అథర్వవేద వికాసం

 

 

చతుర్వేదాలలో చివరి వేదం ‘అథర్వవేదం’. చివరివేదం కదాని.. ఈ వేదాన్ని చిన్నచూపు చూడరాదు. నిత్య, నైమిత్తిక కర్మలలో ఈ వేదానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇహానికే కాదు.,పరానికి కూడా ప్రాధాన్యత యిచ్చే వేదం ఈ ‘అథర్వవేదం’. యఙ్ఞ,యాగాది క్రతువులలో, ఇది బ్రహ్మగారి వేదం. ఈ వేదాన్ని ‘అథర్వాంగిరసులు’ దర్శించిన కారణంగా..దీనికి ‘అథర్వాంగిరసం’ అని మరో పేరు కూడా ఉంది. యఙ్ఞ నిర్వహణానికి బ్రహ్మ, అథ్వర్యుడు, హోత, ఉద్గాత అని నలుగురు ఋత్వక్కులు కావాలి. వీరిలో బ్రహ్మ స్థానాన్ని స్వీకరించే ఋత్విక్కుకు ‘అథర్వవేదం’తో పాటు మిగిలిన మూడు వేదాలు తప్పకుండా తెలిసి ఉండాలి. హోతగా వ్యవహరించేవాడు ఋగ్వేదం అధ్యయనం  చేసి ఉండాలి. అధ్వర్యుడు యజుర్వేదంలో నిపుణుడై ఉండాలి. ఉద్గాత సామవేదంలో నిష్ణాతుడై ఉండాలి. హోత, అధ్వర్యుడు, ఉద్గత...యఙ్ఞ ప్రక్రియలో తెలియక చేసిన పొరపాట్లను, ఎక్కడికక్కడ ‘బ్రహ్మ’ స్థానాన్ని అలంకరించిన ఋత్విక్కు పరిహరిస్తూ.. యఙ్ఞానికి అంతరాయం రాకుండా కాపాడతాడు. ఈ వేదానికి అంతటి ప్రాముఖ్యత ఉంది.

ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆధిదైవిక విషయాలను ఈ అథర్వవేదం వివరిస్తుంది. ఈ వేదంలో..శారీరక చికిత్సకు సంబంధించిన సూక్తాలు 144 ఉన్నాయి. ఈ సూక్తాలలో మానవ శరీరానికి సంబంధించిన ప్రతి అవయవం యొక్క స్వరూపాన్ని పేరుపేరునా వర్ణించడం జరిగింది. రాజ్యానికి, రాజధర్మానికి సంబంధించిన అనేక విషయాలు 244 సూక్తాలలో చర్చించబడ్డాయి. అనేక విషయాలతో కూడివున్న సమాజ స్వరూపాన్ని 75 సూక్తలలో వివరించడం జరిగింది. యఙ్ఞ, యాగాదులను గురించి ఎన్నో విశేషాలు ఈ వేదంలో చెప్పబడ్డాయి. ఈ వేదాన్ని ఆశ్రయించే..బృహస్పతి ‘అర్థశాస్త్రం’, చాణక్యుని ‘అర్థశాస్త్రం’, శుక్రాచార్యుని ‘శుక్రనీతి’ అనే గ్రంథాలు వెలువడ్డాయి. అథర్వవేదానికి సంబంధించిన శాఖల గురించి చాలా అభిప్రాయ భేదాలున్నాయి. పతంజలి, తన మహాభాష్యంలో ఈ వేదానికి.. పైప్పలాద, స్తౌద, మౌద, శౌనకీయ, జాబల, జలద, బ్రహ్మవద, దేవదశ, చారణావైద్యులనే పేర్లతో తొమ్మిది శాఖలు ఉన్నట్టు పేర్కొన్నాడు. పంచరాత్రంలో సుప్రసిద్ధమైన ‘అహిర్బుధ్న్య సంహిత’లో ఐదు శాఖలు ఉన్నట్లు చెప్పబడింది. అయితే...మనకు పైప్పలాద, శౌనక శాఖలు మాత్రమే లభ్యమౌతున్నాయి.

ఈ ‘అథర్వవేదం’ ....‘యేత్రిషప్తాః పరియన్తి’ అనే వాచస్పతి దేవతాకమైన మంత్రంతో ప్రారంభమై..‘పనాయ్యం తదస్వినా కృతం’ అనే అశ్వినీ దేవతాక మంత్రంతో పూర్తవుతుంది. ఈ వేదంలో..ఆయుష్షును, తేజస్సును, కీర్తిని పెంచే మంత్రాలు, వ్యవసాయ, వాణిజ్యాల అభివృద్ధికి తోడ్పడే మంత్రాలు, జీవాత్మ, పరమాత్మ తత్త్వాలను..పంచభూతాల స్వరూపాలనూ బోధించే మంత్రాలు, సర్వపాపాలను తొలగించే మంత్రాలు, అంత్యసంస్కారంలో ఉపయోగించే మంత్రాలు తుఫానులు, అతివృష్టులు నివారించేవి,వర్షాన్ని కురిపించేవి,శత్రునాశనకరమైనవి.. ఇలా అనేక మంత్రాలు ఉన్నాయి. అంతేకాదు...జ్వర, అతిసార, అతిమూత్ర, వాత, పిత్త, శ్లేష్మ, విషజ్వర, జలోదర, గండమాల, క్షయ, బొల్లి, కుష్ఠు, మొదలైన వ్యాధుల నివారణకు మందులు, సర్ప, వృశ్చిక విషహరణానికి, సంతానోత్పత్తికి, సుఖప్రసవానికి, శిరస్సు, కన్ను, ముక్కు, చెవి, కంఠాలకు వచ్చే రోగాలకు....ఇలా అనేక అనారోగ్యాలకు మందులు, ఔషధాలు విడివిడిగా చెప్పబడ్డాయి. ఇలా ఈ అథర్వవేదం, మానవ జీవన భౌతికప్రయోజనాలకు ఉపయోగపడడమేకాక, బ్రహ్మసాక్షాత్కారాన్ని గురించి వివరిస్తుంది. అందుకే ఈ వేదాన్ని ‘బ్రహ్మవేదం’ అని కూడా వ్యవహరిస్తారు. కనుక...మానవుని ఆనందమయ జీవనవేదానికి... ఈ అథర్వవేదం ‘బ్రహ్మస్ధానమని’ నిర్ద్వందంగా చెప్పవచ్చు.

- యం.వి.యస్.సుబ్రహ్మణ్యం


More Purana Patralu - Mythological Stories