భక్తికి, త్యాగానికి, జ్ఞానానికి మారుపేరు భీష్ముడు!

◆నేడు భీష్మ ఏకాదశి◆

పంచమవేదంగా పేరు పొందిన మహా భారతం సర్వ ధర్మ సమన్వయరూపం. అది ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థాలకు విజ్ఞాన సర్వస్వం. భారతంలోని భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రం ఆ మహా కావ్యానికి రెండు కన్నులలాగ ప్రకాశించి మానవాళికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. ఆ రెండిటిలో భగవద్గీత కర్మ యోగానికి ప్రతీక అయితే విష్ణు సహస్రనామం భక్తి యోగాన్ని పరిమళింపజేస్తుంది.


విష్ణుసహస్రనామస్తోత్రం పరమాత్ముడు, పురుషోత్తముడు అయిన శ్రీహరి విశ్వమయతను, సహస్ర శీర్ష మూర్తి తత్త్వాన్ని వివరించి మనలో ఆధ్యాత్మిక తేజస్సును ప్రకాశింపజేస్తుంది. ఆ విష్ణుసహస్రనామాన్ని భగవంతునికి అంకితం చేస్తూ స్తోత్ర రూపంలో పాండవులకు భీష్ముడు ఉపదేశించిన తరువాత అది అత్యంత శక్తివంతమైన భక్తి మార్గంగా అందరిచేతా ఆచరించబడింది. స్తోత్రాలన్నింటిలో తలమానికమై, భక్తి సాధనలో పవిత్ర పునశ్చరణ మంత్రంగా ఉపాసించబడుతోంది. ఆ విష్ణు సహస్రనామం జగద్విదితమైన మాఘశుద్ధ ఏకాదశి పవిత్రమైన భీష్మ ఏకాదశిగా ప్రతి సంవత్సరం ఆచరించబడుతున్నది.


మహా భారతంలో భీష్ముని పాత్ర అత్యంత ప్రశస్తమైనది. కురు పాండు రాకుమారులకు విద్యా బుద్ధులు చెప్పించి, వారి వృద్ధికి తోడ్పడిన ఆచార్యుడు భీష్ముడు. దేవ గురువు బృహస్పతి వద్ద రాజనీతినీ, ఇక్ష్వాకుల కులగురువు వశిష్ఠుని వద్ద వేద వేదాంగాలనూ, పరశురాముని వద్ద విలువిద్యనూ అభ్యసించిన బహుముఖ ప్రజ్ఞాశాలి భీష్మాచార్యుడు. తన తండ్రి కోసం రాజ్యాధికారాన్ని త్యాగం చేసి ఆజన్మాంతం బ్రహ్మచర్య వ్రత దీక్షను పూనిన దీక్షాపరుడు ఆ మహనీయుడు. అన్నిటికీ మించి శ్రీకృష్ణుని అవతార తత్త్వాన్ని గ్రహించి ఆయన్ని మనసారా సేవించి, ఆ భగవానుని అనుగ్రహం పొందిన భాగవతోత్తముడు భీష్ముడు. 


కౌరవ పాండవుల మధ్య రాజీకి ధర్మ బద్ధంగా కృషిచేసి అది విఫలమైతే కౌరవుల పక్షాన కురుక్షేత్ర సంగ్రామంలో యుద్ధం చేసిన భీష్ముడు అర్జునుడి బాణాలతో నేలకొరిగినప్పుడు దేవతలు అతని వద్దకు హంస రూపంలో వచ్చి ఇప్పుడు దక్షిణాయనం కనుక ఉత్తరాయణం వచ్చే వరకూ ప్రాణ త్యాగం చేయవద్దని సూచించారు. అప్పుడు భీష్ముడు తన తండ్రి ప్రసాదించిన వరం వలన మాఘ మాసంలో స్వచ్ఛంద మరణం పొందాడు.


అంతవరకూ భీష్మునికి అర్జునుడు అంపశయ్యను అమర్చి అతని ఆకలి దప్పులు తీరటానికి గంగా జలాన్ని భూమి నుండి పైకి తెప్పించాడు. శరతల్పగతుడైన భీష్ముణ్ణి కౌరవ పాండవులు ప్రేమతో సేవించారు. భీష్ముడు శరతల్పం పైనున్న కాలం భారతంలో అత్యంత ప్రశస్తమైంది. ఈ కాలంలోనే ధర్మరాజు పట్టాభిషిక్తుడయ్యాడు. ఆ ఒకటిన్నర నెలల కాలం భీష్ముడు శ్రీకృష్ణుని ధ్యానంలోనే గడిపాడు. ధర్మరాజు సింహాసనం అధిష్టించినా, అర్జునుడు గీతోపదేశం పొందినా పాండవులు భీష్ముని వద్ద సమస్త ధర్మాలూ, పరిపాలనా పరిజ్ఞానం పొందాలని శ్రీకృష్ణుడు పాండవులను భీష్మునివద్దకు తీసుకువెళ్ళాడు. అప్పటికే బృహస్పతి, వాల్మీకి, పరశరాముడు, వసిష్ఠుడు, వ్యాసుడు, గౌతముడు మొదలైన మహర్షులు భీష్ముణ్ణి కీర్తిస్తున్నారు. శ్రీకృష్ణుడు భీష్ముని సత్య, ధర్మ, తపో, దాన, దయాగుణాలను మిక్కిలి ప్రశంసించి ధర్మజాదులకు ధర్మ సంచయాన్ని బోధించమని కోరాడు.


శ్రీకృష్ణ పరమాత్మను భీష్ముడు భక్తి పూర్వకంగా స్తుతించి పాండవులకు సర్వ ధర్మ పరిజ్ఞానం ఉపదేశించాడు. అప్పుడే పాండవులకు విష్ణు సహస్రనామం ఉపదేశించబడింది. శ్రీ విష్ణు సహస్రనామం వేద భగవద్గీతల భక్తిసారం. భీష్ముడు మాఘశుద్ధ అష్టమినాడు జీవితత్యాగం గావించాడు. శ్రీకృష్ణుని అనుగ్రహం వలన మూడవ రోజు అయిన మాఘశుద్ధ ఏకాదశి (విష్ణు సహస్రనామం ఉదయించిన పుణ్యదినం) నాటి నుండి భీష్మ ఏకాదశిగా ఆచరించబడుతోంది.


                                     ◆నిశ్శబ్ద.
 


More Purana Patralu - Mythological Stories