యుగాది ఉగాది
ప్రతి ఏడాదీ మనం తెలుగు సంవత్సరానికి మొదటి రోజుగా చేసుకునే పండగ ఉగాది అసలు ఎప్పుడు మొదలయిందో తెలుసా? సృష్టి ఆరంభంలో! బ్రహ్మదేవుడు తన సృష్టి మొదలు పెట్టిన రోజు ఇది అంటారు!! సృష్టికర్త బ్రహ్మ దేవుడు తన సృష్టి ప్రారంభించిన రోజునే యుగానికి మొదలు .. యుగాది. అదే తర్వాత ఉగాది అయింది. సరే అప్పుడెప్పుడో కొత్తగా యుగం ప్రారంభమయింది. అలాగే ప్రతి ఏడూ ఉగాదినాడు కొత్త సంవత్సరం ప్రారంభం అవుతోంది. జీవిత గమనంలో ఎన్నో సంతోషాలు, దుఃఖాలు అనుభవించాలి. మన పెద్దవాళ్ళు సామాన్యలు కారండీ. ఎంతో దూరదృష్టికలవారు. మనకుండే దూరదృష్టి కాదులెండి. వారు తమ గురించేకాక భావి తరాల గురించి కూడా ఆలోచించేవాళ్ళు. అందుకే సంవత్సరం ప్రారంభం ఉత్సాహంతో చేసుకోవాలని, కొత్త ఆశలతో ప్రగతికి పునాదులు వేసుకోవాలని అనేక మార్గాలు తెలిపారు. వాటిని ఆచరించని బడుధ్ధాయిల కోసం దేవుడు, సంప్రదాయం, ఆచారం వగైరా పెట్టారు.
అలా వచ్చిందే ఆ రోజు నూతన వస్త్రాలు ధరించి సంతోషంగా గడిపితే సంవత్సరం అంతా సంతోషంగా గడుపుతారని అనటం. పెద్దవాళ్ళు ఇలా చెప్పటంతో చిన్నప్పుడు ఆ రోజంతా దేనికీ పేచీ పెట్టకుండా, దేనికీ ఏడవకుండా వుండేవాళ్ళం. దేనికన్నా ఏడ్చినా ఇంట్లో వాళ్ళెవరో అనేవాళ్ళు ఉగాదినాడు ఏడుస్తున్నావు, సంవత్సరమంతా ఏడుస్తూనే వుంటావు అని.. అంతే .. ఏడుపు బంద్. ఎంత మధురమైన, అమాయకమైన రోజులో అవి. ఇలాంటి అమాయకమైన మాటలు చిన్నవారి జీవితాలని ఎంత ప్రభావితం చేస్తాయో చూడండి.
చిన్నతనంలోనే ఒక రోజు ఏడిస్తే సంవత్సరమంతా ఏడవాల్సివస్తుందని జాగ్రత్తగా వున్నవాళ్ళం, పెద్దయ్యి, తెలివితేటలు పెరిగాక మన జీవితాలని చక్క దిద్దుకోవటానికి ప్రయత్నించవద్దూ.
జీవితమంటే సుఖ దుఃఖాల సమ్మేళనమేనని తెలియజేయటానికి కొత్త సంవత్సరం ప్రారంభం రోజున షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని సేవించమన్నారు. ఈ పచ్చడి కొత్త బెల్లం, కొత్త చింతపండు, మామిడి కాయ, ఉప్పు, కారం, వేప పువ్వు వీటన్నింటినీ కలిపి చేస్తారు.
ఉగాదినాడు తెల్లవారుఝామునే లేచి అభ్యంగన స్నానం చేసి, ఇల్లు వాకిలి శుభ్రపరచుకుని దైవారాధన చేసి ఉగాది పచ్చడి నైవేద్యం పెట్టి ఆ పచ్చడిని పరగడుపునే తినాలి అంటారు. యుగాదికి గుర్తుగా జరుపుకునే ఈ ఉగాది రోజున చేసే పచ్చడిలో కొత్తదనాన్ని సూచిస్తూ కొత్త బెల్లం, కొత్త చింతపండు, అప్పుడే పూస్తున్న వేప పువ్వు, కొత్తగా కాస్తున్న మామిడికాయ, ఉప్పు కూడా కొత్తదే వెయ్యాలంటారు. అన్నీ కొత్తవి, కొత్తవి అని ఏ షాపుల వెంట తిరగాలని మనకున్న సమయంలో మనకి దొరికిన వాటితో కానిచ్చేస్తున్నామనుకోండి మనం.
కాలంలో వుండే విభిన్నతల సమన్వయం, షడ్రుతువుల సౌందర్యం, షడ్రుచుల ప్రసాదంగా కాల భగవంతునికి సమర్పించి ఆయన ఆశీర్వాదాన్ని కోరటం మన పూర్వీకులు ఏర్పరచిన సంప్రదాయం.
ఉగాదినాడు పంచాంగ శ్రవణం చెయ్యాలంటారు. కాలాన్ని దైవశక్తిగా ఉపాసించడం మన సంప్రదాయం. కాలం అనుకూలించాలని అనుకోనివారు వుండరు. కాలం అనుకూలించటానికి అందులో అంతర్లీనమైన దైవ శక్తిని అనుసంధానించుకోవాలి. అందుకే ఈ ప్రయత్నం. ప్రతి సంవత్సరం కాలపురుషుని సంవత్సరావతారాన్ని స్మరించుకుంటాం. సంవత్సరానికి మొదటి రోజు తిధి, వార, నక్షత్ర దేవతల్ని సంవత్సరంలో సంభవించే ప్రధాన ఖగోళ పరిణామాలనీ తెలుసుకుంటాము. తిధి, నక్షత్ర, వార మొదలైనవన్ని దేవతా స్వరూపాలుగా భావించి ప్రతి రోజూ సంకల్పంలో వాటిని చెప్పుకోవటం కాలదేవతా శక్తిని ఆరాధించటం. అందుకే శుచి అయిన పరిసరాల్లో, నిర్మలమైన మనసుతో సర్వేజనా సుఖినోభవంతు అంటూ అందరి క్షేమం కోరుతూ చేసే భగవదారాధన తప్పకుండా సత్ఫలితాన్నిస్తుంది.
ఈ ఉగాదినాడే వసంత నవరాత్రులు ప్రారంభం. ఈ రోజుతో మొదలైన నవరాత్రులు శ్రీ రామ కళ్యాణంతో ముగుస్తాయి. శ్రీరాముడు, రామాయణం హిందువులకు ప్రాణ తుల్యం. శ్రీరాముడు ధర్మాన్ని పాటించి ఒక మనిషి ఎలా జీవించాలో తెలియజేశాడు. ఆయన సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు అవతారం. సంవత్సరం మొదటి రోజు ఆయన పూజతో ప్రారంభం అవటం కూడా విశేషమే కదా.
ఇన్ని విశేషాలున్న మన పండగ ఈ ఉగాది అందరికీ శుభాలనివ్వాలని కోరుకుందాము.
ఉగాది పచ్చడి సేవిస్తూ ఈ శ్లోకాన్ని పఠించండి....
శతాయు వజ్రదేహాయ సర్వసంపత్ కరాయచ
సర్వారిష్ట వినాశాయ నింబకం దళబక్షణం
.. పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)