కలియుగ ప్రత్యక్షదైవం...శ్రీ వేంకటేశ్వరస్వామి!

శ్రీవేంకటేశ్వరస్వామి కలియుగ దైవంగా..ఏడుకొండలస్వామిగా, అనాధ రక్షకుడిగా, ఆర్తజనదీక్షాదక్షుడుగా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా అన్నింటికీమించి గోవిందుడుగా కొలవబడుతున్నాడు. పద్మావతీదేవి,అలువేలుమంగ పతిగా, సప్తగిరీశుడుగా, తిరుమలేశుడిగా భక్తకోటికి దర్శనమిస్తున్నారు. వేంకటాద్రికి సరితూగే స్థానంగాని, వేంటేశ్వరుడికి సమాన దైవం లేదని పురాణాలు చెబుతున్నాయి. భృగుమర్షి కారణంగా శ్రీమహావిష్ణురూపంలో భువికి రావడం శ్రీనివాసుడిగా వేంకటాద్రిపై కొలువై ఉండటం...ఇదంతా విష్ణులీలా విశేషమని మహర్షులు చెప్పిన మాట. శ్రవణ నక్షత్రంనాడు, మహావిష్ణువు శ్రీవేంకటేశ్వరస్వామిగా అవతరించాడు. కావున ప్రతీ శ్రవణ నక్షత్రం నాడు ఉభయ దేవేరులతో కూడియున్న మలయప్పస్వామివారు తిరుమల తిరువీధుల్లో బంగారు రథంపై విహరిస్తుంటారు. ఈ దేవదేవుణ్ణి చూసి భక్తులు తరిస్తారు.

స్వామివారి పుష్కరిణిలో స్నానం, వరహాస్వామి దర్శనం, కటాహతీర్థపానం, ఈ మూడూ మూల్లోకాలలో దుర్లభం అని స్కాందపురాణంలో ఉంది. వినా వేంకటేశం,ననాదో ననాథ:  సదా వేంకటేశం స్మరామి స్మరామి స్వామీ నీవు తప్పా మాకే ఇంకెవరు దిక్కు. నిన్నే నిరంతరం స్మరిస్తుంటాం. ప్రతిఏడాది వసంత బుుతువునందు చైత్రమాసంలో శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ..ఈ మూడు తిథులందును ఘనం నిర్వహించి స్వామివారిని లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. స్వామివారి కృపా వీక్షణాలతో మూగవాడు సైతం మాట్లాడతాడు. కుంటివాడు నడుస్తాడని భక్తులు విశ్వసిస్తుంటారు. ‘అజ్ఞానినా మయాదోషాన్ అశేషాన్, విహితాన్ హరేః క్షమస్వతం క్షమస్వతం- శేషశైల శిఖామణే’ అంటూ భక్తులు రెండు చేతులు పైకి ఎత్తి జోడించి శ్రీవేంకటేశ్వరస్వామిని వేడుకుంటారు.

శ్రీ మార్కండేయ మహర్షి, శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యంలో వజ్ర కవజ స్తోత్రాన్ని రచించినట్లుగా ప్రసిద్ధి. ఇందులో శ్రీవేంకటేశుని స్మరిస్తుంటే..మనకు సంపూర్ణ రక్షణ ఉంటుందని తెలియజేస్తుంది. ప్రతిరోజూ వేలాది భక్తులు ఏడుకొండస్వామిని దర్శించుకుని తరిస్తుంటారు. ప్రతియేటా బ్రహ్మోత్సవాలు ఇతర వసంతాది మహోత్సవాలు, స్వామివారి నిత్య కళ్యాణోత్సవాలు దర్శించే భక్తులు దైవానుగ్రహ పాత్రులవుతారు. ఏడుకొండలవేంకటేశ్వరస్వామి లీలలు వర్ణనాతీతములు.


More Venkateswara Swamy