• Prev
  • Next
  • ది డైరీ ఆఫ్ లేఖా గుమ్మడి - 12 The Diary of LEKHA GUMMADI - 12

    ది డైరీ ఆఫ్ లేఖా గుమ్మడి - 12

    The Diary of LEKHA GUMMADI - 12

     

    వీ.గారు మాటల మధ్యలో తను వంట చేస్తానని చెప్పినప్పుడు చాలా సంతోషమేసింది. అవును, ఎక్కువమంది మగవాళ్ళు తినడం మాత్రమే తమ రైట్ అనుకుంటారు. అక్కడికి ఆడవాళ్ళు ఓ చేతిలో చేట, ఇంకో చేతిలో గరిట పట్టుకు పుట్టినట్లు వంటింట్లోకి నెట్టేస్తారు. ఇక జీవితాంతం వంటింట్లో పడి అఘోరించాలి. అంతకంటే విసుగైన పని ఇంకోటి ఉంటుందా? నా మట్టుకు నాకు వంటగది లేని ఇళ్ళు ఉంటే బాగుండును అనిపిస్తుంది.

     

    సరే, నలభీమపాకం గురించి కథల్లో చదవడమే గానీ, ఇంటాబయటా ఎక్కడా అలాంటి అందమైన దృశ్యాలు కనిపించవు. ఎంతసేపూ ఆడవాళ్ళు అష్టకష్టాలు పడి వంట చేస్తే మగవాళ్ళు లొట్టలేయడమే కనిపిస్తుంది. వంట వచ్చిన పురుషపుంగవులు చాలా చాలా తక్కువ. ఒకవేళ నూటిక్కోటికి వచ్చినా ఆ సంగతి బయటకు చెప్పేవాళ్ళు ఇంకా తక్కువ. అదేంటో, వంట చేయడం నామోషీగా, అదేదో దొంగతనం కంటే హీనమైన సంగతిగా పరిగణిస్తారు.

     

    మొత్తానికి ఒకరోజు వీ.గారు ఓ భరిణె తెచ్చి ''బిర్యానీ చేశాను, తిని చూడ''మన్నారు. చెప్పొద్దూ, భయంభయంగా, బిక్కుబిక్కుమంటూ తీసుకున్నాను.

     

    మగవాళ్ళు వంట చేయడం అంటే సంతోషమే కానీ, వాళ్ళు రుచిగా చేస్తారన్న నమ్మకం లేదు. ఆ సాయింత్రం ''అసలే ఒకపక్కన ఎండలు మండిపోతున్నాయి. ఆలూ ముక్కలు ఉడికాయో లేదో.. ఈపాటికి పాడైపోయే ఉంటుంది..'' అనుకుంటూ వీ.గారి భరిణెని తెరిచాను. అంతే, ఆశ్చర్యంతో కళ్ళు తేలేశాను. prestige pressure cooker advertisementsలో చూపే వంటలంత colourfulగా ఉంది. సిసలైన హైదరాబాదీ బిర్యానీ లా ఆగ్రా నుంచి ఢిల్లీదాకా ఘుమాయింపులు.. పోయిన జన్మలో మొఘల్ నవాబు అయ్యుంటారు.. ఆ వంటలు తినీతినీ ఇంత delicious గా వండటం చేతనై ఉంటుంది అనిపించింది.

     

    చిన్ని తిండి విషయంలో పెట్టె పేచీలు ఇన్నీ అన్నీ కావు. ఓ స్పూనుడు తినిపించడానికి స్విస్ బ్యాంక్ లో డబ్బు దాచుకున్నంత కష్టంగా ఉంటుంది. రోజు మొత్తంలో ఇతర పనులన్నీ చేయడం ఒక ఎత్తయితే, దానికి తినిపించడం ఒక్కటీ ఒక ఎత్తు. తిండి దగ్గర రోజూ తాతలు దిగి వచ్చినట్లే అవుతుంది. అంత పెచీకోరూ వీ.గారి బిర్యానీని ఎంత ఇష్టంగా తినిందంటే.. ''వావ్.. ఎంత బాగుందో.. ఎవరు చేశారు.. ఎలా చేశారు.. నువ్వు కూడా అచ్చం ఇలాగే చేయవా..'' అంటూ వంద ప్రశ్నలు, వెయ్యి కితాబులు..! నాకు జెలసీ ముంచుకొచ్చింది. ఇంత లావు పాకశాస్త్ర ప్రావీణ్యాలు మనకెక్కడ అబ్బుతాయి?!

     

    వీ.గారినైతే తెగ మెచ్చుకున్నాను. కానీ, అంతరాంతరాల్లో మట్టుకు ఇప్పటికీ డౌటే.. ఆయనే చేశారా.. లేక బ్రహ్మాండంగా వంటలు చేసే cookని kidnap చేసి బిర్యానీ చేయించి, తను చేశానిని చెప్తున్నారా.. తను చేశానిని చెప్తున్నారా.. లేకపోతే.. ప్యారడైజ్ లోనో తాజ్ మహల్లోనో కొని తేలేదు కదా.. ఛ.ఛ.. అలా ఎందుకు చేస్తారులే.. పచ్చ కామెర్ల రోగికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట.. నాకు వంటలు అద్భుతంగా రావు కనుక ఇతర్లకి వచ్చంటే అంత తేలిగ్గా నమ్మబుద్ధి కాదు. అక్క కూడా అంతే, వంటల్లో దిట్ట. పిండివంటలు కూడా అదరగొట్టేస్తుంది. ''నిజంగా చేశావా, home foodsలో కొనుక్కోచ్చావా?” అంటాను. అసూయ తన్నుకొస్తే వచ్చే మాటలే ఇవి.

     

    ఒకసారి నా మాట విన్న చిన్ని ''చాల్లే ఊరుకో అమ్మా.. పెద్దమ్మ బయట అమ్మేవేవీ తినదు.. అసలు పంచదార, ఉప్పు లాంటివి కూడా వీలయితే ఇంట్లోనే చేస్తుంది'' అనేసింది. నిజంగానే అక్క, నేను ఉత్తర దక్షిణ ధృవాలం. తను అన్నీ చేయాలనుకుంటుంది. నేను ప్రతిదీ readymade గా దొరికితే బాగుండును అనుకుంటాను. ఏంటోగానీ, వంట బాగా వచ్చిన వాళ్ళని చూస్తే ఒకపక్కన సంతోషం, ఇంకోపక్కన ఈర్ష్య..

     

    Art of Diary writing, Funny Diary writing, Funny Diary, Humorous Diary, Funny Memories in Diary

  • Prev
  • Next