• Prev
  • Next
  • ది డైరీ ఆఫ్ లేఖా గుమ్మడి - 7 The Diary of LEKHA GUMMADI - 7

    ది డైరీ ఆఫ్ లేఖా గుమ్మడి - 7

    The Diary of LEKHA GUMMADI

     

    నాకు మల్లెపూలంటే మహా ఇష్టం. నేను మాత్రమే ఏంటి.. అసలు మల్లెలు నచ్చనివాళ్ళు ఉంటారా? ఏమో ఉంటారేమో.. ఎందుకు ఉండకూడదు? నేను నాన్ వెజ్ తిననంటే ఆశ్చర్యపోయేవాళ్ళు లేరూ?! "ఒకసారి తినిచూస్తే వదలవు'' అంటూ ఆ వంటకాల్ని అమృతం కంటే గొప్పగా వర్ణించి చెప్పినవాళ్ళు, ఆ వంటలు తినకపోతే జీవితమే వేస్టు'' అని చప్పరించినవాళ్ళు ఉన్నారు. కావచ్చు, వాళ్లకి అందులో అంత అద్భుతమైన రుచి కనిపించిందేమో! నాకు మాత్రం వాటిని చూస్తేనే తగని వెగటు.

     

    ఒకసారి ఆఫీసులో ఈ ప్రస్తావనే వచ్చింది. ఆవేళ ఒక కొలీగ్ పెళ్ళి.. డిన్నర్ అరెంజ్ చేశారు. అక్కడ నాన్ వెజ్ తినాల్సిందే అన్నారొకరు. ''హూ.. నేనా... కోటి రూపాయలు ఇచ్చినా తినను'' అన్నాను యమా ధీమాగా. ''కోటి రూపాయలు ఎదురిచ్చి తినిపించాల్సిన అవసరం లేదులే.. కావాలంటే ఫ్రీగా మీ ప్లేటు కూడా నేనే తినిపెడతాను'' అన్నారు ఇంకొకరు.

     

    కొందరైతే, అసలు నాన్ వెజ్ కానిది గడ్డి - అని నిర్మొహమాటంగా చప్పరించి పారేస్తారు. కనుక ఇష్టాలు, అయిష్టాలు, ఆలోచనలు, అభిప్రాయాలను ఛస్తే జెన్రలైజ్ చేయలేం. అవి ఎప్పుడూ డిఫర్ అవుతూనే ఉంటాయి. ఎవరి టేస్టులు వాళ్లవి.

     

    సరే, నాకు మాత్రం మల్లెపూలంటే పిచ్చి ప్రేమ. ఈ విషయంలో నామీద నేనే - ''సామాన్యంగా ఎవరైనా చనిపోతే పూలదండ వేస్తారు కదా! అలా, నేను పోయాక ఒకవేళ మల్లెపూల దండ వేశారో, టక్కున లేచి కూర్చుంటాను'' అని జోక్ చేసుకుంటాను కూడా. ఈ ఊహని ఇమాజిన్ చేస్తే భలే ఫన్నీగా ఉంటుంది. ఏదో శవం కదాని దండ వేయబోతే, అప్పుడు నేను కాస్తా అమాంతం లేచి కూర్చుంటే అదిరి చావరూ, మరి?! కాస్త వీక్ హార్టయితే నిజంగానే ఆగిపోతుంది.

     

    ఒకసారి మెడికల్ కాలేజ్ లో అలాగే జరగలేదూ?! మెడికల్ కాలేజీల్లో ఓ గదిలో హ్యూమన్ బాడీ డిసెక్షన్ జరుపుతారుగా.. అలా జరిగేరోజు ఓ చెత్త స్టూడెంట్ ఓ శవం కింద పడుకున్నాడట. ఇంకో స్టూడెంట్ కూల్ గా వచ్చి, శవం ఉన్న టేబుల్ దగ్గర నిల్చున్నాడో లేదో.. పడుకున్న వ్యక్తి, శవంతో సహా అమాంతం లేచాడట. పాపం ఈ రెండో కుర్రాడు నాకుమల్లే పిరికివాడు కాబోలు గుండె ఆగి చనిపోయాడట. ఎంత దారుణం! ఇతన్ని సరదాగా భయపెట్టాలని అనుకున్నాడే తప్ప చనిపోతాడని మొదటివాడు ఊహించలేదు. కానీ, అంత మొరటు తమాషాలు ఎందుకు? హాస్యమంటే సున్నితంగా, సుతిమెత్తగా, మరువం పరిమళంలా ఉండాలి కానీ గొడ్డలితో అడవిని నరికినంత భయంకరంగా ఉంటే ఎలా? అప్పుడది వికటించి భీబత్స రసమే అవుతుంది.

     

    నాన్న నాకో మల్లెపూల తోట కొనిస్తాను అనేవారు. కానీ, మాట తప్పి ఆకాశంలోకి వెళ్ళిపోయారు. అయినా, తోట లేకపోవడమే మంచిది. మరీ మనకే తోట ఉంటే, మల్లెలు అతి మామూలైపోతాయేమో! ఒద్దొద్దు.. అవి ఎప్పటికీ అమూల్యంగా ఉండిపోవాలి. వాటిని ఎప్పుడు చూసినా సంతోషించాలి. ''వావ్'' అంటూ నా కళ్ళు ఆల్చిప్పలవ్వాలి. మనసు ''యాహూ'' అంటూ కేరింతలు కొట్టాలి.

  • Prev
  • Next