వైకాపా అందుకే ఇంత హడావుడి చేసిందేమో?

 

వైకాపా నగరి ఎమ్మెల్యే రోజా నిన్న శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల అనుచితంగా మాట్లాడటంతో స్పీకర్ కోడెల ఆమెను ఏడాదిపాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. అయితే అప్పుడు రోజా కానీ జగన్మోహన్ రెడ్డి గానీ పెద్దగా నిరసనలు, అభ్యంతరాలు తెలియజేయలేదు. పైగా తనను సభ నుంచి సస్పెండ్ చేసినందుకు బాధపడటం లేదని, చేసిన విధానానికే ఎక్కువ బాధపడుతున్నానని రోజా స్వయంగా మీడియాతో చెప్పారు. ఇక నుండి ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతుంటానని చెప్పారు. ఆమె చెప్పిన ఈ మాటలను బట్టి సభ నుంచి ఏడాదిపాటు సస్పెండ్ అయినందుకు ఆమె ఏ మాత్రం బాధపడటంలేదని స్పష్టం అవుతోంది. ఒకవేళ తనను సభ నుంచి సస్పెండ్ చేయడం అన్యాయమని ఆమె భావించి ఉండి ఉంటే, నిన్ననే ఆమె స్పీకర్ ని క్షమాపణలు కోరి సస్పెన్షన్ వేటు పడకుండా తప్పించుకొనేది. లేదా కనీసం ఇవ్వాళ్ళ ఆయనను కలిసి తనపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయమని కోరుతాననో లేకపోతే ఆయన నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేస్తాననో చెప్పి ఉండాలి. కానీ నిన్న ఆమె అటువంటి మాటలేవీ చెప్పకుండా ఇక నుండి ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతుంటానని చెప్పారు. అంటే తనను సస్పెండ్ చేసినందుకు బాధపదలేదని ఆమె నిజంగానే చెప్పారని అర్ధమవుతోంది.

 

సాధారణంగా ఎమ్మెల్యేలని కొన్ని రోజులపాటు సస్పెండ్ చేసినా చాలామంది తీవ్ర మనస్తాపానికి గురవుతుంటారు. కానీ రోజాని ఏకంగా ఏడాది పాటు సభ నుంచి సస్పెండ్ చేసినా ఆమె కించిత్ బాధపడలేదు. అదే ముక్క ఆమె చాలా దైర్యంగా చెప్పారు కూడా. మరి అటువంటప్పుడు మళ్ళీ ఆమె అసెంబ్లీకి వచ్చి హడావుడి చేయడం, పోలీసులతో ఘర్షణ పడటం, స్పృహ తప్పి పడిపోవడం, నిమ్స్ ఆసుపత్రిలో చేరడం, జగన్ ఎమ్మెల్యేలను వెంటబెట్టుకొని వెళ్లి ఆమెను పరామర్శించడం, ఆమె ఆరోగ్యం గురించి మీడియాకి బ్రీఫింగ్ చేయడం అంతా చాలా నాటకీయంగా ఉంది. రోజా అసెంబ్లీ బయట హడావుడి చేస్తే, జగన్మోహన్ రెడ్డి, వైకాపా సభ్యులు సభ లోపల ఆమెపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుతూ సభా కార్యక్రమాలను స్తంభింపజేసి, సభను వాయిదా పడేలా చేసి ఆ డ్రామాను మరింత రక్తి కట్టించారు. ఒకవేళ ఆమెకి సభకి రావాలనే ఆసక్తి ఉన్నా లేకపోయినా, ఆమెను సభ నుంచి అంత సుదీర్ఘ కాలానికి సస్పెండ్ చేస్తునప్పుడు తక్షణమే జగన్మోహన్ రెడ్డి అందుకు అభ్యంతరం చెప్పి ఉండి ఉంటే నేడు ఆయన వాదనకు అర్ధం ఉండేది. నిన్న ఆమె సస్పెండ్ అయిన తరువాత జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ సభ్యులు అసలు ఏమీ జరగనట్లుగా సభా కార్యక్రమాలలో పాల్గొన్నారు. కానీ ఈరోజు ఆమె సస్పెన్షన్ ఎత్తివేయాలని సభను స్తంభింపజేయడం చాలా విడ్డూరంగా ఉంది. తనను సభ నుంచి సస్పెండ్ చేసినందుకు బాధపడటం లేదని రోజా నోరు జారినందుకు, మీడియాలో జబర్దస్త్ కామెంట్లు వినిపించాయి. బహుశః ఆ కారణంగానే వారు ఇంత హడావుడి చేయవలసి వచ్చిందేమో?

 

ఆమెకు సభకు తిరిగి రావాలనే ఉద్దేశ్యమే ఉండి ఉంటే, ఆమె స్పీకర్ కోడెల శివప్రసాద రావుని కలిసి, నిన్న ముఖ్యమంత్రితో తన అనుచిత ప్రవర్తనకు క్షమాపణలు చెప్పుకొని, తనపై సస్పెన్షన్ ఎత్తివేయవలసిందిగా కోరవచ్చును. లేదా ఆమెకు ఆ అవకాశం లేకపోతే తన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ద్వారా సభలో క్షమాపణలు కోరి, సస్పెన్షన్ ఎత్తివేయించుకోవచ్చును. ఆమె తన తీరు మార్చుకొనేందుకు అంగీకరించినట్లయితే ఆమెపై సస్పెన్షన్ ఎత్తివేయడం గురించి ఆలోచిస్తామని అసెంబ్లీ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. అంటే ఆమెపై విధించిన సస్పెన్షన్ తొలగించుకొనేందుకు ఇంకా అవకాశం ఉందని స్పష్టమవుతోంది. కానీ రోజా, జగన్మోహన్ రెడ్డి, వైకాపా సభ్యులు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకోవడం లేదనే విషయం ఈరోజు వారు సభలో వ్యవహరించిన తీరుతో అర్ధమవుతోంది. ఒక ఎమ్మెల్యేని ఏడాదిపాటు సభ నుంచి సస్పెండ్ చేయడం సముచితమా కాదా? అనే చర్చను పక్కనబెట్టి ఆలోచిస్తే, స్పీకర్ కి క్షమాపణలు చెప్పి సస్పెన్షన్ ఎత్తివేయించుకొనే అవకాశం ఉన్నా దానిని వైకాపా ఎందుకు వినియోగించుకోవడానికి ఇష్టపడలేదు? ఇష్టం లేకపోయినా మళ్ళీ ఆమెపై సస్పెన్షన్ ఎత్తివేయాలని ఎందుకు పట్టుబడుతున్నారు? అనే సందేహాలు కలగడం సహజం. సస్పెన్షన్ గురించి రోజా మాట్లాడిన మాటల వలన ప్రజలలో దురభిప్రాయం ఏర్పడి ఉండవచ్చును. దానిని తొలగించి తిరిగి రాష్ట్ర ప్రభుత్వమే నిరంకుశ పాలన సాగిస్తోందని రుజువు చేసేందుకే వైకాపా సభ్యులు ఈవిధంగా వ్యవహరించి ఉండవచ్చును. వైకాపా ఆలోచనలకు జగన్మోహన్ రెడ్డి మాటలు అందుకు అద్దం పడుతున్నాయి.