• Prev
  • Next
  • ది డైరీ ఆఫ్ లేఖా గుమ్మడి - 6 The Diary of LEKHA GUMMADI - 6

    ది డైరీ ఆఫ్ లేఖా గుమ్మడి - 6

    The Diary of LEKHA GUMMADI

     

     

    కొన్ని ఆర్టికల్స్ పోస్ట్ చేసి, ఇప్పుడేం రాయాలి అని ఆలోచిస్తుండగా శాంతి ఫోన్ చేసి, ''అర్జంటుగా 'ప్రస్థానం' చందా కట్టవే తల్లీ..'' అంది.

    ''అదొకటా?'' అన్నాను.

    '' Special Issueవేశారు.. ఎంత బాగుందో.. ఆ articles వెయ్యి జన్మలెత్తినా మనం సంపాదించలేం'' అంది.

    ''హూ..'' అన్నాను.

    ''అబ్బా.. ఆమాత్రం ఖర్చుపెట్టలేవా.. ఎన్నిటికి తగలేస్తావు.. పోనీ ఓ పూట హోటల్లో తిన్నాననుకో..''

    ''ఓర్నాయనో.. నా డైలాగులు నాకే అప్పజెపుతున్నట్లుంది.. పుస్తకాల విలువ నాకు తెలీదా? కొనలేక్కాదు.. పిసినారితనం కాదు''

    ''మరికేం.. ముందు subscribe చెయ్యి..''

    ''చెప్పేది విను.. ఇప్పటికే ఉన్న పుస్తకాలు కాపాడుకోలేక ఛస్తున్నా.. ఒకప్పుడు ఎవరైనా ప్రేమగా ఏదైనా కొనిపెట్టబోతే ''నాకేమీ ఒద్దు, ఇస్తే మంచి పుస్తకం కొనివ్వండి'' అనేదాన్ని.

    ''తీరా ఇప్పుడు పుస్తకాలు గుట్టలుగా పేరుకుపోయి, ఇల్లు మారాలంటే చచ్చే చావుకొస్తోంది. మొన్న మట్టుకు మొన్న ఆఫీసుకి దగ్గరౌతుంది కదాని ఎగురుకుంటూ దగ్గర్లోకొచ్చామా.. తీరా చిన్ని స్కూలుకోసం మళ్ళీ మారక తప్పలేదు. ఇటు రావడానికి, తిరిగి వెనక్కి పోవడానికి ట్రాన్స్ పోర్టుకు తడిసి మోపెడైంది. డబ్బు సంగతలా ఉంచి నాలుగు పుస్తకాల సంచులు మాయం. ఏడుపు తన్నుకొచ్చింది.

    ''ఈ సంగతి విని పక్కింటావిడ "హయ్యో రామ.. ఫ్రిజ్జో, టీవీనో పొతే ఏడవాలి గానీ.. బుక్స్ పోతే బిక్కమొహం వేసుక్కూర్చుంటారా?'' అంటూ అదోరకం చూపు చూసింది... '' అంటూ నా గోడంతా చెప్పాను.

    ''నిజమే మరి చాలామందికి పుస్తకాల విలువ తెలీదు. పాత కాయితాల వాళ్లకి అమ్మితే పది రూపాయలు కూడా రావు అన్నట్టు ముక్కు విరుస్తారు..''

    ''valuable books పోవడం సంగతి అలా ఉంచి, నా కథలు పబ్లిషైన పత్రికలు పోవడం మరీ దిగులేసింది.. ఏంటోలే శాంతీ.. అడ్డమైన పెన్ నేమ్స్ తో రాసి పాపులర్ అయి చచ్చిందే లేదంటే.. ఆ రికార్డులు కూడా గల్లంతైపోతున్నాయి...." అంటూ గంపెడు దుఃఖాన్ని చెప్పుకుని ఇవతలికి వచ్చాను.

    పోయిన పుస్తకాలు గుర్తుకు రాగానే మనసు మరోసారి మూలిగింది. తొట్టి మొహాలని తగలెయ్యా.. వాళ్ళకి నా బుక్స్ ఎందుకైనా పనికొస్తాయా? ఆ అక్కుపక్షులు జన్మలో కథలు, నవల్లు కాదుకదా ఓ జోకయినా చదివిచచ్చే ముఖాలు కావు. ఇంకేం చేసుకుంటారు? బజ్జీల బండివాడికి అమ్మితే రెండు ప్లేట్ల మిర్చిబజ్జీలొస్తాయి.. వాళ్ళ కక్కుర్తి తగలెయ్యా.. కానీ అవి నాకు మణిమాణిక్యాలతో సమానం...

    వాళ్ళడిగిన కూలి ఎక్కువనిపించినా ఉదారంగా ఇచ్చేశాం.. నాకసలు కిందివాళ్ళతో బేరాలు నచ్చవు. మనకు వేలల్లో రావాలి.. వాళ్లకి వందల్లో ఇవ్వడానికి ఏడిస్తే ఎలా అనిపిస్తుంది.. కానీ నా మంచితనం నాకెప్పుడూ కలిసిరాదు. ప్రతొక్కడూ exploit చేయబోతాడు. రిజల్ట్ చూసినప్పుడు చెడ్డ చిరాకొస్తుంది. ఇలాంటి నీతిమాలిన ఘటాల్ని హుసేన్ సాగర్లోకి గిరాటు కొట్టాలి. ఒద్దులే.. ఇప్పటికే అది కలుషితమైంది.. ఇంకా ఈ శాల్తీలు కూడానా?! మొత్తానికి గొర్రెలు కసాయివాణ్ణే నమ్ముతాయి అని మళ్ళీ మళ్ళీ రుజువౌతున్తుంది.

    ఇంకోసారి కారుణ్యాలూ గోంగూరలూ చస్తే చూపకూడదు.. అనుకుంటాను. కానీ కుక్క తోక వంకర ఎలా పోదో.. నా మనసూ బండబారి చావదు. మెత్తగా ఉంటే అంతే.. పనికిమాలిన idiotలు కూడా రెచ్చిపోతుంటారు.

    అయినా వాళ్ళమీద అంత భరోసా ఏంటి? కాజేస్తారేమో అని కాపలా ఉండాలా.. అబ్బే.. అందరూ మంచోళ్ళలాగే కనిపించి అఘోరిస్తారు. ఎవర్నీ అనుమానించకూడదు అనిపిస్తుంది. ఎందరు చెత్త మొహాలు ఎదురైనా, ఎంత వికారంగా ప్రవర్తించినా ఇంకోసారి ఫ్రెష్ గా మోసపోతుంటాను.

    ఒక్కోసారి నేనెంత మంచిగా ఉన్నాను కదాని మురిపెం కలుగుతుంది. కానీ, నాది మంచితనం కాదేమో.. మోసగాళ్ళని కనిపెట్టలేని తెలివితక్కువతనం ఏమో అని భయంగా ఉంటుంది.

    ఏమయితేనేం.. నా కథలూ కాకరకాయలు ఏ పత్రికల్లో ఎప్పుడెప్పుడు publish అయ్యాయో కూడా గుర్తులేదు.. ఇక వాటిని సంపాదించడం ఎలా అనే దిగులు ఆక్టోపస్ లా చుట్టేసింది.

  • Prev
  • Next