వాట్సప్ కలిపింది అందరిని
posted on Mar 24, 2015 4:35PM
సామాజిక మాద్యమాల వల్ల నష్టం ఎంత ఉన్నా కొంత లాభం కూడా ఉంది. ఇవి కేవలం ఫొటోలు పోస్టు చేసుకోవడానికి, చాట్ చేసుకోవడానికే కాదు చాలా రకాలుగా ఉపయోగపడుతున్నాయి. అలా పదహారేళ్ల క్రితం తప్పిపోయిన కుమారుడిని తన తల్లిదండ్రుల వద్దకు చేర్చింది వాట్సప్. ఈ ఘటన చెన్నైలో తిరువొత్తియూర్లో జరిగింది. వివరాల ప్రకారం తిరువొత్తియూర్ కు చెందిన దామోదరన్, సుందరి దంపతులకు ఆరుగురు కొడుకులు. వీరందరూ 1999లో పుదుచ్చేరిలో ఒక వివాహ వేడుకకు వెళ్లగా ఆ సమయంలో దామోదరన్ ఐదో కొడుకు శిగామణి (7) తప్పిపోయాడు. శిగామణి కోసం తల్లిదండ్రులు తీవ్రంగా గాలించారు. ఎన్నో పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. కొన్నాళ్లు కుమారుడి కోసం దామోదరన్ కుటుంబం పుదుచ్చేరిలోనే ఉన్నారు. కానీ ఎటువంటి ఉపయాగం లేకుండా పోయింది. శిగామణి ఆచూకీ మాత్రం దొరకలేదు. అయితే పుదుచ్చేరిలో తప్పిపోయిన శిగామణి చెన్నైలోని ఒక అనాధ శరణాలయానికి చేరుకొని అక్కడే ఇన్ని సంవత్సరాలు జీవనం గడిపాడు. ఇప్పుడు శిగామణికి 23 సంవత్సరాలు. ఎలాగైనా తన తల్లిదండ్రులను కలవాలనే ఆకాంక్షతో తన వివరాలను ఆడియో రికార్డు చేసి వాట్సప్‌లో పెట్టాడు. అలా ఈ సందేశం తిరువొత్తియూర్‌లోని శిగామణి తల్లిదండ్రులకు చేరగా వారు వాట్సప్ నంబరు ద్వారా శిగామణిని సంప్రదించి ఎట్టకేలకు కలుసుకున్నారు.