, ఇక మీ యిష్టం నా అదృష్టం" అన్నాడు
సూర్యుడు ఛాయాదేవిని పరిశీలనగా చూశాడు. "కాంతా! ఎవరు నువ్వు? యమునిపై అంతనిర్దయగా ప్రవర్తించావు. కన్నతల్లి అలా శపిస్తుందా! ఏమి కారణం? నువ్వు మాయలాడివనే నమ్మవలసి వచ్చింది. ఉన్నది ఉన్నట్టు చెప్పు. చెప్పవా నీకు తగిన శిక్ష వెయ్యవలసి వస్తుంది" అని అనగా ఛాయ ' నేను సంజ్ఞను కాదు. నాపేరు ఛాయ. నీ కిరణాల వేడి భరించలేక సంజ్ఞ నన్ను తన ఛాయతో కల్పించి ఇక్కడ ఉంచి తాను అడవికి పోయింది. తపస్సు చేస్తుందట" అని చెప్పింది.
ఛాయ మాటలు విని సూర్యుడు మరేమీ అనలేక యముని పాదాలు యథాపూర్వముగా ఉండేలా అనుగ్రహించాడు. ఇదీ యముడికి కలిగిన శాపం వెనుక కథ.
◆నిశ్శబ్ద.