రాజకీయ నాయకులకు ఇష్టదేవత- వక్రకాళి
తమిళనాట విల్లుపురం జిల్లా. ఆ జిల్లాలో తిరువక్కరై అనే చిన్న గ్రామం. అవడానికి చాలా చిన్న ఊరే! కానీ ఆ ఊరిలో ఉన్న చంద్రమౌళీశ్వరుని ఆలయం చాలా ప్రసిద్ధమైంది. ఇంతకీ ఆ ఆలయ చరిత్ర ఏమిటో! అది అంతగా ప్రసిద్ధమయ్యేందుకు కారణాలు ఏమిటో...
తరువక్కురైలో వరాహ నదీతీరాన వెలసిన చంద్రమౌళీశ్వరుడు గురించి రెండువేల సంవత్సరాల నుంచే గాథలు ప్రచారంలో ఉన్నాయి. తమిళనాట ప్రముఖ శైవభక్తులైన నయనార్ల రాతలలో ఈ స్వామివారి గురించి ప్రసక్తి, ప్రశస్తి కనిపిస్తుంది. వైష్ణవులకు 108 దివ్యదేశాలు ఎలా ఉన్నాయో... నయనార్ల పద్యాలను అనుసరించి శైవులు 275 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వీటిని ‘పాడల్ పెట్ర స్థలం’ (పాటలలో పేర్కొన్న స్థలాలు) అంటారు. వాటిలో తరువక్కరై ఆలయం ఒకటి!
ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఆలయాన్ని 9వ శతాబ్దంలో ఆదిత్యుడనే చోళరాజు నిర్మించనట్లు తెలుస్తోంది. ఏడంతస్తుల రాజగోపురంతో విశాలమైన ఈ ఆలయంలో అడుగడుగునా ఏదో ఒక ప్రత్యేకత కనిపిస్తూనే ఉంటుంది. ఇక్కడి స్వామివారి లింగం అరుదైన త్రిమూర్తుల రూపంలో ఉంటుంది. తూర్పువైపున ఉన్న ముఖాన్ని తత్పురుష లింగం అనీ, ఉత్తరం వైపుగా ఉన్న లింగాన్ని వామదేవ లింగమనీ, దక్షిణం వైపుగా చూసే ముఖాన్ని అఘోర లింగమనీ పేర్కొంటారు.
ఈ ఆలయంలోని చంద్రమౌళీశ్వరుని దర్శించుకోవడమే ఓ అద్భుతమైతే... ఆలయంలో విష్ణుమూర్తి, కాళికా అమ్మవార్లకు కూడా ఉపాలయాలు ఉండటం మరో విశేషం. ఒకప్పుడు వక్రాసురుడనే రాక్షసుడు ముల్లోకాలనూ పీడించసాగాడట. ఆయన శివభక్తుడు కావడంతో, తన చేతులతో అతనిని వధించలేననీ... వెళ్లి విష్ణుమూర్తినే అర్థించమని పరమేశ్వరుడు చెప్పాడట. అంతట విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఆ వక్రాసురుని వధించాడు. అందుకే ఇక్కడి ఆలయంలోని విష్ణుమూర్తి విగ్రహం ‘ప్రయోగ చక్ర’ అనే భంగిమలో కనిపిస్తుంది. అంటే సుదర్శన చక్రాన్ని సంధిస్తున్న భంగిమలో విష్ణుభగవానుడు ఉంటాడన్నమాట!
విష్ణుమూర్తి వక్రాసురుని వధించే సమయంలో ఆ రాక్షసుని నెత్తురు నేల మీద పడినప్పుడల్లా... ప్రతి రక్తపు బొట్టు నుంచీ వేలమంది రాక్షసులు పుట్టుకురాసాగారట. దాంతో వక్రాసురుని రక్తం నేల మీద పడకుండా తన నాలికతోనే దాన్ని ఒడిసిపట్టేందుకు కాళికా అమ్మవారు అక్కడకు చేరుకున్నారు. అంతేకాదు! వక్రాసురుని చెల్లలైన దున్ముఖి అనే రాక్షసిని కూడా వధించారు. దాంతో ఇక్కడి కాళికా అమ్మవారికి ‘వక్రకాళి’ అన్న పేరు స్థిరపడింది. ఈ వక్రకాళి అమ్మవారి ఉగ్ర తత్వాన్ని శాంతింపచేసేందుకు ఆదిశంకరులు అమ్మవారి కాలికింది శ్రీచక్రాన్ని ప్రతిష్టించారని చెబుతారు.
అటు శివుడు, ఇటు విష్ణుమూర్తి.... వారికి తోడుగా కాళికా అమ్మవారు. ఇంతమంది కొలువైన ఆలయం కనుకనే ఈ చంద్రమౌళీశ్వర ఆలయాన్ని దర్శించేందుకు భక్తులు ఉబలాటపడుతూ ఉంటారు. ముఖ్యంగా శివరాత్రి, విజయదశమి, కార్తీక పౌర్ణమి, చైత్ర పౌర్ణమి వంటి సందర్భాలలో అయితే వేలమంది భక్తులతో ఈ చిన్న గ్రామం కిటికిటలాడిపోతుంటుంది. ఇక ప్రత్యేకంగా ఇక్కడి వక్రకాళి అమ్మవారిని దర్శించేందుకు వచ్చే భక్తులకూ కొదవ ఉండదు. శని వక్రదశలో ఉన్నప్పుడు ఈ అమ్మవారిని కనుక కొలిస్తే ఉపశమనం లభిస్తుందని చెబుతారు. అంతేకాదు! ఈ అమ్మవారి ఆశీస్సులు కనుక ఉంటే ఎంతటి శత్రువునైనా జయించవచ్చని, ఎలాంటి ఆపదనైనా దాటవచ్చని తమిళనాట నమ్మకం. అందుకనే రాజకీయ నాయకులు ఇక్కడికి తరచూ వస్తుంటారు. అన్నాడీఎంకే మీద పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్న దినకరన్ కూడా ఈమధ్యనే ఈ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాంతో మరోసారి ఈ ఆలయం వార్తల్లోకి ఎక్కింది.
- నిర్జర.