అరుణి మహర్షి

 

 

భారతీయ చింతనకు ఒక రూపునిచ్చిన తత్వవేత్తలలో ప్రముఖుడు ఆరుణి మహర్షి. వేదాంతాలకు చిహ్నాలు అనదగిన మన ఉపనిషత్తులలో ఈ అరుణి మహర్షి ప్రస్తావన ప్రముఖంగా కనిపిస్తుంది. బృహదారణ్యక, ఛాందోగ్య ఉపనిషత్తులలో అరుణి బోధలు ప్రముఖంగా కనిపిస్తాయి. అంతేకాదు. భారతీయ చింతనకు సంబంధించి ముఖ్యంగా పేర్కొనే ‘తత్వమసి’ (అది నువ్వే) అనే వాక్యం అరుణి మహర్షి చెప్పినదే!

 

ఉద్దాలక అరుణి

అరుణి మహర్షికి ఉద్దాలకుడు అన్న పేరు కూడా ఉంది. ఈ పేరు వెనుక ఒక ఆసక్తికరమైన కథనమూ ఉంది. అరుణి తన చిన్నతనంలో దౌమ్యుడు అనే రుషి వద్ద విద్యను అభ్యసిస్తూ ఉండేవాడు. ఆ దౌమ్యుడు ఒకనాడు ఏదో పని మీద వెళ్తూ ఆశ్రమానికి చెందిన పొలాలను జాగ్రత్తగా గమనించుకోమని ఆరుణికి చెప్పి బయల్దేరాడు. దౌమ్యుడు అలా వెళ్లాడో లేదో, ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకుని వచ్చాయి. చూస్తూచూస్తుండగానే వర్షం చినుకులుగా మొదలై ఉధృతంగా కురవసాగింది.

 

 

దౌమ్యుని పంటపొలాలకు అనుకుని ఉన్న నీటి ప్రవాహానికి గండి పడనే పడింది. నీరు నిదానంగా పొలాలలోకి చేరసాగింది. ఆ పరిస్థితిని చూసిన ఆరుణికి ఏం చేయాలో పాలుపోలేదు. గండికి ఎంతగా మట్టి కప్పినా అది నిలవడం లేదు. ఇక ఎలాగైనా గురువుగారి పొలాలను, ఆయన మాటను కాపాడాలనే తపనతో... తానే ప్రవాహానికి అడ్డుగా పడుకొన్నాడు అరుణి. ఆ రోజు చీకటిపడే సమయానికి ఆశ్రమానికి చేరుకున్న గురువుగారికి అరుణి కనిపించలేదు. వెంటనే తన విద్యార్థులు కొందరిని వెంటబెట్టుకుని అడవిలోకి బయల్దేరారు గురువుగారు. అక్కడ తన పొలాలను చేరుకున్న దౌమ్యునికి, అంత వర్షంలో కూడా అవి నిండిపోకుండా ఉండటం చూసి ఆశ్చర్యం వేసింది. కారణం ఏమై ఉంటుందా అని నలుదిక్కులా పరిశీలిస్తున్న ఆయనకు సన్నగా ఒక మూలుగు వినిపించసాగింది. ఆ శబ్దం దిశగా చూస్తే ఏముంది! నీటి ప్రవాహానికి అడ్డుగా పడుకుని ఉన్న అరుణి కనిపించాడు.

 

అరుణి చేసిన త్యాగానికి దౌమ్యుని నోట మాట రాలేదు. నీటి ప్రవాహాన్ని నియంత్రించినవాడు కాబట్టి, అరుణి ఇకమీదట ఉద్దాలకుడు అన్న పేరుతో పిలువబడతాడని ఆయన ఆశీర్వదించారు. అంతేకాదు! నీటి మీద చూపించిన సాధికారతే జ్ఞానం మీద కూడా చూపగలడని వరాన్ని అందించారు.

 

 

వరం నిజమైంది

అరుణి పట్టుదలకు మెచ్చి గురువుగారిచ్చిన మాట వృధా పోలేదు. తన స్వదేశమైన పాంచాలరాజ్యంలోనే కాకుండా మాద్ర, తక్షశిల వంటి రాజ్యాలన్నీ తిరుగుతూ... అక్కడ పేరుమోసిన గురువులందరి వద్దా విద్యను అభ్యసించారు అరుణి. అంతమాత్రాన తను విన్న విషయాలన్నింటినీ ఆయన గుడ్డిగా నమ్మేయలేదు. గురువుల దగ్గర్నుంచీ పొందిన జ్ఞానాన్ని తన విచక్షనతో పోల్చి చూసుకున్నారు. తనకు సత్యమని తోచినదాన్ని మనకు ఉపనిషత్తుల రూపంలో అందించారు. ముఖ్యంగా ఛాందోగ్య ఉపనిషత్తులో తన కుమారుడైన శ్వేతకేతుతో, అరుణి జరిపే సంభాషణ ఒక వేదాంత పాఠంలా తోస్తుంది.

 

అరుణి తన కుమారుడైన శ్వేతకేతుకి 12 సంవత్సరాల వయసు రాగానే, గురుకులంలో విద్య నేర్చుకుని రమ్మని పంపిస్తాడు. శ్వేతకేతు అలా మరో 12 సంవత్సరాల పాటు వేదవిద్యనంతా నేర్చుకుని, ఇంటికి తిరిగివస్తాడు. ఇంటికి తిరిగివచ్చిన శ్వేతకేతు హావభావాలను పరిశీలించిన అరుణికి, అతనిలో జ్ఞానంకంటే గర్వమే ఎక్కువగా గోచరిస్తుంది. విద్య వల్ల తన కొడుకులో ఆత్మజ్ఞానం కలుగకపోగా, అహంకారం ఏర్పడిందని అర్థమవుతుంది.

 

ఒక రోజు తన కుమారుడిని పిలిచి ‘నాయనా! నువ్వు గురుకులంలో ఏం విద్యను నేర్చుకున్నావు?’ అని అడుగుతాడు అరుణి. దానికి శ్వేతకేతు పొగరుగా ‘నేర్చుకోవలసినందంతా నేర్చేసుకున్నాను!’ అని బదులిస్తాడు. ‘అయితే నీ గురువుగారు నీకు శబ్దానికీ, ఆలోచనకు, జ్ఞానానికీ అతీతమైన విద్యను అందించారా?’ అని అడుగుతాడు. ఆ ప్రశ్నకు శ్వేతకేతు వద్ద బదులులేకపోతుంది. అప్పుడు ఆరుణి తన కుమారుడికి చేసి ఆత్మబోధ శ్వేతకేతుకి నిజమైన జ్ఞానం అంటే తనని తాను తెలుసుకోవడం అన్న సత్యాన్ని స్ఫురింపచేస్తుంది.

 

- నిర్జర.


More Purana Patralu - Mythological Stories