మూగబోయిన ప్రజాగాయకుడు... ఉద్యమానికి దూరంగా ఉండటానికి కారణమేంటి?

 

గత ఆరునెలలుగా ప్రజాగాయకుడు గద్దర్ జాడ కనిపించడం లేదు. తెలంగాణ ఉద్యమం నుండి 2018 మహా కూటమి వరకు చాలా చురుగ్గా ఉన్నారు గద్దర్.  49 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే గద్దర్ ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్న చక్కర్లు కొడుతుంది. ఉద్యమం అంటే ముందుండి.. తనదైన శైలిలో పాటలతో ఉత్తేజ పరుస్తారు గద్దర్. ఆర్టీసీ కార్మికులకు ఆయన సంఘీభావం కూడా ప్రకటించలేదు. ఆర్టీసీ సమ్మెకు గద్దర్ ఎందుకు దూరంగా ఉన్నారో కూడా ఎవరికీ అర్థం కావడం లేదు. గద్దర్ మౌనానికి కారణమేంటి అనేది హాట్ టాపిక్ గా మారింది. గద్దర్ రాజకీయాలకు.. ప్రజా సమస్యలకు.. దూరంగా ఉన్నారా అనే ప్రశ్నలు ఇప్పుడు ఎదురవుతున్నాయి. 

2018 ఎన్నికల టైంలో సోనియగాంధీ మొదలు చంద్రబాబు వరకు హేమాహేమీలతో సమావేశమవుతూ బిజీ బిజీగా గడిపిన గద్దర్ ఎందుకు సైలెంట్ అయ్యారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రజా కూటమి తరపున ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత ప్రజాకూటమి పరాజయం తరువాత గద్దర్ సైలెంట్ అయ్యారు. ప్రస్తుతం గద్దర్ సొంత పనుల్లో నిమగ్నమయ్యారని ప్రచారం జరుగుతుంది. కర్ణాటకలోనే ఎక్కువగా ఉంటున్నట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మొత్తానికీ ఆయన లోకల్ లో ఎక్కువగా ఉండటం లేదంటున్నారు. కానీ ఆయన లేని లోటు మాత్రం సమ్మెలో స్పష్టంగా కనిపించిందని ఆయన అభిమానుల వర్షన్.