• Prev
  • Next
  • ది డైరీ ఆఫ్ లేఖా గుమ్మడి - 10 The Diary of LEKHA GUMMADI – 10

    ది డైరీ ఆఫ్ లేఖా గుమ్మడి - 10

    The Diary of LEKHA GUMMADI

     

    "80 పేజీలు చదివాను.. సెంటీమీటర్ కథ నడవలేదు'' అన్న సీపీ గారి డైలాగ్ చాలాసార్లు గుర్తొస్తుంది. నా ''మజిలీ'' నవల మీద ఆయన కామెంట్ అది. నిజమే నా కథలు వేటిల్లోనూ కథ ఉండదు. ''ఏం రాశావు'' అని ఎవరైనా అడిగారో చచ్చానే. చెప్పడానికి ఏమీ ఉండదు. కానీ రాస్తాను.. రేపెప్పుడైనా వెయ్యి పేజీల కథ రాసినా అందులో ఒక పేరాగ్రాఫ్ కథ ఉంటుందంతే. అలాగని గాలి పోగేసి రాస్తాను అని ఎవరైనా అన్నారో, వాళ్ళమీద criminal కేసు పెట్టేయడం ఖాయం. మనసును గాయపరచడం అంటే క్రైం కాదేంటి మరి?!

     

    కొందరి రచనల్లో కొండవీటి చాంతాడంత కథ ఉంటుంది. వామ్మో.. ఊహించని మలుపులు, ట్విస్టులు.. మలుపులంటే గుర్తొచ్చింది.. ఓ రచయిత రాసిన నవలను reject చేస్తూ ''ఇందులో మలుపులేమీ లేవు'' అని ఒక పత్రిక ఎడిటర్ తిరిగి ఇచ్చేశారు.

    రచయిత ఓ గంట అక్కడే కూర్చుని ''మార్పులు చేశాను సార్, చూడండి'' అని మళ్ళీ చేతిలో పెట్టాడు.

    ''ఏంటి ముగింపు మార్చారా?'' అని సంపాదకుడు అడిగాడు.

    ''అబ్బే, స్టార్టింగే మార్చాను..'' అన్నాడు.

    సరేనని ఎడిటర్ మొదటి పేరా చదవసాగాడు... ''ఏడంతస్తుల మేడలోంచి కారు బయర్దేరి కొద్దిదూరం వెళ్ళి మలుపు తిరిగింది. రైటుకు వెళ్ళి లెఫ్టుకు మలుపు తిరిగింది.. కారు వెనకే ఉన్న స్కూటరు కూడా మలుపు తిరిగింది...'' అంటూ చదివిన ఎడిటర్ గారికి తల దేనికేసి కొట్టుకోవాలో అర్ధం గాక అయోమయంగా చూశాడు.

     

    అదీ సంగతి. నేనూ ఆ రైటర్ లాంటిదాన్నే కాబోలు. మలుపులు అంటే రోడ్లమీద మలుపులే తెలుసు. కథను నానా రకాలుగా మలుపులు తిప్పడం మనవల్ల కాదు. ఓ ప్రేమ కథే ఉంటే..ఆ ఫీలింగ్స్, అందులో త్రిల్ గురించి రాయగలను. అందులో ప్రేమ అనేది కరువైతే ప్రేమ ముసుగులో వాళ్ళు సాగించే వెర్రి పోకడల్ని చిత్రించగలను. అంతే తప్ప వాళ్ళ తరతరాల కథ రాయడం మనవల్ల కాదు.

     

    ఎక్కువమంది ట్విస్టులతో కూడిన కథని ఇష్టపడతారా.. లేక ఇంట్రస్టింగా ఉండే ఇన్సిడెంట్లని ఇష్టపడతారా అంటే తెలీదు. ఎవరికి ఏది ఇష్టమైనా నాకు మాత్రం ప్రెజెంటేషన్ బాగుండటమే ముఖ్యం. చలంగారి ''మ్యూజింగ్స్'' ఎన్నిసార్లు చదివినా విసుగేయదు. అవేం కథలు కాదుగా.. అయితేనేం, మనసుకి హత్తుకుంటాయి. చలంగారు సరే.. మహానుభావుడు.

     

    అసలు ఎవరైనా గానీ.. ఏం రాసినా అది మాంఛి ఫ్లోతో సెలయేరులా సాగిపోవాలి. బాణంలా దూసుకుపోవాలి. ఆఖరికి ఇలా చేస్తే బాగుంటుంది.. అని మెసేజ్ ఇవ్వడానికి రాసే ఆర్టికల్సు , ఖాళీలు నింపడానికి రాసే పేజ్ ఫిల్లర్లు కూడా చదివించేలా ఉండితీరాలి. ఏదయినా dryగా, బోరింగ్ గా అనిపించింది అంటే ఇక ఆ రాతలకి అర్ధమే లేదు. అవి దాచుకోడానిక్కాదు, మిర్చిబజ్జీ పొట్లాలు కట్టడానికే పనికొస్తాయి.

  • Prev
  • Next