శ్రీ వెంకటేశ్వర స్వామి కథ మనకేం చెప్తుంది
గీతలో శ్రీకృష్ణ భగవానుడు
“శ్లోకం:
బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహం
మాసానాం మార్గశీర్షో హ మృతూనాం కుసుమాకరః
భావం:
"సామములలో బృహత్సామం, ఛందస్సులలో గాయత్రి, నెలలలో మార్గశిరము, ఋతువులలో వసంతమూ నేనే.” అంటాడు.
మాసాలలో మార్గశిరమాసం మహావిష్ణువుకు ఇష్టం. లక్ష్మీదేవికీ ఇది ప్రీతికరం!
ఆ సందర్భంగా ఈ కథా విశ్లేషణ: శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం తెలుగు వారందరికీ తెలిసిన కథ.
అందులో…
లోకకళ్యాణం కొరకై యజ్ఞం తలపెట్టిన మహర్షులు త్రిమూర్తులలో గొప్పవారెవరో నిర్ణయించమని భృగుమహర్షిని పంపుతారు. అరికాలిలో నేత్రం కారణంగా తనకి గల శక్తిపట్ల గర్వితుడై ఉన్న భృగు మహర్షి, తొలుత సత్యలోకాన్ని చేరాడు. వేదగానం చేస్తూ బ్రహ్మదేవుడు, ఆయన గాత్రానికి వీణానాదాన్ని అందిస్తూ సరస్వతీ దేవి సంగీతంలో సంలీనులై ఉన్నారు. ఆలుమగలిద్దరూ ఒకే అనుభూతిలో లయించి ఉండగా ఆ అనునాదం అనంతమై విస్తరించింది. భృగు రాక వారిని ఆటంక పరచలేదు. దాంతో వారు ఆయన రాకకి స్పందించలేదు. బ్రహ్మకు భూలోకంలో ఆలయాలుండవని శపించిన భృగవు, నేరుగా కైలాసానికి వెళ్ళాడు.
కైలాసంలో శివపార్వతులు నాట్యంలో లీనమై ఉన్నారు. ఆది దంపతులతో బాటు గణపతి కుమారస్వామి సహితంగా నందీ భృంగీ, రుద్రగణాలు ఆ పారవశ్యంలో ఉన్నారు. ఇక్కడా భృగు మహర్షికి స్వాగత సత్కారాలు లభించలేదు. పార్వతీపరమేశ్వరులు తాళం తప్పకుండా చేస్తున్న నాట్యం సర్వసృష్టికీ శృతిలయలై ఉంది. అహంకార రహితుడై ఉండి ఉంటే… భృగుమహర్షి, ఆది దేవుడు నాట్యమాపి తనని పలకరించే వరకూ సహజంగా, భక్తిగా, వేచి ఉండేవాడు. కానీ భృగువుకి అదనపు శక్తి ఉంది. దాని తాలూకూ అహంకారమూ ఉంది. కాబట్టి భక్తుడు భగవంతుడి కోసం వేచి ఉండటం కాదు, భగవంతుడే భక్తుడి రాక కోసం మెళకువతో ఉండాలనుకున్నాడు. దాంతో ఆగ్రహన్ని నిగ్రహించుకోలేక లింగాకృతికే తప్ప పరమేశ్వరుడి రూపానికి అర్చనలుండ రాదని శపించి వైకుంఠానికి వెళ్ళాడు.
అక్కడ లక్ష్మీనారాయణలు చదరంగ వినోదంలో ఉన్నారు. సత్యలోకంలో బ్రహ్మా సరస్వతుల హృదయాలు సంగీత భరితమైతే, కైలాసంలో శివపార్వతుల తనువులు నాట్యగతిలో లయించి ఉన్నారు. వైకుంఠంలో లక్ష్మీవిష్ణువులు మేధస్సు పరంగా చదరంగ క్రీడలో మునిగి ఉన్నారు. ‘సృష్టి స్థితి లయకారులం కదా’ అని త్రిమూర్తుల్లో ఎవరూ ఇల్లాలితో గడపటానికి ‘టైం లేదు. బిజీగా ఉన్నాం’ అనలేదు, అనుకోలేదు. క్రీడా వినోదంలో మునిగి ఉన్న శ్రీహరి శ్రీదేవిలను చూశాడు భృగువు. అప్పటికే ఆగ్ర్రహం హద్దులు దాటి ఉంది. కాలెత్తి మహా విష్ణువు వక్షస్థలం పై తన్నాడు. గుండెలపై తన్నిన బిడ్డణ్ణి చూసిన తండ్రిలా… శాంతంగా చిరునవ్వు నవ్వాడు శ్రీహరి!
భృగువుని బుజ్జగిస్తూ, అతిధి సత్కారాల్లో భాగంగా అర్ఘ్యపాద్యాలు సమర్పిస్తూ… భృగువు అరికాలిలోని నేత్రాన్ని చిదిమి వేసాడు. అప్పటికి కానీ భృగు మహర్షి తలకెక్కిన అహంకార మహమ్మారి దిగిపోలేదు, చేసిన తప్పిదాలు తెలిసి రాలేదు, పోగొట్టుకున్న తపశ్శక్తి నష్టం అర్ధం కాలేదు. దాంతో దిమ్మతిరిగి వాస్తవంలోకి వచ్చిపడ్డ భృగువు, దుఃఖిస్తూ శ్రీహరి పాదాలపై బడ్డాడు. ఆపైన పశ్చాతప్తుడై తపోవనానికి తరలిపోయాడు. అతణ్ణి ఆశ్వీదించి తిరిగి చూసిన శ్రీహరికి, ఎదురుగా శోకమూర్తియై శ్రీలక్ష్మి నిలిచి ఉంది! తన నివాసస్థానమైన మహా విష్ణువు వక్షస్థలంపై తన్నిన భృగువుని విష్ణువు శిక్షించకుండా సమాదరించి పంపినందుకు ఆ తల్లి అవమానం పదింతలైనట్లుగా పరితపిస్తోంది.
అనునయించ బోయిన శ్రీమన్నారాయణుడికి శ్రీదేవి శోకాశ్రువులే సమాధానం చెప్పాయి. బాధతప్తమై, ఆ ఇల్లాలు కన్నీటితో భర్తని విడిచిపోయింది. సిరి తనతో ఉన్నప్పుడు సర్వ సంపదలతో వైభవమూర్తియై విలసిల్లిన శ్రీమన్నారాయణుడు, సిరిదేవి విడిచి వెళ్ళటంతో దరిద్ర నారాయణుడై… అడవులు బట్టి పోయాడు.
గుక్కెడు పాలకి పుట్టలో ఉండి, పొదుగు వదలిన గోమాత పుణ్యాన కడుపు నింపు కున్నాడు. దేశ దిమ్మరిలా తిరుగుతూ వకుళ మాలని చేరినప్పుడు సైతం “ఎవరు నాయనా నీవు?” అంటే… “ఏ పేరని చెప్పను? ఏ పేరుతో పిలిచినా పలుకుతాను. ఏ ఊరని చెప్పను? అన్ని ఊళ్ళు నావే! సిరియు నుండె తొల్లి. ఇప్పుడు తొలగి పోయినది” అంటాడు. ఆ తల్లి జాలిపడుతూ “అంతే నాయనా లోకరీతి! భాగ్యమున్నంత కాలం అందరూ గౌరవిస్తారు. కలిమి కోల్పోయిన నాడు అన్నీ కోల్పోయినట్లే!” అంటూ కన్నబిడ్డ నాదరించినట్లు ఆదరిస్తుంది. ఆశ్రమ వాసియై, వరాహమూర్తి అనుమతి పొంది, ఆశ్రితుడై జీవిస్తూ… ఆకాశరాజపుత్రి పద్మావతిని పరిణయమాడాలను కుంటే… పైసలేవీ? పెళ్ళి చేసుకునేందుకు వడ్డీకి అప్పు తీసుకోవాల్సి వచ్చింది. ఒకప్పుడు సిరిసంపదలకి నెలవైన వాడు!
కలకంఠ కంట కన్నీరొలికితే… అదీ పరిస్థితి!
అందుకే – “కట్టుకున్న ఇల్లాలి కంట కన్నీరు చిందితే ఆ ఇంటి సంపదలు నిలబడవు” అంటారు. అదీ, హిందూ మతం… స్త్రీకి, జీవన సహచరికి ఇచ్చిన ప్రాముఖ్యత!
అదే కలియుగ దైవం ‘శ్రీ వేంకటేశ్వరుడి కథ’ మనకి చెబుతుంది. [ఇదంతా వదిలేసి ఇప్పుడు చాలామంది శ్రీ వేంకటేశ్వర స్వామితో లంచాల బేరసారాలు చేస్తుంటారు.]
అందుకే – ఒకప్పుడు ఇంట ఆడపిల్ల పుడితే ‘మహాలక్ష్మి పుట్టిందిరా’ అనేవాళ్ళు. ఆ భావం బలంగా ఉన్నప్పుడు ఆడపిల్ల అని భౄణహత్యలూ, శిశు హత్యలూ జరగవు.
‘ఇల్లాలి కంటి నీరు ఇంటికి చేటు’ అనుకుంటే, వరకట్నపు చావులూ ఉండవు.
అయితే ఇక్కడా ఓ హద్దు ఉంది సుమా!
ఇల్లాలికి అరిషడ్వర్గాలు అదుపులో లేవనుకొండి. మొగుడి ఆదాయానికి ఆరింతలు ఖరీదుండే పట్టుకోకలూ, పట్టెడ నగలూ గట్రా కోరికలతో వేపుకు తింటుంటే… అప్పుడు ‘కలకంఠి, కంట కన్నీరొలికిన కరిగి పోవురా సిరులు’ అనుకోవటం కష్టం. ఎందుకంటే – కోరికల చిట్టా కొండవీటి చాంతాడంత ఉంటే మగాడి బ్రతుకు మటాష్ అయిపోతుంది మరి!
అంచేత, ఇది… కోరికలు వాస్తవ ప్రపంచం తోనూ, భర్త పరిస్థితులతోనూ అనుసంధానమై ఉండే అతివల విషయంలోనే అనువర్తించ గలిగేది. ఏమైనా… భార్య భావాలని గౌరవిస్తే, ఆమె అవమానాలని తన అవమానంగా భావిస్తే, ఆమె మనస్సుని నొప్పించక పోతే… మొత్తంగా, ఆమె కంట కన్నీరు చిందకుండా చూసుకుంటే సిరి, సుఖ సంతోషాలు ఆ ఇంట స్థిరంగా ఉండిపోతాయి.