• Prev
  • Next
  • ది డైరీ ఆఫ్ లేఖా గుమ్మడి - 9 The Diary of LEKHA GUMMADI - 9

    ది డైరీ ఆఫ్ లేఖా గుమ్మడి - 9

    The Diary of LEKHA GUMMADI

     

    వినయ్ గారు ఏదయినా కాలమ్ రాయమని అడిగారు. టైం ఉండదని ఛస్తే చెప్పలేకపోయాను. ఆయనంటే నాకు అంత గౌరవం. ఎన్ని మంచి లక్షణాలు... ఎంత ఉన్నతమైన వ్యక్తి?! వెతికిచూసినా దర్జాలు, దర్పాలూ ఉండవు. పైగా మనల్ని గుర్తించి, గౌరవించేవాళ్ళకోసం కష్టమైన పని కూడా ఇష్టంగా చేయాలనిపిస్తుంది. ఎప్పటికీ కృతజ్ఞులుగా ఉండాలనిపిస్తుంది. అలాంటిది నా రాతలమీద నమ్మకంతో రాయమని అడిగితే ''అబ్బే, వీలవదండీ'' అని చెప్పడం వికారంగా ఉండదూ?!

     

    అసలు ప్రజాశక్తి పేరు చెప్తే చాలు సంతోషం పొంగుకొస్తుంది. అందులోకి వెళ్ళాలా వద్దా అని అప్పట్లో ఎవర్నీ అడిగిన గుర్తు లేదు. ఇంట్లో కూడా చేరుతున్నట్లు చెప్పానే గానీ సలహా అడగలేదు. ఒక పెద్ద ఆర్గనైజేషన్ లోంచి చిన్నదాంట్లోకి ఎవరైనా వెళ్తారా, ప్చ్.. brain లేదు అన్నట్టు నవ్విన వాళ్ళున్నారు. నేనేం పట్టించుకోలేదు.

     

    ఒకరకంగా నేను చాలా మొండిదాన్ని. చాలాసార్లు చాలా విషయాలు ఆలోచించకుండా తాపీగా ఉంటాను కానీ ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే మాత్రం ఎవర్నీ ఖాతరు చేయను. నాకు ఆ టైంలో అందులో చేరడం కరక్ట్ అనిపించింది. ఆ ఆలోచన అప్పుడే కాదు, ఇప్పటికీ గొప్పదే అని ఫీలవుతాను. ఎప్పుడో కెరీర్ మొదట్లోనే ఇందులో ఎందుకు చేరలేదా అని బాధేసేది. అసలక్కడ ఉద్యోగం చేసిన భావన ఎన్నడూ కలగలేదు. ఆడుతూపాడుతూ కథలు రాసుకున్నట్టుగా ఉండేది. work satisfaction అంటే అదేగా. ఎంత freedom ఇచ్చారో! దాన్ని నేనేం దుర్వినియోగం చేసుకోలేదు. రాసినవాటికి గుర్తింపు వచ్చేది. మాధవి సీరియల్ని ఎందరు మెచ్చుకున్నారో! ఆఖరికి ట్రెయినీ పిల్లలు కూడా వచ్చి భలే కితాబులిచ్చేవాళ్ళు. ఇల్లూ వాకిలీ సమకూర్చుకోవడం కోసం అక్కణ్ణించి మారక తప్పలేదు.

     

    ఇప్పుడనిపిస్తుంది... సొంతిల్లో అని చెత్త తపన కాకపోతే.. రేపు పోయేటప్పుడు ఆ ఇంటిని నెత్తిమీద పెట్టుకు తీసికెళ్తామా? ''తెలివి లేనివాళ్ళు ఇళ్ళు కడతారు.. తెలివైన వాళ్ళు అందులో నివాసం ఉంటారు'' అని ఎవరో మహానుభావుడు ఎప్పుడో సెలవిచ్చాడు కానీ, మన బుర్రకి అది ఎక్కిచావలేదు. ఆ ఇంటికోసం ఖర్చుపెట్టిన సొమ్మంతా fixed చేస్తే నెలనెలా బోల్డంత ఇంట్రెస్ట్ రాదూ?! దాంతో ఆర్నెల్లకో రాజా లాంటి ఇంట్లోకి మారితే ఎంత వెరైటీ.. ఏంటోలే.. అదలా జరిగిపోయింది.

     

    బుద్దీబుర్రా కొన్నిసార్లు పనిచేయవు కాబోలు! అలా కాదులే.. కొన్ని విషయాల్లో result చూసిన తర్వాతే అది తప్పో ఒప్పో అర్ధమౌతుంది. అయినా దేవుడే ఎన్నో తప్పులు చేస్తాడు... లేకపోతే నా lifeని అప్పుడే బొమ్మలు నేర్చుకుంటున్న పిల్లాడేసిన చెత్తబొమ్మలా ఇలా design చేసేవాడా? సూర్యప్రకాష్ లేదా దత్తుగారిలాంటి మాంచి artist వేసిన మాస్టర్ పీస్ paintingలా తీర్చిదిద్దొద్దూ?! కనుక సూత్రధారుడు తప్పులు చేయగా లేనిది నేను పొరపాట్లు చేయడంలో ఆశ్చర్యం ఏముంది?!

     

    సూత్రధారుడు అనగానే ఆర్.గారు గుర్తొస్తారు. ఆయన నాస్తికులు. ''దేవుడి చేతిలో దారాలు ఉంటాయట.. ఆయన దారాలు ఆడిస్తుంటే మనం కడుల్తామాట.. ఒక్క దేవుడి చేతిలో కోట్ల కోట్ల సూత్రాలు.. ఇప్పుడు నేను చెయ్యి పైకి ఎత్తానంటే ఆయన దారం పైకి లాగాడన్నమాట.. ప్చ్.. ఎంత ఫూలిష్ కథలు..'' అంటూ నవ్వేవారు.

     

    నా మట్టుకు నాకు ఎవరైనా చిరాకు పెట్టినప్పుడు దేవుణ్ణి తిట్టుకున్నా.. మళ్ళీ అంతలోనే దోస్తీ కట్టేస్తాను. దేవుడు లేడు అనుకోవాలంటే భయం. ఉన్నాడనుకుంటే ధైర్యంగా ఉంటుంది. కానీ, చిన్ని అడిగే ప్రశ్నలకి జవాబు చెప్పలేక ''అబ్బ.. అవన్నీ ఒట్టి కథలే.. అలా జరగదులే..'' అనేస్తాను. మంచివాళ్ళకి కష్టం వచ్చినప్పుడల్లా నాకు దేవుడి మీద నమ్మకం పోతుంది. కానీ, అది స్మశాన వైరాగ్యంలా క్షణికం.

     

    సర్లే.. జీవితం అన్నాక కష్టాలూ, సుఖాలూ అన్నీ ఉంటాయి. మంచిచెడుల కలగూరగంప. కొన్ని తెలివైన నిర్ణయాలు , ఇంకొన్ని అనాలోచిత నిర్ణయాలు... కొన్ని కూడికలు.. కొన్ని తీసివేతలు.. తప్పదు! తెలివైన పనులకు గర్విస్తూ, తెలివితక్కువ ఫలితాలతో నేర్చుకుంటూ వెళ్తే సరి.. ఇంతలో గమ్యం రానే వస్తుంది.

  • Prev
  • Next