రాజధాని భూసేకరణ సమస్యకి పరిష్కారమే లేదా?
posted on Aug 24, 2015 10:03AM
పవన్ కళ్యాణ్ ఆదివారం ఉదయం రాజధాని ప్రాంతంలో ఉండవల్లి, పెనుమాక తదితర గ్రామాల రైతులని వెళ్లి కలిసి భూసేకరణ గురించి వారి అభ్యంతరాలు, అభిప్రాయాలు తెలుసుకొన్నారు. ఆయన స్వయంగా అక్కడ పంటభూములను, నీటి వసతిని పరిశీలించిన తరువాత పెనుమకలో రైతులతో సమావేశమయ్యారు. వారిచ్చిన వినతి పత్రాలను స్వీకరించి, వారి సమస్యలని సావధానంగా విన్నారు. ఆయనను కలిసేందుకు వచ్చిన రైతులు ఏడాదికి మూడు పంటలు పండే తమ భూములను రాజధాని కోసం ఇవ్వడం ఇష్టం లేదని తెలిపారు. ఉండవల్లి తదితర గ్రామాల రైతులు ఆయనని తమ తరపున ప్రభుత్వంతో పోరాడవలసిందిగా కోరారు.
ఆ తరువాత ఆయన వారినుద్దేశ్యించి ప్రసంగిస్తూ, వారి భూములను స్వాధీనం చేసుకొనేందుకు భూసేకరణ చట్టం ప్రయోగించవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. రైతుల సమస్య గురించి తను మాట్లాడితే కొందరు మంత్రులు చాల బాధ్యతారహితంగా సమాధానం చెప్పడాన్ని ఆయన తప్పు పట్టారు. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఆనాడు తను తెదేపా-బీజేపీలకు మద్దతు ఇచ్చానని, అందుకోసం తండ్రివంటి అన్నయ్య చిరంజీవిని కూడా వ్యతిరేకించానని చెప్పారు. తెదేపాకి తను మిత్రపక్షంగా కొనసాగుతున్నంత మాత్రాన్న తను ఆ పార్టీకి, ప్రభుత్వానికి తను బానిసని కానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు. రైతుల సమస్య గురించి మాట్లాడితే తను రాజధాని నిర్మాణానికి అడ్డుతగులుతున్నానని అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు ఆరోపించడాన్ని ఆయన తప్పు పట్టారు.
హూద్ హూద్ తుఫాను సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేప్పట్టిన సహాయ చర్యలకు తను మద్దతు ఇవ్వడమే కాకుండా రూ.50 లక్షలు విరాళం కూడా ఇచ్చానని తెలిపారు. ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి, ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తున్నంత కాలం తన మద్దతు ఉంటుందని కానీ ప్రజల ప్రయోజనాలకు భంగం కలిగినప్పుడు తను తప్పక ప్రజల పక్షాన్న నిలబడి పోరాడుతానని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక క్లిష్టమయిన సమస్యలను పరిష్కరించారని, కనుక ఈ సమస్యని కూడా సామరస్యంగా పరిష్కరించుకోమని, అందుకోసం అవసరమయితే ఈ సమస్య గురించి మంచి అవగాహన కలిగిన జయప్రకాష్ నారాయణ్ వంటి మేధావులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేయమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. ఈ సమస్యను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.
రైతుల నుండి బలవంతంగా భూములు తీసుకోవద్దని, వారిని ఒప్పించి, వారు ఇస్తేనే తీసుకోమని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. ఒకవేళ ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించకుండా ముందుకు వెళ్ళినట్లయితే తను వారి తరపున నిలబడి పోరాడుతానని హెచ్చరించారు. రైతుల నుండి తను స్వీకరించిన వినతి పత్రాలను ముఖ్యమంత్రికి అందజేసి ఆయన ప్రతిస్పందన కనుగొన్న తరువాత తన భవిష్య కార్యాచరణ కార్యక్రమాన్ని ప్రకటిస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ విషయంలో తను వెనక్కి తగ్గేది లేదని అలాగే ఎక్కడికి పారిపోనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు.
ఉండవల్లి, పెనుమాక, బేతపూడి గ్రామాల రైతులు తమ పంట భూములను ప్రభుత్వానికి ఈయబోమని చాలా విస్పష్టంగా చెప్పారు. కానీ రాజధాని నిర్మాణం కోసం ఆ భూములు కూడా అవసరమని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. కనుక వీలయితే ఈ సమస్యకు ఆయననే సరయిన పరిష్కారం చూపమని మంత్రులు రావెల, ప్రతిప్పాటి, నారాయణ తదితరులు కోరారు. కానీ ఈ సమస్యను సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కరించేందుకు ఒక కమిటీని వేయమని ఆయన తిరిగి ప్రభుత్వానికే విజ్ఞప్తి చేసారు. అంటే ఈ సమస్యను పరిష్కరించడం అంత తేలికకాదని ఆయనకి అర్ధం అయినట్లే భావించవచ్చును. కానీ ఆయన మంచి సూచనే చేసారు కనుక ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారం కోసం నిపుణులు, మేధావులు, స్థానిక రైతు సంఘం నేతలతో కూడిన ఒక కమిటీని ఏర్పాటుచేస్తే మంచిది. కానీ మొండిగా ముందుకు వెళితే స్థానిక రైతులు, ప్రతిపక్షాలు, మిత్రుడు పవన్ కళ్యాణ్ నుండి కూడా ప్రతిఘటన ఎదుర్కోవలసి వస్తే దాని వలన ఊహించని అనేక కొత్త సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.
ఈ సమస్య కేవలం ప్రభుత్వానిదో, రైతులదో, కొన్ని రాజకీయ పార్టీలదో కానే కాదు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ సంబందించిన సమస్య. కనుక దీనిపై రాజకీయాలు చేయడం కంటే విజ్ఞతతో పరిష్కారించుకోవడమే అందరికీ మేలు.