శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..!
పద్మావతీ వివాహానంతరం, స్వామివారు శేషాద్రికొండపై తొండమానుడు నిర్మించిన మందిరంలో కొలువున్నాడు. ఆనాటి నుండి బ్రహ్మదేవుడు ఉత్సవాలను ప్రారంభించాడు. శ్రీనివాసుని ఉత్సవాలకై బ్రహ్మదేవుడు ఉత్సవ శ్రీనివాసుడు, ఉగ్రశ్రీనివాసుడు, సర్వాధిక శ్రీనివాసుడు, శ్రీలేఖక శ్రీనివాసుడు అంటూ నాలుగు మూర్తులను వేద సంప్రదాయం ప్రకారం నిర్మించాడు. ఆ మూర్తులు ఇప్పటికీ సంప్రదాయబద్ధంగా పూజలందుకుంటున్నాయి. ఇలా బ్రహ్మ ద్వారా ప్రారంభింపబడిన బ్రహ్మోత్సవాలలో శ్రీనివాసుని వైభవం శోభాయమానమై లోక కళ్యాణకారకమవుతోంది. నాడు బ్రహ్మాది దేవతలచే పూజింపబడిన వేంకటేశ్వర స్వామి, సప్తర్షులు, జగద్గురు ఆదిశంకరాచార్య, శ్రీరామానుజాచార్య, శ్రీ కులశేఖరాళ్వారులు, శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు, శ్రీకృష్ణ దేవరాయలు వంటివారి సేవలందుకున్నాడు. శ్రీ తిరుమల తిరుపతి మహాక్షేత్రంలో భక్తజన సంరక్షణార్థం శ్రీమన్నారాయణుడు అర్చావతారుడై వెలసి ఉన్నాడు.
వేంకటాద్రి సమమ్ స్థానమ్ బ్రహ్మాండే నాస్తి |
వెంకటేశ సమో దేవో న భూతో నభవిష్యతి || అని కంఠోక్తిగా చెప్పబడింది.
అనగా వేంకటాచలానికి తుల్యమైన దివ్యక్షేత్రం, ఈ బ్రహ్మండమంతటిలోనూ మరొకటి లేదు. అంటే బ్రహ్మాండం అంతటిలోనూ మహోత్తమమైన దివ్యక్షేత్రం శ్రీ వేంకటాచల క్షేత్రం తిరుమల. శ్రీ వేంకటేశ్వరునితో సరితూగగల మరొక దైవం ఎవ్వరూ ఇంతకు పూర్వం లేరు. ఇకముందు భవిష్యత్తులో ఉండబోరు. భూత, భవిష్యత్, వర్తమానాలలో సరిసాటిలేని పరమదైవం శ్రీ వేంకటేశ్వరుడు. అలాంటి శేషాద్రివాసునికి జరిగే బ్రహ్మోత్సవాలకు ఆ పేరు ఎందుకు ఏర్పడిందనే విషయం తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.
పరమదైవమైన శ్రీ వేంకటేశ్వరునికి చతుర్ముఖ బ్రహ్మ జరిపించిన ఉత్సవాలే బ్రహ్మోత్సవాలు. శ్రీనివాసుని ప్రీత్యర్థంగా, ఆయన కుమారుడైన బ్రహ్మదేవుడు ప్రారంభించిన ఉత్సవాలు కావడం వల్ల, వీటికి బ్రహ్మోత్సవాలనే పేరు వచ్చింది. నవ (తొమ్మిది) సంఖ్యకు- బ్రహ్మాభిదాఖ్య సంఖ్య అని ప్రసిద్ధి. ముందురోజున జరిగే అంకురారోపణం, ధ్వజారోహణం, చివరోజున జరిగే శ్రీ పుష్పయాగం- ఇవి మినహాయించగా మధ్యలో తొమ్మిది రోజులుగా జరిగే ఉత్సవాలు కనుక ఈ ఉత్సవాలకు బ్రహ్మోత్సవాలని నామాంకితం చేయబడిందని, ఆగమ శాస్త్ర ప్రమాణ వాక్యం.
ఈ బ్రహ్మోత్సవాలను శ్రీ వేంకటాచలేశ్వరుని అనుగ్రహం కోరి జరిపించడం వల్ల విధాతకు సకల మనోరథప్రాప్తి కలిగిందని కాబట్టి ఇవి బ్రహ్మత్సవాలుగా ప్రసిద్ధి చెందాయని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం, సూర్యుడు కన్యారాశిలో ఉన్న సమయంలో జరుగుతాయి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమితో ప్రారంభమవుతాయి. ఆ ప్రారంభ దినానికి ముందు రోజున మృత్తికా గ్రహణం, అంకురారోపణం, ధ్వజారోహణం జరుపబడతాయి. అదే రోజున ప్రప్రథమంగా శ్రీ వేంకటేశ్వరుని సేనానాయకుడైన శ్రీ విష్వక్సేన భగవానుని యథావిధిగా పూజిస్తారు. విష్వక్సేనుల వారిని చతుర్వీథుల ఉత్సవం పేరిట ఊరేగించి, తీసుకుని వస్తారు. విష్వక్సేనుడు దేవాలయానికి తిరిగివచ్చిన తర్వాత యాగశాలలో, మృత్తికా గ్రహణం అంకురారోపణం చేస్తారు.
అలాగే ధ్వజరోహణం ఎలా చేస్తారంటే.. ఒక దృఢమైన నూతన వస్త్రంపైన శ్రీ వేంకటేశ్వరుని వాహనమైన గరుత్మంతుని చిత్రాన్ని లిఖిస్తారు. ఆ చిత్రించిన నూతన వస్త్రాన్ని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయ ధ్వజస్తంభ శిఖరాగ్రంపైన ఎగురవేస్తారు అర్చకులు. దీనినే ధ్వజారోహణం అంటారు. గరుత్మంతుడు తన ప్రభువైన శ్రీ వేంకటేశ్వరునికి జరగబోతున్న బ్రహ్మోత్సవాలకు ఊర్ధ్వలోకాలోని సకల దేవతా గణాలను విచ్చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నట్లుగా, ఆ సమయంలో వేదపండితులు మంత్రపఠనం చేస్తారు. ఆ విధంగా శ్రీ వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి.