రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి.. 17 మందికి గాయాలు
posted on Jan 10, 2025 9:27AM
హైదరాబాద్, ఖమ్మం జాతీయ రహదారిపై శుక్రవారం (జనవరి 10) తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. సూర్యాపేట జిల్లా ఐలాపురం గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఛత్తీస్ గఢ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ట్రావెల్స్ బస్సు ఆగిఉన్న లారీ ఢీ కొంది.
ఈ ప్రమాదంలో మరణించిన వారంతా ఛత్తీస్ గఢ్ రాష్ట్రం నుంచి పనుల కోసం హైదరాబాద్ వస్తున్న వారే. ఈ ప్రమాదంలో మరో 17 మంది కూలీలు గాయపడ్డారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెబుతున్నారు. ప్రమాద సంఘటన గురించి తెలియగానే సూర్యాపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సూర్యాపేల ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ఉన్నారు. బస్సు అతి వేగంగా వెడుతుండటమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.