• Prev
  • Next
  • ది డైరీ ఆఫ్ లేఖా గుమ్మడి - 11 The Diary of LEKHA GUMMADI - 11

    ది డైరీ ఆఫ్ లేఖా గుమ్మడి - 11

    The Diary of LEKHA GUMMADI

     

    పుస్తకాలు తిరగేస్తోంటే ఎస్వీ రామారావు గారి books కనిపించాయి. నా ముఖం భలే వికసించింది. అవును, కొందరు వ్యక్తులు గుర్తొస్తే చాలు ముఖాన నవ్వులు పూస్తాయి. ఆయన్ని తల్చుకోగానే పక్షులు, మేఘాలు కళ్ళముందు మెదుల్తాయి. స్వేచ్చ, సంతోషాలకి ప్రతిరూపం అయిన SVగారు abstract painter మాత్రమే కాదు, absolute saint. కల్లాకపటం తెలీని మహర్షి.

     

    Cover Design కూడా రామారావు గారిదే. Painter cum Writer అయితే అంతే మరి! చక్కగా తన రాతలకి తనే బొమ్మలేసుకోవచ్చు. నాలాంటివాళ్ళయితే బొమ్మలకోసం మరెవర్నోదేబిరించాల్సిందే. అవి suit అయినా కాకపోయినా చేయగలిగింది లేదు. సరే, first pageలో ఆర్.గారు రాసిన అపురూపమైన complimentary note మురిపెంగా చదువుకున్నాను. పిచ్చి పూలని కూడా పారిజాత సుమాల్లా భావించడం గొప్పవాళ్ళకే చెల్లుతుంది. ఇక ఆయన జ్ఞాపకాలు కళ్ళముందు మెదిలాయి.

     

    రామారావు గారు చిక్కడపల్లి నుంచి నారాయణ్ గుడా వెళ్ళినంత తేలిగ్గా అమెరికా నుంచి ఇండియా వస్తుంటారు. వచ్చినప్పుడల్లా సందడే సందడి.

     

    ఆర్.గారు తనకు చాలా కావలసిన వాళ్ళ పేర్లు కూడా మర్చిపోయేవారు. నాక్కూడా చాలామంది గుర్తుండరు కానీ, మరీ క్లోజ్ అయితే మర్చిపోను. ఎవరికైనా ఫోన్ చేయాలంటే అడ్డదిడ్డంగా రాసుకున్న పేర్ల చిట్టాను పై నుండి చివరిదాకా చదివి.. ''ఆ.. ఈయనకే చేయాలి..'' అనేవారు సంబరంగా. అవసరమైన వ్యక్తి పేరు, నంబరు దొరికినందుకు వాస్కోడిగామా డిస్కవరీ లెవెల్లో ఆయన ముఖం వెలిగేది.

     

    ఎస్వీగారు. అబ్బ.. ఏం ఆర్టిస్టు..ఎంత నాలెడ్జ్.. ఆయన్ని ''living encyclopedia'' అనొచ్చేమో! ఊహూ..ఆ కితాబు ఎంతమాత్రం సరిపోదు. ఎన్సైక్లోపీడియాలు, డిక్షనరీలు జ్ఞాన గనులు... అంతే. వాటిని తిరగేస్తే అర్ధాలు, పరమార్ధాలు తెలుస్తాయి. పర్యాయ పదాలు, ప్రాముఖ్యాలు బోధపడతాయి. అంతవరకే!

     

    రామారావుగారు అలా డ్రైగా విషయాన్ని చెప్పరు. Text booksలా మెదళ్ళ కుండల్లో సమాచారాన్ని కుమ్మరించరు. ఆయనతో కాలక్షేపం అద్భుతమైన పుస్తకం చదువుతున్నట్టుగా, మొఘల్ గార్డెన్లో పచార్లు చేస్తున్నట్టుగా, మిత్రునితో సరదాగా మాట్లాడుతున్నట్టుగా, ఉద్దండుల కళాఖండాలను కళ్ళార్పకుండా చూస్తున్నట్టుగా ఉంటుంది. అలాగని అదేదో time pass బఠాణీల వ్యవహారం కాదు. రామారావుగారి మాటలు interestingగా, inspiringగా ఉంటాయి. విజ్ఞానానికి వినోదాన్ని జోడించి మాట్లాడ్డం ఆయనకే చేతనౌతుంది. పద్మశ్రీలూ గట్రా సాధించిన కళాకారుడు, chicago లో ఉంటూ మహామహుల ప్రశంసలు పొందిన international artist ఒక్క నలుసంత గర్వం కానీ అతిశయం కానీ లేకుండా స్నేహంగా మాట్లాడ్తారు. Simple man with noble ideas.. ఇంత నిగర్వంగా ఉండటం కోటిలో ఒక్కరికి సాధ్యమేమో! అలాంటి అరుదైన కోహినూర్ వజ్రం. ఛఛ.. ఇదేం పోలిక?! కోహినూర్ ఒక విలువైన రాయి మాత్రమే.

     

    రామారావుగారిలో విజ్ఞానంతో బాటు వినోదమూ ఉంది. హ్యుమానిటీతో బాటు హ్యూమరూ ఉంది. ఒకరోజు హిందీ ప్రస్తావన వచ్చి ''మీకు హిందీ వచ్చా?” అన్నాను. ''ఆ.. బ్రహ్మాండంగా వచ్చు.. యే మేజా హై.. యే కుర్సీ హై..'' అంటూ నవ్వారు. వావ్.. ఏం హాస్యం.. హిందీ మీద చాలామందే జోకులు వేస్తారు. చిన్నప్పుడు ఝాన్సీ ''ఏం మాట్లాడినా చివర హై పెట్టేస్తే హిందీ అయిపోతుంది'' అనేది. ''ఏం రాసినా పైన ఒక అడ్డగీత గీసేస్తే హిందీ అయిపోతుంది'' అంటాడు రవి.

     

    ఒకసారి రామారావుగారు నేను రాసిందేదో చూసి ''marvellous.. మీరు నా friend అని చెప్పుకోడానికి గర్వంగా ఉంది..'' అన్నారు. ఓహ్.. nobel prize వచ్చినంత ఆనందమేసింది. ఇంకోసారి ''ఒక్క కొట్టివేత లేకుండా భలే రాశారే...'' అంటూ తెగ మెచ్చుకున్నారు. నా రాతల్లో సామాన్యంగా కొట్టివేతలు ఉండవు. కథలు, కాకరకాయలే కాదు.. నవల రాసినా ఒక్కసారే రాస్తాను. Fair చేయడం కాదుగదా.. కనీసం వెనక్కి తిరిగి చూసుకోను. అది గర్వం కాదు.. ఒళ్ళు బద్ధకం.

     

    నేను నవ్వేసి ''రాతలో తప్పులు ఉండవు కానీ.. జీవితం నిండా పొరపాట్లు, కొట్టివేతలే.. దాన్ని చించి చెత్తబుట్టలో పడేయలేనుగా'' అన్నాను .

     

    రామారావుగారు మహర్షిలా చిద్విలాసంగా నవ్వి ''అసలు వంకరటింకర్లు, కొట్టివేతలు లేకపోతే ఆ జీవితంలో అందమే లేదు. straight line ఏమైనా బాగుంటుందా.. తప్పులు చేస్తాం.. చేయాలి.. వాటితో బోల్డంత నేర్చుకుంటాం..'' అంటూ చెప్పుకొచ్చారు.

     

    ఇసుకరేణువులు, గులకరాళ్ళ లాంటివాళ్ళు ఎగిరి పడ్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది కదా... ''మేరుపర్వతంలా ఎదిగి కూడా నిశ్చలంగా ఉండే రామారావుగారితో వీళ్ళు కాసేపు మాట్లాడితే బాగుండును.. కొంచెమైనా మారతారేమో'' - అని.

  • Prev
  • Next