అహల్యను మోహించిన ఇంద్రుడు

Indra loves Ahalya


పౌరాణిక పాత్రల్లో అందచందాల ప్రసక్తి రాగానే రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమలు గుర్తొస్తారు. కానీ వాళ్ళు ఒకరకంగా ఇప్పటి క్లబ్బుల్లో కనిపించే డాన్సర్లతో సమానం. కనుక వాళ్ళ అందాన్ని ప్రశంసించలేం. ఇంకా అనేక కథల్లో సౌందర్యానికి ప్రతీకలు అనిపించే స్త్రీ పాత్రలు ఉన్నాయి. ఆ అందానికి మంచితనం కూడా తోడైతే మట్టి బొమ్మ ప్రాణం పోసుకున్నట్లు అపురూపంగా ఉంటుంది. అలాంటి అద్వితీయమైన పాత్ర అహల్య గురించి ఇప్పుడు చెప్పుకుందాం.

అహల్య అందాల రాశి, సుగుణాల పోగు. గౌతమ మహర్షికి సేవలు చేస్తూ, ఆశ్రమ విధులను సక్రమంగా నిర్వహించేందుకు చతుర్ముఖుడు ఏర్పాటు చేసిన వ్యక్తి అహల్య. అహల్యను మహర్షి ఆశ్రమంలో నియమించినప్పుడు ఎవరికీ ఏ ఉద్దేశమూ లేదు. కానీ, ఆమె ఎలాంటి ప్రతిఫలమూ ఆశించకుండా, నిస్వార్ధంగా, నిజాయితీగా సేవ చేయడంతో అహల్యే, గౌతమమునికి తగిన భార్య అనుకున్నాడు బ్రహ్మదేవుడు.

ఆవేళ గౌతమ మహర్షి ధ్యానం చేసుకుంటూ ఉండగా, బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, "గౌతమా! నేను నీకేన్నో పరీక్షలు పెట్టాను. అన్నిటిలో గెలిచావు. ప్రసవిస్తున్న గోవుకి ప్రదక్షిణ చేస్తూ నమస్కరిస్తే అది భూ ప్రదక్షిణతో సమానం. అనేక పుణ్యకార్యాలతో బాటు ఈ పని కూడా చేశావు. ఎంతో పుణ్యాన్ని దక్కించుకున్నావు. అందుగ్గానూ నీకు గొప్ప అనుకూలవతి అయిన అహల్యను భార్యగా ప్రసాదిస్తున్నాను. అహల్యను స్వీకరించి, ధన్యుడివి అవ్వు " అంటూ ఆశీర్వదించాడు. అంతేకాదు, స్వయంగా బ్రహ్మదేవుడే దగ్గరుండి, అహల్యా, గౌతముల వివాహం జరిపించాడు. వారిని వనదేవతలు దీవించాయి.

అహల్యా గౌతములకు శతానందుడు అనే కొడుకు పుట్టాడు. తర్వాత కొంతకాలానికి గౌతమ మహర్షి తపో దీక్ష పూనాడు. ఆ తపస్సు ఎంత తీక్షణంగా ఉందంటే, స్వర్గాన్ని కదిలించేలా ఉంది.

దేవేంద్రుడికి భయం కలిగింది. గౌతముని తపస్సు వల్ల తన పదవి పోతుందేమోనని భయపడ్డాడు. దేవతల సహాయం అడిగాడు. అందరూ సరేనన్నారు. దేవతలకు మేలు చేస్తున్న నెపంతో అహల్య దగ్గరికి మారువేషంతో వెళ్లేందుకు సిద్ధమయ్యాడు.

ఇంద్రుడు చెప్పడం అయితే, గౌతమ మహర్షి తపస్సును భగ్నం చేయడం అని చెప్పాడు కానీ, అతని అసలు ఉద్దేశం అహల్యను దక్కించుకోవడం. సరే, దేవేంద్రుడు కోడి రూపంలో గౌతముని ఆశ్రమం చేరాడు. ఇంకా తెల్లవారకముందే, ఆ కోడి కూసింది.

గౌతమముని ఉలిక్కిపడి లేచాడు. బ్రహ్మముహూర్తం అని భ్రమించి, సూర్యభగవానునికి అర్ఘ్యం ఇచ్చేందుకు లేచాడు. పవిత్ర జలం తెచ్చేందుకు నదికి బయల్దేరగా కారు చీకటిగా ఉంది. ఎక్కడా వెల్తురు జాడే లేదు.

కోడి కూసినప్పటికీ ఇంకా తెల్లవారలేదని అర్ధం చేసుకున్నాడు గౌతముడు. నాలుగడుగులు వేసినవాడే తిరిగి వెనక్కి వచ్చాడు. తీరా మహర్షి వచ్చేసరికి, దేవేంద్రుడు, తన రూపంలో అహల్య దగ్గర కనిపించాడు. "ఇంద్రుడు ఇంత నీచానికి ఒడికట్టాడా... తన వేషం వేసుకుని తన భార్యను లోబరచుకోదలచాడా? గౌతముడు కోపంతో దహించుకుపోయాడు. దాంతో దేవేంద్రుడు భయంతో, అవమానంతో కుంగిపోతూ అమరలోకానికి పరుగు తీశాడు. ఇంద్రుడికి శరీరం అంతా కళ్ళు ఉంటాయి. అందుకే ఎవరైనా తదేకంగా చూస్తుంటే (ఈ మనిషికి ఒళ్ళంతా కళ్ళే అంటారు. దీనికి అసలు అర్ధం తనది కానిదాన్ని ఆక్రమించుకోవాలనే దుర్బుద్ధి) అన్నమాట.

అహల్య తప్పు ఏమీ లేకున్నా, ఇంద్రుడి పక్కన కనిపించడంతో గౌతమమునికి ఆగ్రహం ఆగలేదు. క్షణికావేశంలో ఆమెను కూడా నిందించాడు. "నువ్వు రాయిగా మారిపో" అంటూ శపించాడు. కానీ, వెంటనే దివ్యదృష్టితో అసలేం జరిగిందో చూసి పశ్చాత్తాప్పడ్డాడు. రాముడి పాదం తాకినప్పుడు "రాతివి, నాతివి (రాయి స్త్రీగా మారడం) అవుతావు" అని శాపవిమోచనం ప్రసాదించాడు.

అహల్య ఎంతో సాత్వికులు. ఇంద్రుడు తన భర్త రూపంలో వచ్చి సల్లాపాలు ఆడినప్పుడు, భర్తే అనుకుని మురిసిపోయింది తప్ప, ఆమెకు పర పురుష వ్యామోహం అనేది కలలో కూడా లేదు. భర్త తొందరపాటుతో శాపం పెట్టినా కోపగించుకోలేదు. ఆ క్షణంలో ఎవరైనా అలాగే ప్రతిస్పందిస్తారు అని సరిపెట్టుకుంది. అలా శాపగ్రస్తురాలై, శ్రీరాముని రాక కోసం ఎదురుచూస్తూ కాలం గడిపింది. చివరికి రాముని పాదాలతో పునీతమై "రాతిని నాటిగా మార్చావు రామా" అంటూ రాముడి కాళ్ళకు నమస్కరించింది అహల్య.

అదీ అహల్య కథ. అందానికి మంచి మనసు తోడైతే అది అహల్య.

 

Ahalya and Goutama maharshi, devendra's infatuation, Ahalya and srirama, Beautiful and Virtue Personified Ahalya, devendra and goutama maharshi, story of Ahalya, story of goutama, Indra's infatuation on Ahalya


More Purana Patralu - Mythological Stories