ప్రత్యేక హోదా సాధించకపోతే దానికి తెదేపా మూల్యం చెల్లించాలా?

 

ఏపీకి ప్రత్యేక హోదా సాధించడంపైనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. హోదా సాధించుకువస్తే వచ్చే ఎన్నికలలో మళ్ళీ ఆయనకే అధికారం ఖాయమని లేకుంటే ఆయన ఉనికి కోల్పోవచ్చని జోస్యం చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేనట్లు కేంద్రప్రభుత్వం ఇప్పటికే చాలాసార్లు స్పష్టం చేసింది. కనుక చంద్రబాబు ప్రయత్నం సఫలం అవకపోవచ్చును. బహుశః ఈ సంగతి గ్రహించే ఉండవల్లి ముందుగానే అయన ముందరి కాళ్ళకి బందం వేసే ప్రయత్నం చేస్తున్నట్లుంది.

 

ప్రత్యేక హోదా కేంద్రప్రభుత్వం పరిధిలో ఉన్న అంశమని ఎంపీగా పనిచేసిన ఆయనకి తెలిసే ఉండాలి. చంద్రబాబు తన ప్రయత్నాలు తను చేసినప్పటికీ కేంద్రప్రభుత్వం ఇవ్వకపోతే దానికి ఆయన ఏవిధంగా బాధ్యుడు అవుతారు? అటువంటప్పుడు ఈ అంశంపై చంద్రబాబు భవిష్యత్ ఆధారపడి ఉంటుందని ఉండవల్లి ఎందుకు చెపుతున్నారు? అంటే ఆయన వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మనసులో మాటలనే పలుకుతున్నట్లున్నారు. ఈమధ్యన ఆయన వైకాపాకు దగ్గరవుతున్నారని ఆయనను పార్టీలోకి రప్పించేందుకు జగన్ కూడా ప్రయత్నిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తను కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వెళ్ళలేనని ఆయనే స్వయంగా చెప్పుకొన్నారు. ఒకవేళ వెళ్ళాలనుకొన్నా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో కోలుకొనే అవకాశాలు కనబడటం లేదు. కనుక వైకాపాకు దగ్గరయ్యేందుకే ఆయన కూడా జగన్ లాగే చంద్రబాబు, ఆయన ప్రభుత్వ భవిష్యత్ గురించి జోస్యం చెపుతున్నరేమోననే అనుమానం కలుగుతోంది.

 

రాహుల్ గాంధీ గుర్తు చేసేవరకు ప్రత్యేక హోదా గురించి గట్టిగా మాట్లాడేందుకు కూడా ఇష్టపడని జగన్మోహన్ రెడ్డికి దాని కోసం ఇప్పుడు హటాత్తుగా డిల్లీ వెళ్లి ఐదు గంటలు దీక్ష చేసి వచ్చినా, రాష్ట్ర బంద్ కి పిలుపునిచ్చినా ఆయనకీ విషయంలో చిత్తశుద్ధి ఉందనుకోలేము. కానీ ప్రత్యేక హోదాతో సహా అన్ని హామీల కోసం తెదేపా ప్రభుత్వం అధికారం చేప్పట్టక ముందు నుండే గట్టిగా ప్రయత్నాలు మొదలుపెటింది. తెదేపా బీజేపీకి మిత్రపక్షంగా, ఎన్డీయేలో భాగస్వామిగా ఉంది కనుక అది ప్రతిపక్ష పార్టీలలాగ రోడ్లమీదకు వచ్చి ధర్నాలు, బంద్ లు చేయలేదు. ప్రయత్నలోపం లేకుండా కేంద్రప్రభుత్వంపై నిరంతరంగా తీవ్ర ఒత్తిడి చేస్తూనే ఉంది. ఈ సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.

 

కానీ రాజకీయ కారణాలతో ఉండవల్లి వంటివారు చంద్రబాబు నాయుడుని విమర్శిస్తుంటారు. ఇతరులను విమర్శించే ముందు తాము  అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం పట్ల తమ కర్తవ్యాన్ని ఎంతవరకు సక్రమంగా నిర్వర్తించారు? అని ప్రశ్నించుకొంటే మంచిది. ఉండవల్లికి కాంగ్రెస్ పార్టీతో చిరకాల అనుబంధం ఉంది. పార్టీలో మంచి పలుకుబడి గల నేతగా ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. కానీ రాష్ట్ర విభజన అనివార్యమని తెలిసిన తరువాత కూడా ఆయన తన ఈ తెలివి తేటలు, పలుకుబడి, రాజకీయ అనుభవం అన్నిటినీ ఉపయోగించి రాష్ట్రానికి నష్టం జరగకుండా అవసరమయిన అన్ని హామీలను విభజన చట్టంలో చేర్పించే ప్రయత్నం చేయలేదు. ఆ సమయంలో ప్రజల నుండి ఎదురవుతున్న ఇబ్బందికర పరిస్థితుల నుండి తప్పించుకొనేందుకు మిగిలిన ఎంపీలతో కలిసి విభజనను అడ్డుకొంటున్నట్లు నటిస్తూ తమపై బహిష్కరణ వేటు వేయించుకొని సమైక్య సమర యోధులుగా, ఎంపీ పదవులను త్యజించిన గొప్ప త్యాగమూర్తులుగా చాలా లౌక్యంగా ఈ సమస్య నుండి బయటపడ్డారు. ఆనాడు తమ కర్తవ్యాన్ని, బాధ్యతలను విస్మరించిన నేతలందరూ ఇప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో సహా అన్ని సాధించుకు రావలసిన బాధ్యత చంద్రబాబు నాయుడిదే...లేకుంటే ఆయనకు భవిష్యత్ లేదు అని జోస్యం చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది.

 

ఒకవేళ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోతే అప్పుడు ఏమి చేయాలో చంద్రబాబే నిర్ణయించుకొంటారు. ఆయన నిర్ణయం తప్పా ఒప్పా? అనే సంగతి ప్రజలు చూసుకొంటారు. కానీ ఈలోగా ఉండవల్లి వంటి మేధావులు ఇటువంటి చిలక జోస్యాలు, తీర్పులు చెపుతూ కాలక్షేపం చేసే బదులు రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఏవిధంగా ముందుకు వెళ్ళితే బాగుంటుందో నిర్మాణాత్మకమయిన సూచనలు, సలహాలు ఇస్తే అందరూ హర్షిస్తారు కదా?