కొప్పులింగేశ్వరస్వామి - పలివెల
గోదావరి మండలమునందలి శివక్షేత్రాలలో అతి ప్రాచీనమైన శివక్షత్రం ఈ ‘కొప్పు లింగేశ్వర స్వామి’ఆలయం ఒకటి. సాధారణంగా శివలింగం ఎలా ఉంటుందో అందరకూ తెలిసిన విషయమే. కానీ.. ఈ శివలింగానికి స్త్రీకి ఉన్నట్టుగా పైన కొప్పు ఉంటుంది. అదే ఈ శివలింగం ప్రత్యేకత.
రాజమండ్రికి దగ్గరగానున్న కొత్తపేటకు మూడు కిలోమీటర్ల దూరంలోనున్న ‘పలివెల’ గ్రామంలో.. ‘కౌశికి’ నదీతీరాన ఈ ‘కొప్పులింగేశ్వరస్వామి’వారి ఆలయం ఉంది. ఈ ఆలయంలోని స్వామి పేరు నిజానికి ‘అగస్తేశ్వరుడు’. ఈ శివలిగాన్ని అగస్త్యమహర్షి ప్రతిష్ఠించారు. అయితే..‘కొప్పులింగేశ్వరుడు’ అనే పేరు ఎందుకు వచ్చింది? దానికి ఓ కథ ఉంది. ఆ కథ ఏమిటంటే....
ఈ ‘అగస్తేశ్వరస్వామి’కి నిత్యసేవలు చేసేందుకు ఓ అర్చకుడుండేవాడు. ఆ అర్చకుడు గొప్ప శివభక్తుడు. ఎంత భక్తుడైనా బలహీనతలు ఉండడం సహజం. ఎంతైనా మనిషి కదా.. విషయవాంఛల వలయంనుంచి తప్పించుకోలేక.., వేశ్యాలోలుడయ్యాడు ఆ అర్చకుడు. తన ప్రియురాలి ముచ్చట తీర్చడం కోసం స్వామివారికి అలంకరించాల్సిన పూలమాలలు., ముందుగా తన ప్రియురాలికి అలంకరించి..ఆ తర్వాత శివలింగానికి అలంకరించేవాడు. ప్రతి నిత్యం ఇదే తంతు. ఎంత వేశ్యాలోలుడైనా., శివార్చన చేసే విషయంలో భక్తిలోపం రానిచ్చేవాడు కాదు.
ఒకరోజు మహారాజుగారు స్వామి దర్శనానికి వచ్చారు. అందరికీ ఇచ్చినట్టుగానే అలవాటు ప్రకారం వేశ్యకు అలంకరించిన తర్వాత శివలింగానికి పెట్టిన పూలమాలను శివప్రసాదంగా మహారాజుకు ఇచ్చాడు ఆ అర్చకుడు. మహారాజుకు ఆ పూలమాలలో ఓ పొడవైన కేశం (వెంట్రుక) కనిపించింది.అప్పటికే మహారాజుకు ఆ అర్చకుడు వేశ్యాలోలుడు అని తెలుసు. అందుకే ఆ అర్చకుని వంక కోపంగా చూస్తూ ‘ ఈ వెంట్రుక ఎవరిది. నిజం చెప్పు’ అని గద్దించాడు. ఆ వెంట్రుకను చూడగానే అర్చకునకు ముచ్చెమటలు పట్టాయి. అయినా ధైర్యం తెచ్చుకుని ‘మహారాజా..ఈ శివలింగానికి కొప్పు ఉంది. ఈ శిరోజం సాక్షాత్తు శ్రీ స్వామివారిదే’ అన్నాడు. ‘అయితే స్వామివారి కొప్పు చూపించు’ అని అడిగాడు మహారాజు. ‘మన్నించండి మహారాజా.. నేడు అలంకరణ పూర్తి అయింది. రేపు ఉదయం స్వామి దర్శనానికి వస్తే తప్నకుండా స్వామివారి కొప్పు చూపిస్తాను’అని అన్నాడు అర్చకుడు. సరేనని మహారాజు వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అర్చకుడు తనకొచ్చిన కష్టాన్ని స్వామివారికి చెప్పుకుని, కాపాడమని ప్రార్థించి, తిరిగి వేశ్య ఇంటికి వెళ్ళిపోయాడు.
తెల్లారింది. మహారాజు వచ్చాడు. అర్చకుడు శివునిమీద పూర్తి విశ్వాసంతో స్వామివారి అలంకరణ తీసాడు. మహారాజుకు నిజంగానే లింగంపైన కొప్పు కనబడింది. అయినా మమారాజుకు అనుమానం తీరక ఆ కొప్పు పట్టుకుని లాగాడు. లింగం పైనుంచి రక్తధారలు స్రవించాయి. అప్పుడు నమ్మాడు మహారాజు. తన తప్పిదాన్ని క్షమించమని అర్చకుని ప్రార్థించి..‘జుత్తుగపాడు’ అగ్రహారాన్ని ఆ అర్చకునకు మాన్యంగా సమర్పించాడు. నాటినుండి అగస్తేశ్వరుడు..‘కొప్పులింగేశ్వరుడు’గా మారిపోయాడు.
స్వామివారికి ఎడమప్రక్కనే పానుపట్టము మీదనే ఉమాదేవి అమ్మవారు ఉంటారు. మండపంలో పెద్ద నంది గంభీరంగా దర్శనమిస్తుంది. స్తంభమండపాలు..ఉయ్యాల మండపము.,ధ్వజద్వార మండపము అత్యద్భుతమైన శిల్పకళావైభవాలతో అలరారుతూ భక్తులను ఆకర్షిస్తూంటాయి. మహాశివరాత్రికి మహావైభవంగా రథోత్సవం జరుగుతుంది. ఈ ఆలయం 12 వ శతాబ్ది కాలంనాటిదని తెలియజెప్పే శాసనాలు ఈ ఆలయ స్తంభాలపై దర్శనమిస్తాయి. భక్తులు చూసి తరించవలసిన ఆలయం ఇది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
- యం.వి.యస్. సుబ్రహ్మణ్యం