రావణుడికి ఆయన తాత ఇచ్చిన సలహా?
రాముడి శిరస్సు, కోదండం చూసి సీతమ్మ ఏడుస్తుంటే రావణుడు చిరునవ్వులు చిందిస్తున్నాడు.
అప్పుడు సీతమ్మ రావణుడిని చూసి "ఇప్పటికైనా నా శిరస్సుని రాముడి శిరస్సుతోటి, నా కాయాన్ని రాముడి కాయంతోటి కలిపి అంచేష్ఠి సంస్కారం పూర్తిచెయ్యి. ఈ ఒక్క కోరిక తీర్చు" అని అడిగింది
రావణాసుడు సీతతో ఏదో చెప్పబోతున్నప్పుడు సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఒక భటుడు వచ్చి "మహారాజా! మీకోసం ప్రహస్తుడు ఎంతో ఆదుర్తాతో ఎదురుచూస్తున్నాడు. మీరు వెంటనే సభకి రావలసింది" అన్నాడు.
వెంటనే రావణుడు అక్కడినుండి వెళ్ళిపోయాడు, రావణుడు వెళ్ళగానే ఆ శిరస్సు, ధనుర్బాణములు అదృశ్యమయ్యాయి. ఏడుస్తున్న సీతమ్మ దగ్గరికి విభీషణుడి భార్య అయిన సరమ వచ్చింది.
"నాపేరు సరమ, నేను రావణుడి తమ్ముడు విభీషణుడి భార్యను. నువ్వు శోకించకమ్మా, నాకు అపారమైన శక్తి ఉంది. నేను ఆకాశంలో నిలబడినప్పుడు ఎవ్వరికీ కనపడను. నెక్ ఇప్పుడు ఒక సంతోషకరమైన విషయం చెబుతాను విను. నేను రాముడిని చూశాను, ఆయన గుండ్రమైన బాహువులతో ఆ వానర సైన్యాన్ని కాపాడుతూ ఆవలి ఒడ్డున ఉన్నాడు. రావణుడు నీతో ఆదమరచి నిద్రపోతున్న రాముడి తల నరికేశారు అని చెప్పాడు కానీ అంత అప్రమత్తంగా రాముడు నిద్రపోతాడా?, రాక్షసులు రాముడిని సంహరించగలరా? ఇంద్రుడు దేవతలని రక్షిస్తున్నట్టు, రాముడు వానరములని రక్షిస్తుంటాడు. నువ్వు అది ఆలోచించవా?
నేను ఇప్పుడే చూసి వచ్చాను ఇది విద్యుజిహ్వుడి మాయ. అందుకనే రావణుడు వెళ్ళగానే ఇక్కడున్న శిరస్సు అంతర్ధానమయ్యిపోయింది. రావణుడి మాయలు నమ్మకు, ఉపశాంతిని పొందు" అని చెప్పింది.
అదంతా విన్న సీతమ్మ "నువ్వు చెప్పింది నిజమైతే రావణుడు ఇప్పుడు ఏమి చేస్తున్నాడో చూసి, నాకు చెప్పు" అని సరమతో చెప్పింది.
అప్పుడు సరమ రావణుడి అంతఃపురానికి వెళ్ళి, కొంతసేపటికి తిరిగొచ్చి "ఇప్పుడే నేను విని వచ్చాను. రావణుడి తల్లి కైకసి, ఒక వృద్ధుడైన మంత్రి రావణుడికి నచ్చచెప్పారు. ఏది ఏమైనా సీతని విడిచిపెట్టడం జరగదు" అని రావణుడు అన్నాడు. రాముడితో యుద్ధం చేయడానికి కారణం చెప్పకుండా సైన్యాన్ని పిలవమన్నాడు. రాక్షసుల కోలాహలం గట్టిగా వినపడుతోంది. మేరు పర్వత శిఖరాల చుట్టూ తన గుర్రముల మీద ఎక్కి తిరిగే సూర్యనారాయణమూర్తిని ఉపాసన చెయ్యి, నీకు సమస్త శుభములు కలుగుతాయి' అని చెప్పింది సరమ.
సరమ మాటలకి సీతమ్మ మనసుకు నచ్చజెప్పుకుని ఏడవడం ఆపింది.
ఈలోగా మాల్యవంతుడు (రావణుడికి తాత వరస) రావణుడి దగ్గరికి వచ్చి "సృష్టిలో ధర్మం ఎప్పుడూ కూడా దేవతల వైపు ఉంటుంది, అధర్మం అసురుల వైపు ఉంటుంది. అధర్మపక్షం ధర్మపక్షం చేత ఓడింపబడుతుంది. నువ్వు సీతమ్మని అపహరించి తెచ్చినప్పటినుండి దుర్నిమిత్తములు కనపడుతున్నాయి, అందుకని మనం ఓడిపోక తప్పదు. నువ్వు సీతమ్మని తెచ్చినప్పటినుండి, తెల్లటి రెక్కలు ఉండి ఎర్రటి పాదాలతో ఉండే పావురాలు అరుస్తూ గోల చేస్తున్నాయి, ఇంట్లో పెంచుకునే చిలకలు, గోరింకలు మంచి మాటలు చెప్పడం మానేసి వీచి కూచి మాటలు చెబుతున్నాయి, ఎక్కడినుంచో క్రూరమైన పక్షులు వచ్చి వీటితో యుద్ధం చేస్తున్నాయి, ఏ ఇంటిముందు చూసినా నల్లనివాడు, బోడిగుండువాడు, ఎర్రటి వస్త్రములు కట్టుకున్నవాడు ఉదయము సాయంకాలము ఇళ్ళల్లోకి తొంగిచూస్తున్నట్టు కనపడుతోంది. వచ్చినవాడు సామాన్యుడు కాదు, శ్రీ మహావిష్ణువు వచ్చాడు, సీతమ్మని రాముడికి అప్పగించి సంధి చేసుకుని బతికిపో, నా మాట విని యుద్ధం చెయ్యకు" అన్నాడు.
◆నిశ్శబ్ద.