ముఖ్యమంత్రిని తప్పు పట్టడమే పార్టీ విధానంగా మార్చుకొన్న వైకాపా?

 

రాజకీయ పార్టీల మధ్య స్నేహాలు, శత్రుత్వాలు సర్వసాధారణమయిన విషయమే. మిత్రులుగా ఉన్నప్పుడు తప్పులు సమస్యలను పట్టించుకోకపోవడం, శత్రువులుగా ఉన్నప్పుడు విమర్శించుకోవడం కూడా సహజమే. ఒక స్థాయి వరకు మాత్రమే విమర్శలు చేసుకొంటే పరువాలేదు. కానీ తమ మధ్య ఉన్న శత్రుత్వం కారణంగా వ్యక్తిగత దూషణలకు, బెదిరింపులకి దిగుతూ రాజకీయాలను ఇంకా నీచ స్థాయికి దిగజార్చితే అంతిమంగా దాని విషపరిణామాలను ఎదుర్కోవలసింది..నష్టపోయేది కూడా ఆ రాజకీయ పార్టీలు, వాటి నేతలే తప్ప ప్రజలు కాదు.

 

రాజశేఖర్ రెడ్డి మరణించినప్పటి నుండి ముఖ్యమంత్రి కావాలని జగన్మోహన్ రెడ్డి ఎంతగా పరితపించిపోతున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ తనకు ఆ అవకాశం దక్కకపోవడానికి చంద్రబాబు నాయుడే కారకుడని దృడంగా విశ్వసిస్తున్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని లక్ష్యంగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో యుద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం ఏమి చేసినప్పటికీ దానిలో తప్పులు ఎంచుతూ విమర్శించడమే తన పార్టీ విధానంగా మార్చేసుకొన్నారు.

 

అమెరికాలోని చికాగో విశ్వవిద్యాలయం చంద్రబాబు నాయుడుకి గౌరవ డాక్టరేట్ ఇస్తున్నట్లు ప్రకటించగానే దానిపై కూడా వైకాపా ఎమ్మెల్యే రోజా చాలా అనుచితంగా మాట్లాడారు. చంద్రబాబు నాయుడుకి చికాగో విశ్వవిద్యాలయాన్ని ‘మేనేజ్’ చేసి డాక్టరేట్ సంపాదించుకొంటున్నారని రోజా ఆరోపించారు. ఆయనకు డాక్టరేట్ ఇచ్చి చికాగో విశ్వవిద్యాలయం తన స్థాయిని దిగజార్చుకొందని విమర్శించారు. అయితే చంద్రబాబు నాయుడుకి ఈ డాక్టరేట్ వచ్చినా రాకపోయినా కొత్తగా వచ్చే లాభమూ లేదు... నష్టమూ లేదని అందరికీ తెలుసు. అది కేవలం ఒక గుర్తింపు మాత్రమే. దాని కోసం ఆయన అర్రులు చాచవలసిన అవసరం లేదని అందరికీ తెలుసు. ఒకవేళ చికాగో విశ్వవిద్యాలయంలో నిజంగా ఎవరయినా ‘మేనేజ్’ చేసి డాక్టరేట్ డిగ్రీలు ఇప్పించుకొనే అవకాశమే ఉండి ఉంటే అదిచ్చే డాక్టరేట్లను ఎవరూ స్వీకరించి ఉండేవారే కాదు.

 

చంద్రబాబు నాయుడుని ఏదో ఒకవిధంగా అవమానించాలి. ప్రజలలో ఆయనపట్ల అపోహలు, అనుమానాలు సృష్టించాలి. అప్రదిష్ట పాలు చేయాలనే తపన వైకాపా చేస్తున్న ప్రతీ ఆరోపణలో ప్రస్పుటంగా కనిపిస్తుంటుంది. దేశంలో పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండవ స్థానంలో ఉందని ప్రపంచ బ్యాంక్ ప్రకటిస్తే, అందుకు రాష్ట్ర ప్రజలందరూ చాలా సంతోషించారు కానీ వైకాపా నేతలు చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంక్ ని కూడా ‘మేనేజ్’ చేసి ఆ ప్రకటన ఇప్పించుకొన్నారని విమర్శించారు.

 

ప్రపంచ బ్యాంక్ చేసిన ఆ ప్రకటన వలన రాష్ట్రానికి ఎంతో కొంత లాభమే తప్ప నష్టం జరగదని అందరికీ తెలుసు. కానీ తెదేపాను వ్యతిరేకించడమే పార్టీ విధానంగా మార్చుకొన్న వైకాపా నేతలు రాష్ట్రానికి మేలు చేకూరేవాటిని కూడా వ్యతిరేకిస్తారని అది స్పష్టం చేస్తోంది. తెదేపా ప్రభుత్వం తప్పులు చేస్తే తప్పకుండా వేలెత్తి చూపవలసిందే. తెదేపాకు మిత్రపక్షంగా ఉన్న బీజేపీ, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా దాని తప్పులను వేలెత్తి చూపుతూ ప్రభుత్వం తన తప్పులను సరిదిద్దుకోనేలాగ వారు చేస్తుంటారు తప్ప వైకాపా నేతల్లాగ ఉచితానుచితాలు మరిచి నిత్యం వ్యక్తిగత దూషణలకి, విమర్శలకి దిగరు.

 

ఇదివరకు నిత్యం రామోజీరావుని, ఆయన రాజకీయ విధానాలని విమర్శిస్తూ, అవహేళన చేస్తూ సాక్షి మీడియాలో కధనాలు, కార్టూన్లు ప్రచురించేవారు. కానీ ఒకానొకరోజున జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆయన వద్దకే వెళ్లి చేతులు జోడించి మాట్లాడవలసి వచ్చింది. దానివలన రామోజీరావు గౌరవం మరింత పెరిగితే జగన్మోహన్ రెడ్డి ప్రజలలో మరింత పలుచబడ్డారు. ఒక స్థాయికి మించి విమర్శలకు, దూషణలకు పాల్పడితే చివరికి ఏమవుతుందో తెలుసుకోవడానికి అదే ఒక చక్కటి ఉదారణగా నిలుస్తోంది.

 

తన బద్ధ శత్రువయిన రామోజీరావు ముందు చేతులు జోడించి నిలబడవలసిన పరిస్థితి ఎందుకు కలిగింది? అని ఆలోచించి మళ్ళీ అటువంటి పరిస్థితులు చేజేతులా కల్పించుకోకుండా జాగ్రత్తపడాలి. కానీ జగన్మోహన్ రెడ్డి యధాప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి తొమిదేళ్ళుగా రాజకీయాలలో ఉన్నప్పటికీ ఇంకా రాజకీయ అపరిపక్వత ప్రదర్శిస్తూ, చిన్న పిల్లాడిలా ముఖ్యమంత్రి అంతటివాడికి రకరకాల పేర్లు పెడుతూ అవహేళన చేస్తున్నారు. ఎక్కడో అమెరికాలోని చికాగో విశ్వవిద్యాలయం మన ముఖ్యమంత్రిని డాక్టరేట్ ఇచ్చి గౌరవిస్తుంటే, రాష్ట్రానికి చెందిన వైకాపా నేతలు ఆయన పట్ల చాలా అనుచితంగా మాట్లాడుతున్నారు.

 

యదా రాజ తదా ప్రజా అన్నట్లుగా తమ పార్టీ అధ్యక్షుడే ముఖ్యమంత్రి పట్ల అనుచితంగా మాట్లాడుతుంటే, వైకాపా ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, రోజా వంటివారు వేరేలా మాట్లాడుతారని ఎవరూ ఆశించలేరు. కానీ అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లు దేనికీ ‘అతి’ పనికి రాదని పెద్దలు చెపుతుంటారు. తమిళనాడు రాష్ట్రంలో డిఎంకె, అన్నా డిఎంకె పార్టీలు రెండూ పోటాపోటీగా ఆ రాష్ట్ర రాజకీయాలను అత్యంత నీచస్థాయికి తీసుకువెళ్ళిపోయాయి. చివరికి ఆ రెండు పార్టీలే అవి ప్రదర్శించిన ఆ ‘అతి’కి మూల్యం చెల్లించడం అందరూ కళ్ళారా చూసారు. కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వైకాపా ఆ స్థాయికి రాజకీయాలు దిగజార్చాలని ప్రయత్నిస్తే చివరికి తమిళనాడు పరిస్థితులే ఇక్కడా పునరావృతం కాక తప్పదని గ్రహించాలి.