వైకాపా వ్యూహం మళ్ళీ బెడిసి కొట్టబోతోందా?

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈరోజు మొదలయిన వెంటనే ప్రధాన ప్రతిపక్షమయిన వైకాపా కాల్ మనీ వ్యవహరంపై తక్షణమే సభలో చర్చకు అనుమతించాలని పట్టుబడుతూ సభా కార్యక్రమాలను స్తంభింపజేస్తోంది. రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్న కాల్ మనీ వ్యవహారం, ఆ కారణంగా రాష్ట్రంలో అనేకమంది మహిళలు కాల్ మనీ గూండాల చేతిలో దౌర్జన్యానికి గురవడం చాలా తీవ్రమయిన విషయమే. ఉభయసభలలో దానిపై లోతుగా చర్చించి, ఈ సమస్యకు పరిష్కారం కనుగొనవలసిన అవసరం ఉంది. కానీ అధికార తెదేపాని అసెంబ్లీలో గట్టిగా ఎదుర్కోవాలనే తాపత్రయంలో వైకాపా సభ్యులు చేస్తున్న ఆందోళన కారణంగానే దానిపై సభలో ఎటువంటి చర్చ జరగకుండాపోయే ప్రమాదం కనబడుతోంది.

 

ఈ వ్యవహారంపై సభలో రేపు చర్చిద్దామని సభాపతి డా.కోడెల శివప్రసాద రావు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా వినకుండా వైకాపా నేతలు సభాకార్యక్రమాలను స్తంభింపజేస్తుండటంతో చాలా తీవ్రమయిన ఈ సమస్యపై సభలో ఎటువంటి చర్చ జరగకుండా అధికార ప్రతిపక్ష సభ్యులు ఒకరిపై మరొకరు వ్యక్తిగత స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేసుకోవడానికే సభా సమయం సరిపోతోంది. కేవలం కాల్ మనీ వ్యవహారం గురించి మాత్రమే కాకుండా ఇంకా కల్తీ మద్యం వ్యవహారం, రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం అమలు చేయడం, విశాఖ ఏజన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలను అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు తదితర అనేక సమస్యల గురించి సభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని వైకాపా నిన్ననే ప్రకటించింది. కానీ కాల్ మనీ వ్యవహారంపై చర్చకు పట్టుబడుతూ తను లేవనెత్తాలనుకొన్న ఈ సమస్యలపై కూడా సభలో ఎటువంటి చర్చ జరగకుండా చేసుకొంటోంది.

 

శాసనసభలో ప్రభుత్వంపై ఎంత ధాటిగా విరుచుకుపడితే అంత గొప్ప అన్నట్లు వైకాపా వ్యవహరిస్తోంది తప్ప, తను అమలు చేస్తున్న ఈ వ్యూహంలో తనే స్వయంగా ఇరుక్కొందని గుర్తించలేకపోతోంది. ఆ కారణంగా ప్రభుత్వం ఈ వ్యవహారాలలో సభలో ఎటువంటి సంజాయిషీలు చెప్పుకొనే అవసరం లేకుండా చేస్తోంది. అలాగే ఈ సమస్యలపై సభలో చర్చించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉన్నప్పటికీ, వైకాపాయే సభా కార్యక్రమాలు జరుగకుండా అడ్డుపడుతూ వాటిపై చర్చజరగకుండా అడ్డుపడుతోందనే అభిప్రాయం ప్రజలకు కలిగేలా చేస్తోంది. సభా కార్యక్రమాలను జరుగకుండా అడ్డుపడటం వలన అధికార పార్టీకి ఎటువంటి నష్టమూ ఉండబోదనే సంగతి ప్రధాన ప్రతిపక్షమయిన వైకాపాకు తెలియక పోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.

 

మిగిలిన నాలుగు రోజులు కూడా వైకాపా సభ్యులు ఇదేవిధంగా సభా కార్యక్రమాలను అడ్డుకొన్నట్లయితే ప్రభుత్వం ఎవరికీ ఎటువంటి సమాధానం చెప్పుకోనవసరం లేకుండానే బయటపడగలదని గ్రహిస్తే ఈవిధంగా వ్యవహరించి ఉండేదే కాదు. ఇంత చిన్న విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియకపోవడం విచిత్రంగానే ఉంది. కనీసం ఆ పార్టీలో సీనియర్ నేతలయినా ఆయనకు చెప్పి ఉండాల్సింది. ఒకవేళ ఈ సమస్యలన్నిటిపై చర్చ జరుగకుండా అసెంబ్లీ సమావేశాలు ముగిసినట్లయితే, సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు ఉండిపోతుంది.