సెక్షన్ 8 అమలు చేస్తారనుకోవడం లేదు... కేటీఆర్
posted on Jun 27, 2015 1:20PM
ఇప్పటి వరకూ ఓటుకు నోటు కేసులో ఎన్నో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసు వల్ల రెండు రాష్ట్రాల రాజకీయాలలో రోజురోజుకి వాతావరణం వేడెక్కుతోంది. ఈ వ్యవహారంపై ఎంతో మంది ఎన్నో స్టేట్ మెంట్ లు ఇస్తున్న నేపథ్యంలో తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ ఇప్పుడు ఓ స్టేట్ మెంట్ ఇచ్చారు. ఈ రోజు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ని కలిసిన ఆయన అనేక విషయాలపై చర్చించారు. సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పారిశ్రామిక విధానం బావుందని అరుణ్ జైట్లీ అన్నారని తెలిపారు. అంతేకాక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈయన సెక్షన్ 8 గురించి మాట్లాడుతూ రాష్ట్రంలో సెక్షన్ 8 అమలు చేస్తారనుకోవడం లేదు అని అన్నారు. అంటే కేటీఆర్ తన మాటగా అన్నారా లేక కేంద్రం మాటగా అన్నారా అని అందరూ అనుకుంటున్నారు.
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ నిన్న ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంశాఖ అధికారులతో చర్చించిన తరువాత ఈరోజు కేటీఆర్ ఢిల్లీ వెళ్లడంపై పలు అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కేటీఆర్ సెక్షన్ 8 అమలు చేస్తారనుకోవడం లేదు అని చెప్పడం వల్ల అందరూ ఆలోచనలో పడ్డారు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా కేటీఆర్ ఢిల్లీ వెళ్లొచ్చిన తరువాతే తెలంగాణ ఏసీబీ అధికారులు దూకుడు తగ్గించారని తెలుస్తోంది. ఇప్పుడు కూడా కేటీఆర్ ఎవరిని కలిసినా ఇలా చెప్పడంపై ఇందులో కూడా నిజం లేకపోలేదనిపిస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల మధ్య సమస్యను పరిష్కరించడానికి బాగానే ప్రయత్నిస్తోందని అర్ధమవుతోంది. అయితే ఇప్పటికే తెలంగాణ.. ఆంధ్రా రాష్ట్రాలు సెక్షన్ 8 అమలుపై వాదనలు చేసుకుంటున్నాయి. ఇంకో రెండు రోజులు ఆగితే కాని అసలు ఢిల్లీలో ఏం జరిగిందో అనేదానిపై ఓ స్పష్టత వస్తుంది.